
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: పిల్లలకు భారంగా ఉండకూడదు.. నగరంలో ఏదైనా పనిచేసుకొని బతుకుదామని వచ్చిన ఆ దంపతులను విధి వెక్కిరించింది. ఉద్యోగంలో చేరిన 12 గంటలలోపే భార్యను మృత్యువు కబళించింది. నిద్రిస్తున్న మహిళపై లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కె.నర్సింహ, ఎస్‌ఐ శ్రీలతరెడ్డి తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా అడ్డాకూల గ్రామానికి చెందిన దంపతులు వెంకటమ్మ(55), రామస్వామి నగరంలో వాచ్‌మెన్‌గా పనిచేసేందుకు వచ్చారు. బుధవారం సాయంత్రం దుర్గానగర్ చౌరస్తాలోని ఓ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా భార్యభర్తలు పనికి కుదిరారు. భోజనం చేసుకొని పనులు కొనసాగుతున్న ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు.
కరెంటు లేకపోవడం, దోమల బెడద తీవ్రంగా ఉండడంతో ఇంటికి సమీపంలో పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ లారీ ఇటుకలను ఆ ఇంటి వద్ద దించేందుకు వచ్చింది. డ్రైవర్ యాదగిరి.. రోడ్డుపై పడుకున్న వెంకటమ్మ, రామస్వాములను గమనించకుండా రివర్స్‌లో వచ్చాడు. ఆ సమయంలో వెంకటమ్మపైనుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇద్దరు కూతుళ్లు, కుమారుడు వచ్చి గుండెలవిసేలా రోదించారు. ఇలా చావడానికే ఇక్కడకు వచ్చావా.. అమ్మా.. అని వారు రోదించడం కంటతడిపెట్టించింది.
నష్టపరిహారం అందజేత...
మృతి చెందిన వెంకటమ్మ కుటుంబానికి యజమాని నష్టపరిహారం అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఏఐటియూసీ నాయకుడు వనంపల్లి జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నష్టపరిహారం రెండు లక్షలను అందజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment