
కూతురు సాధ్వి, తల్లి ప్రజ్వల (ఫైల్)
సాక్షి, యశవంతపుర: నాలుగు రోజుల కిందటే పెళ్లయింది. పెళ్లిబట్టలు కూడా మాసిపోలేదు. కానీ రెండో పెళ్లి ఇష్టం లేని ఆ మహిళ కూతురిని చంపి ఆపై ఆత్మహత్య చేసుకుంది. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా అనేమహల్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. ఆనే మహల్‌కు చెందిన ప్రజ్వల (26), కూతురు సాధ్వి (2). ఆమె భర్త సురేంద్ర రెండున్నరేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోగా, ఆమె కూతురితో సహా హడ్లహళ్లిలోని పుట్టింటిలో ఉంటోంది. జీవితంలో ఒక తోడు ఉండాలని పెద్దలు ఆమెకు మోహన్ అనే వ్యక్తితో 16న పెళ్లి చేశారు. ఆమె మళ్లీ పెళ్లి వద్దే వద్దని చెప్పినా పెద్దలు వినిపించుకోలేదు.
భర్త ఇంట్లో అకృత్యం
భర్త కొత్త భార్య, కూతురిని సంతోషంగా ఆనెమహల్‌లోని తన ఇంటికి తీసుకొచ్చాడు. అతడు పనిమీద బయటకు వెళ్లిన సమయంలో కూతురికి చీరతో ఉరివేసి అదే చీరతో తానూ ఉరేసుకుంది. కాగా, మోహన్‌కు కూడా ఇది రెండో వివాహమే. మొదటి భార్య రెండున్నరేళ్ల క్రితం కాన్పు సమయంలో చనిపోయింది. దీంతో మరోసారి విధి ఆయనను కాటేసిందని స్థానికులు వాపోయారు. హాసన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment