గుణదల (విజయవాడ తూర్పు) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్‌ను చంపేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్ శుక్రవారం మీడియాకు వివరించారు.
ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం..
కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్ రాహుల్‌ను కోరాడు.
అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్‌లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి.
హత్య జరిగిందిలా..
ఈ నెల 18వ తేదీ రాత్రి విజయ్‌కుమార్‌తో పాటు సీతయ్య, బాబూరావు అనే వ్యక్తి కలిసి రాహుల్‌ను తమ కారులో సీతారామపురంలోని కోరాడ చిట్‌ఫండ్ కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ రాహుల్‌కు, విజయకుమార్‌కు కంపెనీల వాటాల విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో విజయ్‌కుమార్ రాహుల్‌పై దాడి చేశాడు. కోగంటి సత్యం సూచన మేరకు అక్కడ నుంచి రాహుల్‌ను తీసుకుని దుర్గా కళామందిరం వద్దకు చేరుకున్నారు.
అప్పటికే సిద్ధం చేసిన డాక్యుమెంట్లపై రాహుల్‌పై దాడి చేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. అనంతరం పథకం ప్రకారం రాహుల్‌ను బందరు రోడ్డులో పార్క్ చేసిన కారు వద్దకు తెచ్చారు. కారులో ఎక్కాక రాహుల్‌కు విజయ్‌కుమార్, సీతయ్య, బాబురావు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముందు సీటులో ఉన్న రాహుల్‌ను చిత్రహింసలు పెట్టి.. సెల్‌ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు.
నిందితుల అరెస్ట్..
మృతుని తండ్రి కరణం రాఘవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్ హత్య కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించామని కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.
కోరాడ విజయ్‌కుమార్ (ఏ1), నల్లూరు రవికాంత్ (ఏ14), కఠారపు కోటేశ్వరరావు అలియాస్ కోటి (ఏ10), కఠారపు గాంధీబాబు అలియాస్ గాంధీ (ఏ11), కిలారి అనంత సత్యనారాయణ (ఏ6), షేక్ మహబూబ్ జానీ (ఏ8)ని శుక్రవారం అరెస్టు చేశామని, కేసులో కీలక నిందితుడు, ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంను ఈనెల 23న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని వివరించారు. మిగిలిన ఆరుగురు నిందితులను కూడా 48 గంటల్లోపు అరెస్టు చేస్తామని కమిషనర్ చెప్పారు. కాగా, తొలుత 14 మంది నిందితులుగా గుర్తించినప్పటికీ ఓ మహిళ ప్రమేయంపై ఆధారాలు లేకపోవడంతో.. 13 మందినే నిందితులుగా గుర్తించామని పోలీసులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి:
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: ధర్మాన కృష్ణదాస్
అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం!
Comments
Please login to add a commentAdd a comment