యువతిని చితకబాదేందుకు చుట్టుముట్టిన దుండగులు
జయపురం(ఒడిశా): తాను ప్రేమించిన వ్యక్తిని కలిసేందుకు వెళ్లిన ఓ యువతిపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడిన సంఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండున్నర నెలల క్రితం ఈ ఘటన జరగగా, దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ కావడంతో గుట్టురట్టయింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో దినేష్ గోండ్, నరసింగ గోండ్, శిశుపాల్ గోండ్‌లు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. (చదవండి: సీసీ కెమెరాలో దృశ్యాలు: ఆ ఘటన వెనుక కుట్ర)
కుందై కోటపర గ్రామానికి చెందిన ఓ యువతి.. ఝుడుకు గ్రామ పంచాయతీలోని పూజారిపర గ్రామానికి చెందిన జగదీష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే జూలై 16వ తేదీన ఆ యువతి తన ప్రేమికుడు జగదీష్‌ను కలిసేందుకు అతడి గ్రామానికి బయలుదేరింది. ఈ విషయం యువతికి వరసకు సోదరుడైన శిశుపాల్ గోండ్‌కు తెలిసింది. దీంతో అతడు తన స్నేహితులతో కలిసి, ఆ యువతిని వెంబండించాడు. సరిగ్గా అక్కడి అటవీ ప్రాంతంలో ఆ యువతి నడిచి వెళ్తుండగా.. శిశుపాల్ తన స్నేహితులతో కలిసి ఆమెను చుట్టుముట్టి చితకబాదారు. ఈ క్రమంలో ఆ యువతి ప్రాణ భయంతో పరుగులు తీసినా విడిచిపెట్టకుండా ఆ యువతిని చేతులు, కర్రలతో కొట్టారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో టిక్‌టాక్ స్టార్ మృతి)
అనంతరం ఆ యువతిని గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో నిర్వహించిన రచ్చబండలో నిలబెట్టారు. యువతి ప్రేమించిన వ్యక్తి జగదీష్‌ను కూడా రచ్చబండకు పిలిపించి, నష్టపరిహారం కింద రూ.60 వేలు కట్టాలని పెద్దలు ఆదేశించారు. ఇరువర్గాలవి వేర్వేరు కులాలు కావడంతో విషయం బయటకుపోతే తమ పరువు పోతుందని భావించిన జగదీష్ కుటుంబ సభ్యులు పెద్దల తీర్పును అంగీకరించారు. అప్పట్లో జగదీష్ వద్ద ఉన్న రూ.20 వేలు నష్టపరిహారం కింద చెల్లించగా, మిగతా సొమ్ము తర్వాత ఇస్తానని చెప్పి, వలస పనుల నిమిత్తం జగదీష్ మహారాష్ట్రకు బయలుదేరాడు. అయితే అకస్మాత్తుగా ఆ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment