
గంగమ్మ (55) సోమవారం రాత్రి తన ఇంటికి తాళం వేయకుండా చుట్టుపక్కల మహిళలతో కలిసి ఇంటి బయట అరుగు మీద బారాకట్ట ఆడుతూ ఉంది
పావగడ: దొంగతనానికి వెళ్లిన దుండగులు తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని పావగడ తాలూకా మురారాయనహళ్లికి చెందిన గంగమ్మ (55) సోమవారం రాత్రి తన ఇంటికి తాళం వేయకుండా చుట్టుపక్కల మహిళలతో కలిసి ఇంటి బయట అరుగు మీద బారాకట్ట ఆడుతూ ఉంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత తన ఇంటిలోకి వెళ్లిన ఆమె అప్పటికే లోపలకు చొరబడి దొంగతనానికి ప్రయత్నిస్తున్న దుండగులను చూసి భయంతో కేకలు వేసింది.
ఆ సమయంలో ఛార్జింగ్ వైర్‌ని ఆమె గొంతుకు బిగించారు దుండగులు. వారితో పెనుగులాడి తప్పించుకున్న ఆమె కేకలు వేస్తూ ఇంటి బయటకు పరుగున వచ్చింది. అదే సమయంలో ఆమెను అనుసరిస్తూ వచ్చిన దుండగులు బండరాయితో ఆమె ముఖంపై కొట్టి హతమార్చారు. గంగమ్మ కేకలు విని పొరుగున ఉన్న యువకుడు బయటకు రావడం గమనించి నలుగురు దుండగులు అక్కడి నుంచి చీకట్లోకి పారిపోయారు.
సమాచారం అందుకున్న పావగడ సీఐ లక్ష్మీకాంత్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. దుండగుల ఆచూకీ కోసం స్నిప్పర్ డాగ్‌ను రంగంలోకి దించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, భర్త చనిపోయిన తర్వాత గంగమ్మ ఒంటరిగా జీవిస్తోంది. ఇద్దరు కుమార్తెలకు వివాహమై స్థానికంగానే మరో ప్రాంతంలో నివాసముంటున్నారు.