సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై మరింత లోతైన విచారణ అవసరమని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. అకౌంట్స్ ఆఫీసర్ మొదలుకొని తెలుగు అకాడమీ ఉన్నతాధికారుల వరకు ఇందులో పాత్ర ఉందని, బ్యాంకు సిబ్బందితోనూ లాలూచీ వ్యవహారం కొనసాగిందన్న అనుమానం వ్యక్తం చేసింది. అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు చేయాలని భావించింది. అకాడమీలో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గల్లంతవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
కాగా దీనిపై ప్రభుత్వం విద్యాశాఖకు చెందిన ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరితో కూడిన ఈ కమిటీ మంగళవారం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. వాస్తవానికి ఈ నెల 2వ తేదీనే కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. కానీ అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు, మరికొన్ని వివరాల కోసం గడువు పొడిగించారు. వీటి ఆధారంగా ప్రాథమిక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది.
సీఐడీకి బదలాయింపు?
మొత్తం మీద బ్యాంకు అధికారులు, అకాడమీ సిబ్బంది, బయట వ్యక్తుల ప్రమేయం ఇందులో కన్పిస్తోందని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. విభిన్న కోణాల్లో, శాస్త్రీయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని భావించింది. మరికొన్ని లోతైన అంశాలకు ఆధారాలు వెలికితీయాల్సి ఉందని పేర్కొంది. దీన్నిబట్టి కేసును సీఐడీకి అప్పగించే వీలుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
నివేదికలోని వివరాలు ఇవి..!
గోల్‌మాల్ గుర్తించకపోవడానికి కారణాలేమిటి?
‘ఏపీ, తెలంగాణ ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీకి చెందిన రూ.43 కోట్లను యూబీఐ బ్యాంకులో కొన్నేళ్ళ క్రితం డిపాజిట్ చేశారు. ఈ నిధులను ఏపీకి పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో అకాడమీ అధికా రులు భవనాలు, నగదు వివరాలను లెక్కించారు. పలు బ్యాంకులు సహా యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని గుర్తించారు. వీటిని తీసుకునేందుకు డిపాజిట్‌పత్రాలను ఈ నెల 21న బ్యాంకుకు పంపినా అక్కడి నుంచి సమాధానం రాలేదు. దీన్ని అకాడమీ అధికారులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఉన్నతాధికా రుల దృష్టికి ఈ విషయం వచ్చిందా? లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యత ఉన్న అకౌంటింగ్ విభాగం డిపాజిట్ల విత్ డ్రా వ్యవహారం గుర్తించకపోవడానికి కారణా లేంటి?’ అని కమిటీ అనుమానం వ్యక్తం చేసింది.
ప్రస్తుత అధికారుల బాధ్యతారాహిత్యం
‘అసలు డిపాజిట్‌ను ఆగస్టులోనే విత్‌డ్రా చేసుకున్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. దీనిపై అంతర్గతంగా ఏం జరిగిందనేది ఇప్పటికీ తెలుగు అకాడమీ స్పష్టంగా చెప్పడం లేదు. రికార్డుల పరిశీలనకు సంబంధించి గానీ, ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే విషయాలను స్పష్టంగా అధికారులు చెప్పలేకపోతున్నారు. తమ హయాంలో ఏమీ జరగలేదని ప్రస్తుత అధికారులు చెప్పడాన్ని బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నాం..’ అని పేర్కొంది.
ఉన్నతాధికారుల ఆమోదంతోనే..
‘గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్‌డ్రా చేసుకుని ఆ సొమ్మును హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు డిపాజిట్ చేశారు. ఎస్‌బీఐ తెలుగు అకాడమీ ఖాతాకు రూ. 5.70 కోట్లు బదిలీ అయ్యాయి. మిగిలిన రూ. 26 కోట్లు అకాడమీ అధికారులే విత్‌డ్రా చేశారని బ్యాంకు వర్గాల వాదన. అయితే ఈ మొత్తం వ్యవహారం అకౌంట్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఉన్నతాధికారులు అనుమతించిన తర్వాతే వ్యవహారం ముందు కెళ్తుంది. కాబట్టి ఉన్నతాధికారుల ఆమోదంతోనే ఇదంతా జరిగిందనేది మా దర్యాప్తులో వెల్లడైంది..’ అని కమిటీ తెలిపింది. అయితే ఎందుకు? ఎవరు? అనే అంశాలపై స్పష్టత లేదని దీనిపై ఆరా తీసినప్పుడు అకాడమీ ఉన్నతాధికారులు విభిన్న వాదనలు విన్పించినట్టు కమిటీ సభ్యుడొకరు తెలిపారు.
స్వాహా సూత్రధారుల పట్టివేత
హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల స్వాహా కేసులో సూత్రధారులను హైదరాబాద్ సెం ట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు పట్టుకు న్నారు. అకాడమీ ఏఓ రమేష్ సహా మొత్తం ఆరు గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఎవరిని అరెస్టు చేయాలి? ఎవరికి నోటీసులు ఇవ్వాలో బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని ఈ నెల 12 వరకు సీసీఎస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ స్కామ్‌పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీ సులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా మిగతా నిందితుల కస్టడీపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాజేసిన సొమ్ముతో నిందితులు కొన్ని స్థిరాస్తులు ఖరీదు చేశారని, పాత అప్పులు తీర్చడం, కొత్తగా అప్పులు ఇవ్వడం చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితుల వద్ద కొంత మొత్తం నగదు అధికారులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment