వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు | Minor girls paraded naked in village to please rain god | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు

Published Tue, Sep 7 2021 5:07 AM | Last Updated on Tue, Sep 7 2021 5:13 AM

Minor girls paraded naked in village to please rain god - Sakshi

దమోహ్‌(మధ్యప్రదేశ్‌): ఆధునిక యుగంలోనూ దురాచారాలకు అడ్డుకట్ట పడడం లేదనడానికి ఇది మరో ఉదాహరణ. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరుగురు మైనర్‌ బాలికలతో నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దమోహ్‌ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్‌ పరిధిలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. బాలికలతో నగ్నంగా ఊరేగింపు జరిపిస్తే వరుణ దేవుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడన్న అంధ విశ్వాసంతో గ్రామ పెద్దలు సభ్య సమాజం తలదించుకొనే దురాగతానికి ఒడిగట్టారు.

దీనికి సంబంధించిన రెండు వీడియోలు తెరపైకి వచ్చాయి. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగ్న ప్రదర్శనకు బాధిత బాలికల తల్లిదండ్రులు సైతం అంగీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వర్షాల కోసం కప్పను ఒక దుంగకు కట్టి, గ్రామంలో ఊరేగించడం చాలామందికి తెలిసిందే. బనియా గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి, వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్‌ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉదంతంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని దమోహ్‌ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement