కిర్లంపూడి: బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరి పైకి ట్రాలీ రూపంలో మృత్యువు దూసుకువచ్చింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కిర్లంపూడి ఎస్సై బి.ఉమామహేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని సింహాద్రిపురం అడ్డురోడ్డు నర్సరావు కాలనీకి చెందిన గొడుగుల దుర్గామల్లేశ్ (21) అడ్డురోడ్డులో మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇసుకపల్లి బాల వీర వెంకట సత్య దుర్గసాయి అలియాస్ బాలు (15) ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
వీరిద్దరూ కలసి శుక్రవారం అర్ధరాత్రి ప్రత్తిపాడు వైపు బైక్‌పై వెళ్తున్నారు. అదే మార్గంలో ఎదురుగా వస్తున్న ట్రాలీ జగపతినగరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలు అక్కడికక్కడే మరణించాడు. ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గా మల్లేశ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.
వివాహమైన కొద్ది నెలల్లోనే..
ఈ ప్రమాదంలో మృతుడు దుర్గా మల్లేశ్ 15 నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏలేశ్వరం మండలం మొక్కారావు కాలనీకి చెందిన కొండేటి సోమరాజు కుమార్తె దేవి, మల్లేశ్ ప్రేమించుకుని, గత ఏడాది మే నెలలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తితో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని దేవి ఎన్నో కలలు కంది. ఆ కలలు నెరవేరకుండానే ట్రాలీ రూపంలో మృత్యువు తన భర్తను బలిగొందని దేవి పెద్ద పెట్టున విలపిస్తోంది. మృతుడు మల్లేశ్‌కు భార్యతో పాటు తల్లిదండ్రులు నాగమణి, చిన్నరామస్వామి, సోదరి ఉన్నారు. అతడి మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ప్రయోజకుడిని చేయాలని..
శివమ్మ, వీరబాబు దంపతులకు బాలు లేకలేక పుట్టిన ఒక్కగానొక్క సంతానం. దీంతో అతడిని ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు. తాము పడుతున్న ఇబ్బందులు కొడుకు పడకూడదనే ఉద్దేశంతో వడ్రంగి పనికి వెళ్తూ.. బాలును వారు బాగా చదివించుకుంటున్నారు. పెద్దయ్యాక ప్రయోజకుడై తమకు ఆసరాగా నిలుస్తాడని జీవిస్తున్న తమ ఆశల్ని మృత్యువు చిదిమేసిందంటూ బాలు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment