ఎస్పీపై ఎందుకు ఒత్తిడి తెచ్చావ్‌? | Police spokesman Palaraju directly Questions to AB Venkateshwar rao | Sakshi
Sakshi News home page

ఎస్పీపై ఎందుకు ఒత్తిడి తెచ్చావ్‌?

Published Mon, Apr 19 2021 2:58 AM | Last Updated on Mon, Apr 19 2021 2:58 AM

Police spokesman Palaraju directly Questions to AB Venkateshwar rao - Sakshi

సమావేశంలో పోలీస్‌ కార్యాలయ అధికార ప్రతినిధి పాలరాజు, గతంలో కడప ఎస్పీగా పనిచేసిన రాహుల్‌

సాక్షి, అమరావతి: రక్షణ, అంతర్గత భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారంలో సస్పెండైన ఇంటెలిజెన్స్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఆరోపణలతో సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయడం, దాన్ని బహిర్గతం చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి జి.పాలరాజు స్పష్టం చేశారు. గతంలో కడప జిల్లా ఎస్పీగా పనిచేసిన రాహుల్‌దేవ్‌శర్మ, పోలీసు అధికారుల అసోసియేషన్‌ ప్రతినిధిగా ఉన్న గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డితో కలిసి పాలరాజు ఆదివారం మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ఆ రోజు ఇంటెలిజెన్స్‌ బాస్‌గా ఉన్న నువ్వు.. ఇప్పుడు నా పక్కనే కూర్చున్న నాటి కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మపై ఎందుకు ఒత్తిడి తెచ్చావు? వివేకా హత్య కేసులో విచారణను ప్రభావితం చేసేలా ఎందుకు వ్యవహరించావ్‌? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశావ్‌? దర్యాప్తును న్యాయబద్ధంగా, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మీకు నచ్చిన కోణంలో చేయాలని ఎందుకు ఒత్తిడి తెచ్చావ్‌? సాక్ష్యాధారాలుంటే అప్పుడే ఎందుకివ్వలేదు? రెండేళ్లుగా నోరు మెదపకుండా తిరుపతి ఉప ఎన్నికలకు ఒకరోజు ముందు రాజకీయ దురుద్దేశాలతో అసంబద్ధమైన ఆరోపణలకు దిగావ్‌’ అని పేర్కొన్నారు. ఏబీ ఆరోపణలు నిరాధారమని, ఆయన లేఖపై వాస్తవాలను వెల్లడించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలివీ..

ఆ క్షణం నుంచి ఏబీ పర్యవేక్షణలోనే దర్యాప్తు
మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి మార్చి 14 అర్ధరాత్రి (15వతేదీ తెల్లవారు జామున) హత్యకు గురైనట్లు ఇంటెలిజెన్స్‌ బాస్‌ హోదాలో సమాచారం అందుకున్న క్షణం నుంచి ఏబీ వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తును స్వయంగా నడిపించారు. స్థానిక పోలీసులు, సీఐడీ, సిట్, ఇంటెలిజెన్స్, కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులకు అప్పటి డీజీపీతో కలిసి అనుక్షణం ఆదేశాలిస్తూ దర్యాప్తు మొత్తం తన కనుసన్నల్లోనే పర్యవేక్షించారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఆయన మార్చి 31 వరకు కొనసాగారు. అప్పటి వరకు అంటే 17 రోజులపాటు ప్రతి రోజు అప్పటి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అప్పటి సీఎం, డీజీపీలతో వివేకా కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు చర్చించారు. ఆ కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు దర్యాప్తు ఎలా ముందుకు వెళ్లాలో అధికారులకు పూస గుచ్చినట్లు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి సీఎం సైతం ఏబీవీ అందించిన అంశాలనే రోజువారీ మీడియా సమావేశాల్లో కూలంకషంగా వివరించారు. మార్చి 31న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఏబీవీ బదిలీ అయినా అప్పటి ప్రభుత్వ పర్యవేక్షణలోనే మూడు నెలలపాటు సిట్‌ దర్యాప్తు కొనసాగింది. అంతటి కీలక పాత్ర పోషించిన ఏబీవీ ఇప్పుడు తాను ఇచ్చిన సమాచారాన్ని సిట్, సీఐడీ ఏ మేరకు ఉపయోగించుకుందో తెలియదని చెప్పడం హాస్యాస్పదం. ఇంకేదైనా కీలక సమాచారం ఉంటే అçప్పుడే సిట్‌కు ఎందుకు ఇవ్వలేదు? గత ప్రభుత్వ హయాంలో మూడు నెలలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దాదాపు 9 నెలలు దర్యాప్తు చేసిన సిట్‌కు కీలక సమాచారం ఇవ్వకుండా ఏబీవీ ఏం చేసినట్లు?

సీఎం కుటుంబాన్ని టార్గెట్‌ చేశారు..
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను వెలికితీసే ప్రయత్నాలను పక్కనపెట్టిన ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌ చేశారు. ఈ కేసులో వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్టు చేయాలని అప్పటి ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఇతర అధికారులపై ఒత్తిడి చేసిన విషయం నిజమా? కాదా? ఏబీవీ చెప్పాలి. నిబద్ధత కలిగిన అధికారి కాబట్టే ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తీవ్ర ఒత్తిళ్లకు తలొగ్గలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు సీఐడీ, సిట్‌ అధికారులపై ఆరోపణలు చేస్తూ సీబీఐ డైరెక్టర్‌కి ఏబీవీ లేఖ రాయడం హాస్యాస్పదం, అసమంజసం.  

ఐపీసీ సెక్షన్‌ 201 ప్రకారం శిక్షార్హమే
సాధారణ పౌరులు సైతం ఏదైనా నేరానికి సంబంధించిన కీలక సమాచారం తమ వద్ద ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అందించకపోవడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటిది ఒక ఐపీఎస్‌ అధికారిగా ఉంటూ కీలక కేసులో తన వద్ద ఉన్న సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఇంతవరకు అందించకపోవడం ఐపీసీ సెక్షన్‌ 201 ప్రకారం శిక్షార్హమే. ఏబీవీ వద్ద నిజంగానే కీలక సమాచారం ఉంటే రాతపూర్వకంగా సీబీఐకి సీల్డ్‌ కవర్లో అందించకుండా ఎన్నికల సమయంలో బహిరంగంగా వెల్లడించడం ఏమిటి? తనపై వచ్చిన అభియోగాలపై కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ వద్ద విచారణ ఎదుర్కొన్న ఏబీవీ మీడియాలో, బాహాటంగా అధికారులపై ఆరోపణలు, విమర్శలు చేయడం ఆల్‌ ఇండియా సర్వీస్‌ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement