
నిర్మల్ రూరల్: మద్యపానం మనిషిని ఎంత పతనావస్థకు ఈడుస్తుందో ఈ సంఘటన ఓ ఉదాహరణ. తాగిన మైకంలో కన్న కూతురినే కడతేర్చాడు ఓ తండ్రి. నిర్మల్ మండలం అనంతపేట గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అనంతపేటకు చెందిన వినీష్ అనే యువకుడికి లక్ష్మణచాందకు చెందిన జ్యోతితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కూతురు నిత్య ఉంది. కొద్ది రోజుల పాటు సజావుగానే సాగిన వీరి కాపురంలో మద్యం చిచ్చుపెట్టింది. ప్రతిరాత్రి వినేష్ తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో భర్త బాధ భరించలేక భార్య జ్యోతి పంచాయితీ పెట్టి విడాకులు తీసుకుని మూడేళ్లుగా పుట్టింట్లో ఉంది.
ఈ క్రమంలో మూడు నెలల క్రితమే పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో అనంతపేటకు వచ్చి మళ్లీ కాపురం చేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి వినేష్ మద్యం తాగి భార్యతో తిరిగి గొడవ పడటంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే కోపంలో మద్యం మత్తులో ఉన్న వినేష్ నిద్రిస్తున్న కూతురు నిత్యను కొట్టడంతో కింద పడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి వెళ్లింది. గమనించిన జ్యోతి స్థానికుల సాయంతో పాపను వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించింది.
పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ తరలిస్తుండగా నిత్య మృతి చెందింది. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న వినేష్ ఆందోళనతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వెంకటేశ్, ఎస్సై మిథున్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కన్న కూతురిని హత్య చేసిన వినేష్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు.