వెదిరలో ఆకలి చావు
గుర్తుపట్టలేని స్థితిలో మృతి
పోలీసుల విచారణలో సిరిసిల్ల వాసిగా నిర్ధారణ
సిరిసిల్లటౌన్: కొందరి దీన పరిస్థితి చూస్తే.. పగవారికి కూడా అటువంటి కష్టాలు రాకూడదని అనిపిస్తుంది. ఇదే తరహాలో సిరిసిల్ల నేత కార్మికుడి విషయంలో జరిగిన ఘటన మానవతావాదులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన ఈగ రాజు (45) రోకడ (ఎక్కడ పని ఉంటే అక్కడ సాంచాలు నడిపే పని) నేత కార్మికుడు. అయితే చాలా రోజులుగా సిరిసిల్లలో పనుల్లేక ఖాళీగా ఉంటున్నాడు.
నాలుగు రోజుల క్రితం పనిని వెతుక్కుంటూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎటు వెళ్లాడో తెలియని స్థితిలో కుటుంబ సభ్యులు దిక్కుతోచకుండా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కరీంనగర్ జిల్లా వెదిర గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. తమ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో చనిపోయాడని, ఆధార్‌కార్డులో సిరిసిల్ల వాసిగా అడ్రస్ ఉందని తెలిపారు.
వెంటనే భార్య రేఖతో పాటు బంధువులు వెదిరకు వెళ్లారు. రాజు వేసుకున్న దుస్తుల ఆనవాళ్లను బట్టి అతనే అనిపించినా.. ఎండకు, ఆకలికి తాళలేక బక్కచిక్కి.. మొఖం రంగు మారిన క్రమంలో భార్య రేఖ తన భర్తను గుర్తు పట్టలేక పోయింది. చనిపోయింది తన భర్తకాదని, పని దొరికాక ఇంటికి వస్తాడన్న నమ్మకంతో సిరిసిల్లకు తిరిగి వచ్చింది.
ఎస్సై సురేందర్ విచారణతో..
వెదిర గ్రామ కార్యదర్శి గౌరి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామడుగు ఎస్సై సురేందర్.. ఈగ రాజు మృతి కేసును దర్యాప్తు చేశారు. బుధవారం సిరిసిల్లలో రాజు ఇంటికి వచ్చి నేరుగా విచారణ చేపట్టారు. ఇంట్లో ఉన్న ఫొటోలు, మృతుడిపై ఉన్న దుస్తులను బట్టి ఆ శవం ఈగ రాజుదిగా నిర్ధారించారు. కరీంనగర్‌లో పోస్టుమార్టం జరిపించి బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్సై సురేందర్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
ఈగ రాజు మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా రాజుకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడని, కుటుంబ భారం మొత్తం భార్య రేఖ మోస్తోందని చెప్పారు. కొద్ది నెలల క్రితమే కూతురుకు వివాహం జరిగిందని, రాజుకు అనారోగ్యం.. తదితర కారణాలతో కుటుంబానికి అప్పులయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే రాజు పని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడని, చేతిలో డబ్బులేక మండుటెండల్లో సరైన ఆహారం లభించక, ఎండల ధాటికి మృతిచెందినట్లు స్థానికులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment