సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెదక్ అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతం రిమాండ్ రిపోర్టులో మొత్తం బట్టబయలైంది. ఈ మొత్తం లంచం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశేనని ఏసీబీ వెల్లడించింది. తాను చేసే అక్రమానికి కలెక్టర్ పేరును పరోక్షంగా, ఆర్డీవో, తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్‌లను ప్రత్యక్షంగా వాడినట్లు ఏసీబీ గుర్తించింది. ఎన్‌వోసీ ఇవ్వాలంటే కలెక్టర్‌కు రూ.1.12 కోట్లు లంచమివ్వాలని చెప్పిన డీల్ మాట్లాడుకున్న నగేశ్.. ఎన్‌వోసీ జారీ అయినా, ఆ విషయాన్ని చెప్పకుండా.. మొత్తం లంచం వసూలు చేసుకోవడానికి బాధితుడిపై పలు రకాల ఒత్తిళ్లు తెచ్చాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ–1గా అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏ–2గా జూనియర్ అసిస్టెంట్ వాసీం, ఏ–3గా ఆర్డీవో అరుణారెడ్డి, ఏ–4గా తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఏ–5గా నగేశ్ బినామీ కోలా జీవన్‌గౌడ్‌లను పేర్కొంది.
రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే..?
శేరిలింగంపల్లికి చెందిన శరత్ చంద్ర, సత్యనారాయణ ప్రసాద్‌లు ఈ భూమి ఓనర్లు. వీరితో భూమి కొనుగోలుకు డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తికి ఒప్పందం కుదిరింది. సర్వే నంబరు 58, 59లలోని ఈ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్‌కు నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) తప్పనిసరి అయింది. దీంతో జూలై 30వ తేదీన ఈ విషయమై అడిషనల్ కలెక్టర్ నగేశ్‌ను లింగమూర్తి ఆశ్రయించాడు. ఎకరానికి లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ.1.12 కోట్లు కలెక్టర్ ధర్మారెడ్డికి చెల్లిస్తే.. పని అవుతుందని నగేశ్ బేరం పెట్టాడు. విధిలేక లంచం ఇచ్చేందుకు లింగమూర్తి అంగీకరించాడు. మరునాడు జూలై 31న మెదక్‌లోని ఏసీ నగేశ్ ఇంటికి వెళ్లిన లింగమూర్తి రూ.19.5 లక్షల నగదును లం చంగా ఇచ్చాడు. అపుడు ఏసీ నగేశ్ సర్వే డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ అయిన వాసీంను కలవాలని సూచించాడు. అక్కడ తనకు, ఆర్డీవోకు, తహసీల్దార్‌కు కలిపి మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాలని వాసీం డిమాండ్ చేయగా.. లింగమూర్తి తన వద్ద ఉన్న రూ. 4 లక్షల నగదు ఇచ్చాడు. మిగిలిన రూ.లక్షను గూగుల్ పే ద్వారా వాసీం సూచించినట్లుగా సోమరాజాగౌడ్ అనే వ్యక్తికి మూర్తి తన భార్య, సోదరుడి ఫోన్ల ద్వారా పంపాడు. ఆగస్టు 7వ తేదీన రెండో విడతగా రూ.20.5 లక్షలను లింగమూర్తి ఏసీ నగేశ్‌కు అందజేశాడు. మిగిలిన రూ.72 లక్షలు ఏవని ప్రశ్నించగా.. కోవిడ్ కారణంగా సర్దలేకపో యానని లింగమూర్తి బదులిచ్చాడు. అయితే, ష్యూరిటీ కింద చెక్కులు ఇవ్వాలని ఏసీ నగేశ్ డిమాండ్ చేశాడు. దీంతో తన చందానగర్ ఐసీఐసీఐ ఖాతాకు చెందిన ఎనిమిది ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చాడు లింగమూర్తి. దాంతో అప్పటికే సిద్ధమైన ఎన్‌వోసీని లింగమూర్తికి అందించాడు నగేశ్. వాస్తవానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌పై జూలై 31 తారీఖునాడే నాటి కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేశారు.
మిగతా డబ్బు కోసం ఒకటే ఫోన్లు
మిగిలిన డబ్బు కోసం జూనియర్ అసిస్టెంట్ వాసీంతో నగేశ్ పదేపదే ఫోన్లు చేయించాడు. దీంతో విసిగిపోయిన లింగమూర్తి ఆ ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేశాడు. ఆగస్టు 14వ తేదీన మెదక్ ఏసీ నగేశ్‌తో లింగమూర్తి మరోసారి సమావేశమయ్యారు. మిగిలిన రూ.72 లక్షలకు సర్దలేకపోతున్నానని లింగమూర్తి చేతులెత్తేశాడు. అయితే ఎన్‌వోసీ జారీ అయిన 112 ఎకరాల్లో నుంచి పదెకరాలు తాను సూచించిన కోలా జీవన్‌గౌడ్ పేర రిజిస్ట్రేషన్ చేయాలని నగేశ్ సూచించగా, చివరికి ఐదెకరాలకు బేరం కుదిరింది. ఆగస్టు 15న జీవన్‌గౌడ్ పేరిట సేల్‌డీడ్ సిద్ధం చేసిన లింగమూర్తి వాటిని వాట్సాప్ ద్వారా వారికి పంపించాడు. ఈ లావాదేవీలో ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని నగేశ్ ముందుగానే లింగమూర్తిని ఫోన్‌లో హెచ్చరించాడు. అయితే ఈ సంభాషణ మొత్తం లింగమూర్తి ఫోన్‌లో రికార్డయింది. తరువాత సేల్ అగ్రిమెంట్ ఒరిజినల్ కాపీని ఆగస్టు 21వ తేదీన కలిసినపుడు లింగమూర్తి నుంచి ఏసీ నగేశ్ తీసుకున్నాడు.
ఆగస్టు 22న ఏసీబీ ఆఫీస్‌కు లింగమూర్తి
ఆగస్టు 7వ తేదీ నుంచే నగేశ్– లింగమూర్తి మధ్య విభేదాలు పొడసూపినట్లు సమాచారం. జూలై 31 రోజునే ఎన్‌వోసీ జారీ అయినా.. ఆ విషయం తనకు చెప్పకుండా రూ.20.5 లక్షలు వసూలు చేయడం, పైగా తాను కొనుగోలు చేసిన భూమిలో పదెకరాలు ఇవ్వాలనడం లింగమూర్తికి రుచించలేదు. చివరికి ఐదెకరాలకు ఒప్పందం కుదిరింది. ఆగస్టు 15వ తేదీన వాట్సాప్‌లో సేల్ అగ్రిమెంట్‌ను పంపించిన లింగమూర్తి అడిషనల్ కలెక్టర్‌ను వారం దాకా కలవలేదు. ఈ సమయంలో లింగమూర్తిపై అడిషనల్ కలెక్టర్‌కు అనుమానం వచ్చింది. తనకు ఒరిజినల్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఆదేశించడంతో ఆగస్టు 21న కలిసి ఇచ్చేశాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే జాప్యమైందని, తాను ఏసీబీని ఆశ్రయించలేదని వివరణ ఇచ్చుకున్నాడు లింగమూర్తి. చివరకు ఈనెల 9న నగేశ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది.
విచారణలో నోరువిప్పని ఏసీ..!
ఏసీబీ విచారణ సందర్భంగా ఏసీ నగేశ్ నోరు విప్పలేదు. మొదట్లో అసలు లింగమూర్తి ఎవరో తనకు తెలియదన్న నగేశ్.. చిప్పలతుర్తి సమీపంలో ఫిర్యాదుదారుడు డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తి భూమి గురించి తనను కొన్నిసార్లు కలిసినట్లు తెలిపాడు. కానీ, ఆయన నుంచి రెండు దఫాల్లో తీసుకున్న రూ.40 లక్షల గురించి ప్రశ్నించగా.. ఎలాంటి డబ్బును తీసుకోలేదన్నాడు. అలాగే మిగిలిన రూ.72 లక్షలకు ఫిర్యాదుదారుడు సంతకం చేసి ఇచ్చిన చెక్కులు, ఐదెకరాల భూమికి చేసుకున్న అగ్రిమెంటు తాలూకు పత్రాల గురించి పదేపదే అడగ్గా.. బహుశా వారు «కలెక్టర్ ధర్మారెడ్డిని కలిశారేమో అంటూ సమాధానమిచ్చాడు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఏసీబీ అధికారులు నిందితులను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. నిందితులు ఐదుగురు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ సస్పెన్షన్
మరో నలుగురిపైనా వేటు
భూ వ్యవహారంలో మెదక్ అదనపు కలెక్టర్‌సహా నలుగురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఘటనలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసీం అహ్మద్ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఎకరాకు రూ.లక్ష ఇస్తే 22ఏ(నిషేధిత జాబితా) నుంచి 112 ఎకరాలను తొలగిస్తూ నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేస్తానని నగేశ్ హామీ ఇచ్చి నట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఈ నెల 9న మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భూ వ్యవహారంలో నర్సాపూర్ ఆర్డీవో, చిలిపిచెడ్ తహసీల్దార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మరో ఉద్యోగి ఉన్నట్లు తేలింది. అలాగే మరొకరు అదనపు కలెక్టర్ బినామీగా గుర్తించారు. దీంతో వీరిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment