అక్రమ ఏజెంట్లపై నిఘా
అమలాపురం టౌన్: విదేశాలకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, మోసం చేస్తున్న అక్రమ ఏజెంట్లపై నిఘా పెంచాలని ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు, జిల్లా పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జిల్లా అవుట్రిచ్‌లో భాగంగా సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ అనే అంశంపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీనికి ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కొందరు అక్రమ ఏజెంట్ల మాటలు నమ్మి విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల బాగా పెరిగిపోయాయన్నారు. సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్, ప్రస్తుతం వలస పోకడలపై ఆయన చర్చించారు. అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 1800113090, 011–26885021లను సంప్రదించాలని సూచించారు.
8న ఉపకార వేతన పరీక్ష
అమలాపురం రూరల్: జాతీయ ఉపకార వేతన పరీక్షకు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యాసంవత్సరానికి గాను డిసెంబర్ 8వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందన్నారు. దీనికి 2,815 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 13 పరీక్షా కేంద్రాలను కేటాయించామన్నారు. ఆ రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యూడైస్ కోడ్‌ను ఉపయోగించి లాగిన్ అయ్యి, తమ విద్యార్థులకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసి అందజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment