సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన మహేశ్వర్ (పేరు మార్చాం) ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఒక రోజు నో యువర్ కస్టమర్ (కేవైసీ) అప్‌డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందని అతని సెల్‌ఫోన్‌కు సందేశం వచ్చింది. దీంతో నిజమేనని నమ్మిన మహేశ్వర్.. మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేసి, అందులో బ్యాంకు ఖాతా నంబరు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలు నమోదు చేశాడు. అంతే.. ఆ తర్వాత కొన్ని సెకన్లకే తన ఖాతాలో సొమ్ము విత్‌డ్రా అయినట్టు బ్యాంకు నుంచి సందేశం వచ్చింది.
అతను కంగారు నుంచి తేరుకునేలోపు ఖాతా మొత్తం ఖాళీ చేసేశారు సైబర్ నేరస్తులు. దీంతో లబోదిబోమంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి సందేశం వచ్చిన ఫోన్ నంబర్, దానికి అనుసంధానించిన గుర్తింపు కార్డును, బ్యాంకు ఖాతా వివరాలను సైబరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (సీఓఈసీఎస్)లో విశ్లేషించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సైబర్ మోసాలు, డేటా లీకు, నకిలీ వెబ్‌సైట్లు వంటి సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న తెలంగాణ పోలీసులకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ (సీఓఈసీఎస్) విశ్లేషిస్తుంటుంది. ఇదే క్రమంలో కేవైసీ మోసం కేసును కూడా విశ్లేషించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో కేవలం ఒక్క ఆధార్ కార్డు గుర్తింపుతో 11 వేల సిమ్ కార్డులు జారీ అయినట్లు సీఓఈసీఎస్ పోలీసులు గుర్తించారు.
రెండు సిమ్‌లు నేరస్తుల చేతుల్లో..
సాధారణంగా కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. టెలీకమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) మార్గదర్శకాల ప్రకారం ఒక్క ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులను జారీ చేయవచ్చు. కానీ ఈ కేసులో థర్డ్ పార్టీ ఏజెన్సీలు డీఓటీ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా 11 వేలు సిమ్ కార్డులు జారీ చేశారు.
కాగా ఇందులో రెండు సిమ్ కార్డులను సైబర్ నేరస్తులు వినియోగించారని, ఈ ఫోన్ నంబర్ల నుంచే బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్ విభాగాన్ని సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సిమ్ కార్డులను జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఒక్క ఆధార్.. 11,000 సిమ్ కార్డులు!
Published Wed, Apr 5 2023 3:04 AM | Last Updated on Wed, Apr 5 2023 3:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment