ఇంటర్ ఉత్తీర్ణత పెంచేందుకు కార్యాచరణ
అమలాపురం టౌన్: ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఆ బోర్డు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈవో) వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న స్టడీ అవర్ల సమయాన్ని పెంచడం, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం వంటి చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులు ఏ విషయంలోనైనా అసౌకర్యానికి గురైతే వారి తల్లిదండ్రులు ఆ సమస్యను నేరుగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లకు తెలియజేయవచ్చన్నారు. లెక్చరర్ల బోధనా సామర్థ్యం, విద్యార్థుల అభ్యాసన ప్రక్రియను ఇంటర్ విద్యాశాఖ ఉన్నతాధికారులే కాకుండా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులు తరచూ తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చిందన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళికపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ కృతికా శుక్లా ఆ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఐఈవోలు, రీజినల్ పర్యవేక్షణ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారన్నారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
అమలాపురం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ (08856 293104, 018004252532), అమలాపురం ఆర్డీవో కార్యాలయం (08856 233208), కొత్తపేట ఆర్డీవో కార్యాలయం 08855 244299, రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయం (08857 245166) కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర సమయంలో ఆ నంబర్లను సంప్రదించవచ్చు.
8 నుంచి భారతీయ
సంస్కృతీ ఉత్సవ్
అమలాపురం టౌన్: అమలాపురం ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక యర్రమిల్లివారివీధిలోని హనుమాన్ మందిర్ వద్ద డిసెంబర్ 8, 9,10 తేదీల్లో 19వ భారతీయ సంస్కృతీ ఉత్సవ్ 2024 నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ ఆకొండి పవన్ బుధవారం తెలిపారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. డిసెంబర్ 8న కళాశాల విద్యార్ధులకు, 9న ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు, 10న ఎల్‌కేజీ, 5వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో పేర్ల నమోదుకు, ఆన్‌లైన్ ద్వారా పోటీ అంశాలు పంపించేందుకు డిసెంబర్ ఒకటే తేదీ వరకూ గడువు ఉందన్నారు. ఇతర వివరాలకు, పేర్ల నమోదుకు 81065 76555, 98854 50524 నంబర్లను సంప్రదించాలన్నారు.
మహనీయుల
ఆశయ సాధనకు కృషి
పి.గన్నవరం: మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. నరేంద్రపురం సెంటర్‌లోని శ్రీలక్ష్మీ గణపతి శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకట రెడ్డి, మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహాలను బుధవారం ఆవిష్కరించారు. శెట్టిబలిజ జెండా స్థూపాన్ని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ శెట్టి బలిజలు ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం జరిగిన కార్తిక వన సమారాధనలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, సర్పంచ్ బీర వెంగమాంబ, నాయకులు కుడుపూడి శంకర్‌లాల్, గుత్తుల సత్యనారాయణ, గుత్తుల చంటి, సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పత్తిన వెంకటేశ్వరరావు, గుత్తుల సోంబాబు, ఉపాధ్యక్షులు గుత్తుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అలరించిన అష్టావధానం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర గోదావరి తీరంలో జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అష్టావధాన కార్యక్రమం బుధవారం రాత్రి శ్రీనారాయణదాసా సేవా సమితి ప్రాంగణంలో జరిగింది. శతావధాన శతధృతి గన్నవరం లలితాదిత్య అష్టావధానం చేశారు. కార్యక్రమ నిర్వహణ బహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ, సంస్కృత సమస్య మహామహోపాధ్యాయ శలాక రఘనాథ శర్మ, తెలుగు సమస్య అవధాన ప్రాచార్య ఽడాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, నిషిద్ధాక్షరి గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్, సంస్కృత దత్తపతి అసమాన అవధాన సార్వభౌమ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, తెలుగు దత్తపది శతావధాన శరచ్చంద్ర తాతా సందీప్ శర్మ, వర్ణన అకెళ్ల బాల భాను, వ్యస్తాక్షరి రాంభట్ల పారర్వతీశ్వర శర్మ, అప్రస్తుత ప్రసంగం అచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, ఆశీరభినందన మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment