ప్రతీకాత్మక చిత్రం
తాడిపత్రి : బంగారం అపహరణ కేసులో మిస్టరీని తాడిపత్రి పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య వెల్లడించారు. తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డు సమీపంలో పక్కపక్క ఇళ్లలో సోదరులు హాజీవలి, షాజహాన్ నివాసముంటున్నారు. ఈ ఏడాది మే 22న ఈ రెండు ఇళ్లలో రూ.7.50లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సొంతింటికే కన్నం
షాజహాన్ భార్య షాహీనా. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికంగా ఉండే బాలబ్రహ్మయ్యతో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరు శాశ్వతంగా కలిసి ఉండాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం మే 22న తన ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, పొరుగున ఉన్న తన బావ ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలను బ్రహ్మయ్యకు అందజేసి, ఏమీ తెలియని దానిలా ఇంటిలోనే ఉండిపోయింది. ఈ కేసు విచారణ దశలో ఉండగానే.. అదే నెల 28న కుమార్తెతో కలిసి షాహీనా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో భార్య కనిపించడం లేదంటూ షాజహాన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడిన చిక్కుముడి
షాహీనా కనిపించడం లేదంటూ భర్త షాజహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ జీటీ నాయుడు, ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన చోరీకి, ఆమె కనించకుండా పోవడానికి కారణాలను అన్వేషిస్తూ వెళ్లారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఆమె ఆచూకీ పసిగట్టారు. ఈ నెల 23న మార్టూరుకు చేరుకుని షాహీనాతో పాటు ఆమె ప్రియుడు బాలబ్రహ్మయ్యను అరెస్ట్ చేసి తాడిపత్రికి పిలుచుకువచ్చారు. చోరీ చేసుకెళ్లిన 16 తులాల బంగారు నగలతో పాటు 600 గ్రాముల వెండి ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.50 లక్షలుగా ఉంటుంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, కేసులో మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లను ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment