ప్రతీకాత్మక చిత్రం
రాప్తాడు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు మంజూరు చేయాలంటూ టీడీపీ నేతల ప్రోద్బలంతో సర్పంచ్, ఆమె భర్తపై దాడికి తెగబడిన ఘటన అనంతపురం మండలం అక్కంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా వలంటీర్ గాయపడింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కంపల్లికి చెందిన కుళ్లాయప్ప, హుస్సేన్, వలీ అనే ముగ్గురు సోదరులు ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. వారి స్థలాన్ని ఇటీవల హౌసింగ్ అధికారులు పరిశీలించారు. ఇల్లు మంజూరు కావాలంటే ఖాళీ స్థలం మరికొంత ఉండాలని, అలా ఉంటేనే జియోట్యాగింగ్ తీసుకుంటుందని చెప్పారు.
ఏడడుగుల స్థలంలోని బాత్‌రూమ్‌ను తొలగించుకుంటే ఇంటి మంజూరుకు అవసరమైన స్థలం అందుబాటులోకి వస్తుందని సూచించారు. ఇదే విషయాన్ని సర్పంచ్ మల్లెల పుష్పావతి, ఆమె భర్త లింగమయ్య రెండు రోజుల కిందట కుళ్లాయప్ప కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇల్లు మంజూరు కాలేదనే విషయం తెలిసినప్పటికీ కుళ్లాయప్ప సోదరులు ఆదివారం సర్పంచ్ పుష్పావతి ఇంటికి వెళ్లి ఇల్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆమెతో గొడవ పడ్డారు. ఎంత చెబుతున్నా వినకుండా మద్యం మత్తులో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఆమెపై దాడి చేశారు. సమాచారం అందుకున్న సర్పంచ్ భర్త లింగమయ్య ఇంటి వద్దకు చేరుకోగా ఆయనపైనా దాడి చేశారు.
వలంటీరు రాజేశ్వరిపై కొడవలితో దాడి
కాగా, కుళ్లాయప్ప సోదరులు సర్పంచ్ ఇంటి వద్ద నుంచి అటుగా వెళుతుండగా గ్రామ వలంటీర్ రాజేశ్వరి కనిపించడంతో ఆమెను బండబూతులు తిడుతూ కొడవలితో దాడి చేశారు. దీంతో ఆమె తలకు గాయమైంది. అడ్డుకోబోయిన వలంటీర్ తండ్రి ఆంజనేయులుపైనా దాడికి పాల్పడ్డారు. వెంటనే రాజేశ్వరిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐ నబీ రసూల్ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. సర్పంచ్, వలంటీరు ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment