
చంపాపేట/చైతన్యపురి/బడంగ్‌పేట్: తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్.. సోమవారం సాయంత్రం విగతజీవిగా దొరికాడు. సరూర్‌నగర్ చెరువు గండి నుంచి సుమారు 35 అడుగుల దూరంలోని ఒండ్రులో అతడి మృతదేహం లభ్యమైంది. బాలాపూర్ మండలం అల్మాస్‌గూడ కాలనీకి చెందిన నడిగొప్పు నవీన్ కుమార్ (39)కు భార్య శాలిని, కుమార్తెలు హర్షిత (12), తేజశ్రీ(10) ఉన్నారు. అద్దె ఇంట్లో ఉండే నవీన్.. బిల్డింగ్ కాంట్రాక్టు తీసుకునే శివ వద్ద ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సరూర్‌నగర్‌లో పనులు ముగించుకుని శివ స్కూటీపైనే అల్మాస్‌గూడకు బయలుదేరారు. తపోవన్ కాలనీ ప్రధాన రహదారిపై వరదను దాటేందుకు ప్రయత్నించారు. స్కూటీ మొరాయించడంతో నవీన్ వెనకాల నుంచి నెట్టాడు. ఈ క్రమంలోనే వరద ప్రవాహానికి స్కూటీ శివ చేజారింది. దీంతో నవీన్ కూడా వరదలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు స్కూటీని పట్టుకోగలిగారు కానీ నవీన్‌ను అందుకోలేకపోయారు. రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో వర్షం రావడంతో గాలింపును నిలిపివేసి, తిరిగి సోమవారం ఉదయం 7 గంటల నుంచి మళ్లీ చెరువును జల్లెడ పట్టారు. 18 మంది సభ్యులు 3 బృందాలుగా విడిపోయి నవీన్ కుమార్ ఆచూకీ కోసం వెతికారు. చివరకు చెరువు గండి నుంచి సుమారు 35 అడుగుల దూరంలోని ఒండ్రులో నవీన్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, నవీన్ మృతితో అతనిపైనే ఆధారపడిన ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది. ఇక మాకు దిక్కెవరు దేవుడా అంటూ వారు రోదించడం పలువురిని కలిచివేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ బావ మృతిచెందాడని, తమ అక్కకు ఉద్యోగం ఇప్పించడంతో పాటు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరించాలని మృతుడి బావమరుదులు కె.వినోద్‌కుమార్, సంతోష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.
ప్రత్యేక ఔట్‌లెట్ నిర్మిస్తాం...
ఆదివారం కురిసిన భారీ వర్షానికి పై కాలనీల నుంచి వర్షపు నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలైన రెడ్డి కాలనీ, సాగర్ ఎన్ క్లేవ్‌లో నీరు చేరి సాగర్ రింగ్‌రోడ్డు మీదుగా ఏరులా పారిందని, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ఔట్‌లెట్ నిర్మాణం చేస్తామని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, సోమవారం సరూర్‌నగర్ చెరువును పరిశీలించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment