చివరిలో వాయుగండం
సాక్షి, అమలాపురం: పొలంలో దుక్కులు దున్ని... నారుమడులు వేసిన నాటి నుంచి... కోతలు కోసి ధాన్యం పట్టుబడుల వరకు వాతావరణం.. రణం సృష్టిసూ ఉంది. జూలైలో కురిసిన భారీ వర్షాలు నారుమడులను ముంచేశాయి. సెప్టెంబర్ నెలలో వర్షాలు దుబ్బు చేస్తున్న వరిని దెబ్బతీశాయి. వరిచేలు పాలు పోసుకుని గింజ గట్టి పడుతున్న సమయంలో అక్టోబర్ నెలలో వర్షాలు మరోసారి కృషి దిగుబడిని తగ్గించి వేశాయి. ఇప్పుడు కోతల సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది.
1.63 లక్షల ఎకరాల్లో సాగు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర కోనసీమ జిల్లాలో ఖరీఫ్ వరి సాగు 1.63 లక్షల ఎకరాల్లో జరిగింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 94,597 ఎకరాల్లో నూర్పిడులు పూర్తయ్యాయి. రైతులు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకున్నారు. 161 ఎకరాల వరి చేలు పనల మీద ఉంది. 370 ఎకరాలకు చెందిన రాశులు కుప్పలపై ఉన్నాయి. సుమారు 60 వేల ఎకరాల్లో వరి చేలు కోతల జరగాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో తూర్పు డెల్టా పరిధిలో ఆలమూరు, రామచంద్రపురం, పరిధిలోని కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లలోని మండలాల్లో 50 నుంచి 70 శాతం మేర కోతలు జరిగాయి. మధ్య డెల్టా పరిధిలో అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో 20 నుంచి 30 శాతం మేర మాత్రమే వరి కోతలు జరిగాయి. ఈ ప్రాంతంలో కోతలు ఆలస్యమైనప్పటికీ యంత్రాల కారణంగా వేగంగా జరుగుతున్నాయి.
వాన పడితే ఇబ్బందే..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఈ ప్రభావం జిల్లాపై చూపిస్తోంది. ఎండలు కాస్తున్నా గాలుల తీవ్రత పెరిగింది. తుపాను ముందు నిశబ్ధ వాతావరణం కనిపిస్తోంది. తీర ప్రాంతం మండలాలైన ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లిలో గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడక్కడా వరి చేలు నేలకొరుగుతున్నాయి. పెద్దగా కోతలు జరిగినది ఈ ప్రాంతంలోనే కావడం గమనార్హం. వరిచేలు నేలనంటడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గురు,శుక్రవారాల్లో కనుక వర్షాలు పడితే ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వరి కోతలు పూర్తి చేసి పనల మీద ఉంచిన వారు, రాశులుగా పోసిన వారు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని వేగంగా ఒబ్బిడి చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాకు భారీ వర్షాలు ఉండవని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ కొద్దిపాటి వర్షం కురిసినా యంత్రాలతో కోతలకు అవాంతరాలు ఏర్పడతాయని రైతులు వాపోతున్నారు.
తీరంలో తగ్గిన దిగుబడి
గోదావరి డెల్టాలో ఖరీఫ్ సగటు దిగుబడి 29 బస్తాలు (బస్తా 75 కేజీలు – 21.75 క్వింటాళ్లు). కాని ఈసారి ఆ స్థాయిలో దిగుబడి కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కానుంది. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో మూడొంతుల ప్రాంతాల్లో మాత్రం దిగుబడి 20 బస్తాలకు మించి వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి, మలికిపురం, కాట్రేనికోన మండలాల పరిధిలో సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో వరి బాగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో సుమారు 41,150 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. కనీస పెట్టుబడులు కూడా రావని, వస్తున్న దిగుబడిలో తాలు, తప్పలు అధికంగా వచ్చే అవకాశముందని వారు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు రెండుసార్లు నారుమడులు వేయాల్సి వచ్చింది. ఇన్ని అవాంతరాలు దాటి ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని పొందుదామనుకుంటున్న రైతులకు వాయుగుండం కొత్త ఆందోళన రేకెత్తిస్తోంది.
ముమ్మరంగా ఖరీఫ్ వరి కోతలు
ఈ సమయంలో వాయుగుండం
మారిన వాతావరణం
పెరిగిన గాలుల తీవ్రత
అన్నదాత గుండెల్లో గుబులు
Comments
Please login to add a commentAdd a comment