చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని.. | Man Arrested For Assassination Two Boys In Guntur District | Sakshi
Sakshi News home page

చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని..

Published Fri, Mar 19 2021 9:30 AM | Last Updated on Fri, Mar 19 2021 11:26 AM

Man Arrested For Assassination Two Boys In Guntur District - Sakshi

భార్గవతేజ (ఫైల్‌)-అఖిల్‌ (ఫైల్‌)

సాక్షి, గుంటూరు/తాడేపల్లి రూరల్‌: అతడో కిరాతకుడు.. అభం, శుభం తెలియని ఇద్దరు బాలుర పాలిట సైకోలా మారి వారిపై లైంగిక దాడులకు తెగబడ్డాడు. ఆనక వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తులో నిమగ్నమయ్యారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో పక్కపక్కనే ఉండే మెల్లంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. ఓ బాలుడు అదృశ్యమైన రెండో రోజే మృతదేహమై కనిపించడంతో తాడేపల్లి పోలీసులు ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేయడంతో నిందితుడు పట్టుబడ్డాడు.

మెల్లంపూడి గ్రామంలో ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న కుర్ర భార్గవతేజ (6) అదృశ్యం కాగా.. అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు హంగామా చేసిన, అదే గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపయ్య అలియాస్‌ గోపీ అనే 19 ఏళ్ల యువకుడిపై పోలీసులకు అనుమానం రావడంతో అతణ్ణి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవతేజకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లినట్టు నిందితుడు గోపీ పోలీసుల ఎదుట అంగీకరించినట్టు సమాచారం. బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి లైంగిక దాడి జరిపినట్టు, అనంతరం తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఆ తరువాత బాలుడి మృతదేహం కాళ్లు, చేతుల్ని విరిచేసి, ముఖాన్ని గాయపర్చి ఇంటి వెనుక ఉన్న అరటి తోటలో పడేసినట్టు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని గురువారం ఘటనా స్థలానికి తీసుకువెళ్లి నేరం జరిగిన తీరును పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినట్టు తెలిసింది.  

మరో బాలుడినీ ఇదేవిధంగా.. 
ఫిబ్రవరి 11వ తేదీన వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి మరియదాసు, మీనాక్షి కుమారుడు బండి అఖిల్‌ (8) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆడుకోవడానికి వెళ్లి.. ఆ తర్వాత కనిపించలేదు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడు అఖిల్‌ ఆడుకుంటూ వెళ్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌లో పడిపోయి ఉంటాడని భావించిన పోలీసులు, బంధువులు విస్తృతంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. భార్గవతేజ అదృశ్యమైన తీరు, అఖిల్‌ అదృశ్యమైన తీరు ఒకేలా ఉండటంతో నిందితుడు గోపీని పోలీసులు నిలదీశారు అఖిల్‌ను కూడా భార్గవతేజ తరహాలోనే మాయమాటలు చెప్పి వెంటబెట్టుకుని వెళ్లి లైంగిక వాంఛ తీర్చుకుని, హత్య చేసినట్టు విచారణలో గోపీ ఒప్పుకున్నాడు.

14 ఏళ్ల వయసులోనే తొలి అకృత్యం! 
నిందితుడు గోపీలో సైకో స్వభావాలున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు 14 ఏళ్ల వయసులో (సుమారు ఐదేళ్ల క్రితం) తన స్నేహితుడిని సెకండ్‌ షో సినిమాకు తీసుకువెళ్లి ఇదే తరహాలో హతమార్చినట్టు తెలుస్తోంది. సినిమా మధ్యలో స్నేహితుణ్ణి బయటకు తీసుకొచ్చిన గోపీ అతడిపై లైంగిక దాడి చేసి చంపి, మృతదేహాన్ని రేవేంద్రపాడు బ్రిడ్జి మీద నుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌లో పడేసినట్టు గ్రామస్తులు చెబుతుంటారు. అప్పట్లో కాలనీ వాసులంతా జరిగిందేదో జరిగిపోయింది కేసులు వరకు ఎందుకు, పిల్లాడి భవిష్యత్‌ నాశనం చేయడం ఎందుకంటూ మృతి చెందిన బాలుడి తండ్రిని బుజ్జగించడంతో అప్పట్లో కేసు నమోదు కాలేదనే ప్రచారం ఉంది.

గోపీ తండ్రిదీ నేర ప్రవృత్తే 
గోపీ తండ్రిది కూడా నేర ప్రవృత్తేనని గ్రామస్తులు చెబుతున్నారు. అతడు మొదటి భార్యను హత్య చేసిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చాక మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కాగా, నిందితుడు గోపీని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చూపే అవకాశం ఉంది.
చదవండి:
ప్రేమ చిహ్నంతో పచ్చబొట్టు.. నాన్నకు తెలుస్తుందని!   
భర్త హత్యకు రూ.6 లక్షల సుపారీ, రోడ్డు ప్రమాదం అని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement