మృతురాలు కోటేశ్వరి (ఫైల్)
నాతి చరామి అంటూ పెళ్లి పీటలపై ఒకరి కొకరు తోడుగా నూరేళ్లూ కలసి జీవిస్తామని చేసిన ప్రమాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆలుమగల మధ్య కాపురాలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. సంసారాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. నిత్యం అనుమానాగ్ని జ్వాలల్లో రగిలిపోతూ భార్యను నిర్దాక్షిణ్యంగా నరికి చంపుతున్న భర్తలు, వివాహేతర సంబంధాలకు అడ్డు అని భర్తలను చంపడానికి కూడా వెనుకాడని భార్యలు... గుంటూరు నగరంలో మంగళవారం వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు నానాటికీ దిగజారిపోతున్న భార్యాభర్తల బంధానికి అద్దం పడుతున్నాయి.
భార్యను చంపిన భర్త
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త హత్య చేసిన ఘటన గుంటూరు నగరంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టాభిపురం పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తుఫాన్‌నగర్‌లో నివాసం ఉండే మాలంపాటి వీరాంజనేయులు కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి 14 సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన కోటేశ్వరి (36)తో వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల బాబు ఉన్నాడు. కరోనా సమయంలో భార్యాభర్తలు కంచికచర్లలోని కోటేశ్వరి పుట్టింటికి వెళ్లారు. 20 రోజుల తరువాత వీరాంజనేయులు తిరిగి గుంటూరుకు వచ్చేయగా, కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో కోటేశ్వరి అక్కడే ఉండిపోయింది.
ఈ విషయంలో భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకోగా, కొద్ది రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పి కాపురానికి పంపారు. ఈ క్రమంలో వీరాంజనేయులు భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య తిరిగి వివాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే వీరాంజనేయులు కోటేశ్వరి తలను గోడకేసి కొట్టి గొంతు నులిమి హతమార్చాడు. గతంలో పాతగుంటూరులో నివాసం ఉండే వీరాంజనేయులు, కోటేశ్వరి కొద్ది కాలం క్రితమే తుఫాన్‌నగర్‌లో ఇల్లు కట్టుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న పట్టాభిపురం పీఎస్ ఎస్‌హెచ్‌వో జి.పూర్ణచంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి మంగిశెట్టి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: (స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై)
భర్తను హతమార్చిన భార్య
పట్నంబజారు(గుంటూరు): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన గుంటూరులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. గుంటూరు అరండల్‌పేట పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉండే పీకే మరియదాసు (40) మార్బుల్ పని చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. అతనికి 22 ఏళ్ల క్రితం మరియమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు మిర్చియార్డులో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా తెనాలి మండలం పెరవలి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అనిల్‌తో మృతుడి భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి మరియమ్మ కుమారుడు మిర్చియార్డుకు పనికి వెళ్లాడు. ఆ తరువాత అనిల్ వారి ఇంటికి వచ్చాడు.
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మరియదాసు మద్యం సేవించి నిద్రిస్తుండగా అనిల్, మరియమ్మ కలిసి మృతుడి గొంతుకు తాడు బిగించి, రోకలిబండతో తలపై తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం వారిద్దరూ అక్కడినుంచి పరారయ్యారు. తెల్లవారుజాము సమయంలో మరియమ్మ తన కుమారుడు సుధాకర్‌కు ఫోన్ చేసి తండ్రి మరియదాసు యాక్సిడెంట్ అయి ఇంట్లో పడి ఉన్నాడని చెప్పింది. సుధాకర్ విషయాన్ని బంధువులకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. అరండల్‌పేట పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తలపై ఉన్న గాయాలను చూసి అనుమానం వచ్చిన ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న మరియమ్మ, అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు పాల్పడినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (కన్నా..నీ వెంటే మేమంతా..!)
Comments
Please login to add a commentAdd a comment