ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..! | Some Policemen Must Punish In The Case Realtors Twin Murders | Sakshi
Sakshi News home page

ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!

Published Sat, Mar 5 2022 7:47 AM | Last Updated on Sat, Mar 5 2022 11:35 AM

Some Policemen Must Punish In The Case Realtors Twin Murders  - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: సంచలనం రేపిన రియల్టర్ల జంట హత్యల కేసులో కొంతమంది పోలీసులపై వేటు తప్పదని తెలుస్తోంది. రెండు నెలలుగా లేక్‌విల్లాలోని భూ తగాదాల్లో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మట్టారెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ తగాదాల్లో అనేకమార్లు మాట్లాడినప్పటికీ సయోధ్య కుదరలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఇద్దరూ మట్టారెడ్డిని బెదిరించినట్లు సమాచారం. అదేరోజు తనకు ప్రాణహాని ఉందని వారిద్దరిపై మట్టారెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని తెలిసింది. ఉన్నత స్థాయి అధికారి నోటీసుకు ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదని.. దీంతో భయాందోళనకు గురైన మట్టారెడ్డి.. ఎలాగైనా వారిద్దరి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని ఇలా హత్యకు కుట్ర చేసినట్లు సమాచారం.  

భారీగా ముడుపులు..! 
పోలీసులకు శ్రీనివాస్‌రెడ్డి నుంచి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఓ పెద్ద స్థాయి పోలీసు అధికారి లేక్‌విల్లాను పరిశీలించి వెళ్లారని సమాచారం. కేసును కనీసం పట్టించుకోలేదని మట్టారెడ్డి ఆరోపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీసు కమిషనర్‌ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై వేటు వేయాలని రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురు పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఫిర్యాదు చేసినా స్పందన లేకే..  
రెండు నెలలుగా కర్ణంగూడలో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ వారు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కౌన్సిలర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. మట్టారెడ్డి కేసుపై ఎటూ తేల్చలేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే తన ప్రాణాలు కాపాడుకోవడానికి హత్య చేసినట్లు మట్టారెడ్డి అంగీకరించినట్లు   తెలిసింది. మట్టారెడ్డి ఫిర్యాదు చేసినప్పుడే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే హత్యల దాకా వచ్చేది కాదని చర్చించుకుంటున్నారు.  

ఐదుగురు నిందితులకు రిమాండ్‌   
జంట హత్యల కేసులో ప్రధాన నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మేరెడ్డి మట్టారెడ్డి, ఖాజా మోహియుద్దీన్, బుర్రి భిక్షపతి, సయ్యద్‌ రహీం, సమీర్‌ అలీని సాయంత్రం ఇబ్రహీంపట్నం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.

(చదవండి: కటకటాల్లో గజదొంగ నాయక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement