
లక్నో: కరోనా వ్యాప్తితో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు ఇప్పటికే ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఆక్సిజన్ ప్లాంట్‌లో పేలుడు సంభవించడంతో ఆక్సిజన్ సిలిండర్లన్నీ పేలిపోయాయి. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి సకాలంలో చర్యలు చేపట్టడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అప్పటికే ఇద్దరు మృతి చెందడం కలచివేస్తోంది.
లక్నోలోని చిన్హాట్ ప్రాంతంలో ఉన్న ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్లాంట్‌లో బుధవారం కార్మికులు ఆక్సిజన్ సిలిండర్లు నింపుతున్నారు. రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీగా ఎగసిపడిన మంటలు ఆక్సిజన్ ప్లాంటంతా వ్యాపించాయి.
వెంటనే స్పందించిన యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఆలోపు ఇద్దరు కార్మికులు మంటల్లో తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పేలుడు సంభవించడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment