ఢిల్లీ: ఆమె ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిణి. కానీ, పని చేసే చోట ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంది. వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి.. ఆమె తినే తీరు, మాట్లాడే విధానం.. ఇలా తోటి ఉద్యోగులు అన్నింటా ఆమెను హేళన చేస్తూ వచ్చారు. అది పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. భరించలేక లేఖ బలవన్మరణానికి పాల్పడిందామె.
నోయిడా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేసే శివాని త్యాగి ఆత్మహత్య ఘటన ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఘజియాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందామె. ఆరు నెలలపాటు ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు ఆమెను వేధించారని, అది భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని శివాని కుటుంబం ఆరోపిస్తున్నారు. వీటికి తోడు..
ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్‌జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారాయన.
వేధింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. వేధింపులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, పైఅధికారులు ఆమెను ఆపుతూ వచ్చారు. అయితే ఓ సహోద్యోగిణితో వాగ్వాదంలో శివాని ఆమెపై చెయ్యి చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఆమెకు తొలగింపు నోటీసులు ఇచ్చారు. శివాని అది తట్టుకోలేకపోయింది అని ఆమె సోదరి మీడియాకు చెబుతూ కంటతడి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment