సాక్షి, న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల బ్యాంకింగ్ కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనడానికి భారత్‌కు రప్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గురువారం స్పష్టం చేశారు. బీమా సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి బ్యాంకింగ్‌ను దాదాపు రూ.9000 కోట్ల మేర మోసం చేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్‌మాల్యాను ఆ దేశం నుంచి రప్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 2016 నుంచీ ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో దాదాపు రూ.14,500 కోట్లకుపైగా రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన 49 సంవత్సరాల నీరవ్ మోదీ లండన్ పారిపోయారు.
అయితే ఈడీ, సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను 2019లో అక్కడి అధికారులు తమ అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ, నీరవ్ మోదీకి మేనమామ. చోక్సీ భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వా అండ్ బార్బుడాలో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మోదీ, చోక్సీలకు చెందిన దాదాపు రూ.2,600 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి విదితమే.
బీమాలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి: రాజ్యసభలో బిల్లు ఆమోదం
కాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా (సవరణ) బిల్లు, 2021పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇస్తూ, దేశంలోకి బీమా రంగం సేవలు మారుమూలకు విస్తరించడానికి ఈ చొరవ దోహదపడుతుందని తెలిపారు.
సంబంధిత వర్గాలతో బీమా రంగం రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ సమగ్ర చర్చల అనంతరమే ఈ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2015లో అప్పటికి 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడం జరిగింది. జీవిత బీమా సేవలు దేశంలో మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జీవిత బీమా ప్రీమియం ప్రస్తుతం 3.6 శాతంగా ఉంది.
అంతర్జాతీయగా చూస్తే దీని సగటు 7.13 శాతం. ఇక జనరల్ ఇన్సూరెన్స్ చూస్తే, ప్రపంచ సగటు 2.88 శాతంకాగా, భారత్ జీడీపీలో కేవలం 0.94 శాతం. 2015లో 49 శాతానికి పరిమితులు పెంచిన తర్వాత దేశీయ బీమా రంగంలోకి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ.26,000 కోట్లని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీమా కంపెనీలు ద్రవ్యపరమైన (లిక్విడిటీ) ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి తాజా నిర్ణయం దోహదపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment