
ఘటనాస్థలం వద్ద మృతదేహాలు
తాడేపల్లి రూరల్: అమరావతి, ఉండవల్లి కరకట్టపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వలస కూలీల కుటుంబాన్ని అతి వేగంగా వస్తున్న కారు ఆదివారం ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోట మరియదాసు (35), భార్య యేసుకుమారి, ఇద్దరు కుమారులు తేజ, ప్రవీణ్ (10) అమరావతి మండలం మునుగోడుకు చెందినవారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక కుటుంబం గడవడం కష్టం కావడంతో అత్తగారి ఊరైన మైలవరం వెళ్లి పనులు చేసుకుంటుండేవారు. లాక్‌డౌన్ సడలించడంతో తిరిగి ద్విచక్ర వాహనంపై సొంత ఊరు వస్తుండగా అమరావతి కరకట్టమీద మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద మందడం నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఈ నలుగురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
బైక్‌పై ప్రయాణిస్తున్న మరియదాసు కుటుంబం పది అడుగుల పైకి లేచి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. బైక్‌ను ఈడ్చుకుంటూ కారు 15 అడుగుల దూరం వెళ్లింది. మరియదాసు, చిన్న కుమారుడు ప్రవీణ్‌లకు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు 108కు ఫోన్ చేశారు. తీవ్ర గాయాలైన తేజ, యేసుకుమారిలకు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. యేసుకుమారి చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్‌లో కన్నుమూసింది. తాడేపల్లి ఎస్‌ఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని ఉమా మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment