ఆమె ఓ గాయని, బతుకుదెరువు నిమిత్తం ముంబై నుంచి నగరానికి వలస వచ్చి క్లబ్‌లు, ఈవెంట్లలో పాటలు పాడుతూ జీవనం సాగించేది. క్లబ్బుల్లో క్యాబరేలను ప్రభుత్వం నిషేధించడంతో చోరీలవైపు దృష్టి సారించింది. దేశంలోని పలు నగరాలకు విమానాల్లో రాకపోకలు సాగిస్తూ ప్రముఖ దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో మహిళలకు చెందిన హ్యాండ్ బ్యాగులు, విలువైన వస్తువుల చోరీకి పాల్పడుతున్న ‘చోర్ సింగర్’ను ఇటీవల ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆమెకు గతంలో నగరంలో జరిగిన మూడు చోరీ కేసుల్లోనూ సంబంధం ఉన్నట్లు తేలింది.
సాక్షి, హైదరాబాద్: విమానాల్లో తిరుగుతూ ప్రముఖ దుకాణాలు, షాపింగ్ మాల్స్‌కు వచ్చే మహిళలను టార్గెట్‌గా చేసుకుని బ్యాగ్ చోరీలకు పాల్పడుతూ గత నెలలో ముంబై పోలీసులకు చిక్కిన సింగర్ మున్‌మూన్ హుస్సేన్ సిటీ పోలీసులు వాంటెడ్‌గా ఉన్నట్లు తేలింది. ఈమెపై గతంలో సైఫాబాద్ అబిడ్స్ ఠాణాల్లో మూడు కేసులు నమోదై ఉన్నాయి.
► పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాకు చెందిన మున్‌మూన్ హుస్సేన్ కొంతకాలం పాటు కోల్‌కతాలో సింగర్‌గా పని చేసింది. ఆపై హైదరాబాద్‌కు మకాం మార్చి బార్ అండ్ రెస్టారెంట్స్‌లో క్యాబరే సింగర్‌గా మారింది. చదవండి: ఔరా.. ముగ్గురేనా?
►మరో పక్క గణేష్ ఉత్సవాలు, వివాహాల్లోనూ పాటలు పాడేది. నగరంలో క్యాబరేను నిషేధించడంతో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వివాహాలు, గణేష్ ఉత్సవాలు సీజనల్ కావడంతో చోరీల బాట పట్టిన మున్‌మున్ మహిళల హ్యాండ్ బ్యాగ్స్ చోరీ చేసేది.
► చెన్నైలోని అన్నానగర్‌లో నివసించే హీరో విశాల్ తల్లి జానకీదేవి 2009 జూన్‌లో నగరంలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అదే నెల 15న సాయంత్రం ఆమె పట్టు చీరలు కొనేందుకు బషీర్‌బాగ్‌లోని ధర్మవరం సిల్క్ శారీస్ షోరూమ్‌కు వెళ్లారు.
►తన హ్యాండ్ బ్యాంగ్‌ను పక్కన పెట్టి చీరలు ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అరగంట తర్వాత ఆమె తన బ్యాగు కోసం చూడగా అది కనిపించలేదు. దీంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో రూ.65 వేల నగదు, రూ.30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్‌ఫోన్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
►బ్యాగు పోయిన దుకాణం అప్పటికే చాలా పాతది కావడంతో అందులో సీసీ కెమెరాలు లేవు. దీంతో కేసు దర్యాప్తు జటిలంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాగులు చోరీ చేసే పాత నేరస్తుల వివరాలు ఆరా తీశారు. చోరీ జరిగింది చీరల దుకాణంలో కావడంతో ఈ తరహా చోరీలు చేసే మహిళలపై దృష్టి సారించారు.
► ఫలితంగా చిక్కడపల్లి సూర్యనగర్‌లో నివసించే మున్‌మూన్‌హుస్సేన్ అలియాస్ మున్‌మూన్ బౌరా అలియాస్ రచన పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు 2009 ఆగస్టు 12న అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించింది.
► దీంతో మున్‌మూన్‌ను అరెస్టు చేసి ఆమె ఇచ్చిన సమాచారం మేరకు రూ.30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్‌ఫోన్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. రూ.65 వేల నగదు మాత్రం ఖర్చయిపోవడంతో రికవరీ కాలేదు.
► 2010 మే 13న మున్‌మూన్ మరో నేరం చేసింది. కుందన్‌బాగ్‌కు చెందిన ఓ బాధితురాలు ఆదర్శ్‌నగర్‌లోని బాలాజీ గ్రాండ్ బజార్‌కు వచ్చింది. అక్కడకు వెళ్లిన ఈ చోర్ సింగర్ ఆమె బ్యాగ్‌ను తస్కరించింది. అందులో రూ.20 వేల నగదు, తులం బంగారం ఉన్నాయి.
► ఈ కేసులోనూ సైఫాబాద్ పోలీసులు మున్‌మూన్‌ను అరెస్టు చేశారు. దీనికి ముందే అబిడ్స్ ఠాణా పరిధిలోనే ఆమె ఓ నేరం చేసింది. ఇక్కడి పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరుకు మకాం మార్చింది. విమానాల్లోనే తిరుగుతూ పంజా విసరడం మొదలెట్టింది.
► కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ల్లో వరుస చోరీలకు పాల్పడింది. తాజాగా గత నెల 17న ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు చిక్కింది. ఈమెపై నగరంలో కొన్ని నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండటంతో ఇక్కడి పోలీసులకూ వాంటెడ్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment