
సిద్దిపేట: ‘ఒక అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాను.. కొద్దిరోజులుగా ఆమె నా ప్రేమను నిరాకరిస్తోంది. అందుకే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గురువారం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మెగావత్ సంతోష్ కుమార్ (21) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్నాడు.
మూడ్రోజుల క్రితం మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కాగా ఒక పరీక్ష పూర్తయింది. గురువారం మైక్రో బయాలజీ పరీక్ష రాసేందుకు ఉదయం 9 గంటలకు మిత్రులంతా వెళ్లారు. దీంతో గదిలో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయాల్సిన సంతోష్ ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటిమిత్రులు సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెళ్లి చూడగా సంతోష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, రూరల్ ఎస్‌ఐ శంకర్ ఘటనా స్థలికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు బోరున విలపించారు. అనంతరం ఘటనపై సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment