ఆయువుకు ఆద్యుడు
ఆలమూరు: ధన్వంతరి స్వామిని ఆయుర్వేద ప్రదాతగా పూజిస్తారు. ఆయన కరుణా కటాక్షంతో సకల రోగాలు తగ్గుతాయని భావిస్తారు. ఆయుర్వేద పితామహుడైన ఆయనను అందరూ స్మరించుకుంటారు. అంతటి గొప్ప స్వామివారి ఆలయాలు మాత్రం మనకు ఎక్కడా కనిపించవు. కేవలం దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఉత్తరాదిన వారణాసిలో ఒకచోట, దక్షిణాదిని ఆలమూరు మండలం చింతలూరులో మాత్రమే ఉన్నాయని చరిత్ర కారులు చెబుతున్నారు. అలాగే తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి, కంచిలోని వరదరాజు పెరుమాళ్ దేవాలయాల్లో ఉపాలయాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తయిన ఏర్పాట్లు
కార్తిక మాస బహుళ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ధన్వంతరి స్వామి జయంతిని గురువారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలమూరు మండలం చింతలూరులోని ధన్వంతరి స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ధన్వంతరి స్వామి పాలరాతి మేనితో, శంఖు చక్రాలు ధరించి, ఒక చేతితో అమృత కలశం, మరో చేతిలో జలగను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆరోగ్య ప్రదాతగా ప్రఖ్యాతి పొందిన ధన్వంతరి స్వామిని పూజిస్తే సకల రోగాలు తగ్గుతాయని ఆయుర్వేద శారస్త్‌రం చెబుతోంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగారాన్ని మదించిన సమయంలో శంఖ, చక్రౌషధ, సుధా కలశాలు, నాలుగు చేతులతో పాల కడలి నుంచి ధన్వంతరి ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి.
ఆలయానికి ఘన చరిత్ర
చింతలూరులోని శ్రీధన్వంతరి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఆయుర్వేద పితామహుడైన వైద్యరాజ్ ద్విభాష్యం వేంకటేశ్వర్లు అత్యంత భక్తి ప్రవక్తులతో ధన్వంతరి స్వామి ఆలయాన్ని దేశ స్వాతంత్య్రానికి పూర్వమే 1942లో ఇక్కడ నెలకొల్పారు. అప్పటి నుంచి ద్విభాష్యం కుటుంబీకులు తమ ఇలవేల్పుగా స్వామిని పూజిస్తున్నారు. ఆలయంలో దూప, ధీప నైవేద్యాలకు గాను శాశ్వత భూ వసతి కల్పించారు. అయన తదనంతరం కుమారుడు వెంకట సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయానికి తుది మెరుగులు దిద్దారు. ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ద్విభాష్యం వెంకట శ్రీరామ్మూర్తి ఆలయాన్ని అభివృద్ధి పరచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు.
పెరుగుతున్న భక్తులు
ధన్వంతరి స్వామి కరుణ, కటాక్షాలతోనే ఆయుర్వేద చికిత్స దేశ వ్యాప్తంగా పురోగమిస్తోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఏటేటా సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కాగా.. ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని చింతలూరి ఆలయంలో మహాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ వ్యవస్థాపకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆయుర్వేద ప్రదాత ధన్వంతరి స్వామి
నేడు ఆయన జయంత్యుత్సవం
చింతలూరు ఆలయంలో
పూర్తయిన ఏర్పాట్లు
రోగాలు మటుమాయం
ధన్వంతరి ఆలయాన్ని సందర్శిస్తే సకల రోగాలు మటుమాయవుతాయి. శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలయానికి విచ్చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన ఎందరో రోగులు తమ బాధల నుంచి విముక్తి పొందడం గమనించారు.
– అల్లంరాజు రామకృష్ణమూర్తి, వేద పండితులు,
ఆయుర్వేద వైద్యులు, చింతలూరు
పూర్వజన్మ సుకృతం
ఆయుర్వేద సృష్టికర్త ధన్వంతరి ఆలయాన్ని దర్శించుకోవడం భక్తులందరూ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధి గాంచిన చింతలూరుకు ఈ ఆలయం వల్ల దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. స్వామిని దర్శించుకుంటే మొండి రోగాలైనా నయం అవుతాయనే నానుడి ఉంది.
– నామాల రామకృష్ణ, హరే శ్రీనివాస
భక్త భజన బృందం సభ్యులు, చింతలూరు
మాకు గర్వకారణం
దక్షిణ కోస్తాలో ప్రసిద్ధి గాంచిన ధన్వంతరి ఆలయం మా గ్రామంలో ఉండటం గర్వకారణం. దేశ విదేశాల నుంచి అనేక మంది ఏడాది పొడువునా ఈ ఆలయానికి విచ్చేస్తారు. పాలరాతితో తయారు చేసిన సుందర విగ్రహాన్ని దర్శించుకుంటారు. భక్తుల తాకిడితో గ్రామం పులకరిస్తుంది.
– వెల్ల సత్యనారాయణ, గోశాల గోపరంధామం
ట్రస్టు సభ్యులు, చింతలూరు
Comments
Please login to add a commentAdd a comment