రూ.40 వేల జరిమానా
విశాఖ పోక్సో కోర్టు తీర్పు
విశాఖ లీగల్: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు రూ.40,000 జరిమానా చెల్లించాలని, ఆ మొత్తాన్ని బాలికకు ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిహారం కింద రూ.3.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ కృష్ణ అందించిన వివరాలు.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి తోటగురువు దగ్గర బీఎన్‌ఆర్ నగర్‌లో నివాసముంటున్న గుండెల సాయికుమార్.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆరిలోవ సెక్టార్–2 శివాజీనగర్‌లో తన ఇద్దరు మైనర్ కుమార్తెలతో తండ్రి నివాసముంటున్నాడు. గతేడాది ఏప్రిల్ 9న తన కుమార్తెలను టిఫిన్ తీసుకురమ్మని హోటల్‌కు తండ్రి పంపాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న సాయికుమార్.. ఓ బాలికను ఎత్తుకుని తన బండిపై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.సోమశేఖర్.. సాయికుమార్‌పై కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు.
Comments
Please login to add a commentAdd a comment