ఈ నెలలో బలవన్మరణాలివిగో..
రాజమహేంద్రవరం రూరల్: కుటుంబ కలహాలు.. ఆర్థిక సమస్యలు.. ఇంట్లో వాళ్లు మందలించారని.. భార్య కాపురానికి రాలేదని.. పరీక్షల్లో తప్పామని.. ఉన్నత విద్యలో బ్యాక్‌లాగ్స్ ఉండిపోయాయని.. ప్రేమ విఫలమైందని.. స్నేహితులు వంచించారని.. అనారోగ్య సమస్యలు.. వ్యసనాలకు బానిసలవడం.. ఇలా వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో ఇటీవల పెరుగుతోంది. చిన్నచిన్న విషయాలకే విభేదాలు.. గొడవలు.. ఉద్వేగం.. కుంగుబాటుతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సమస్యకు పరిష్కారం వెతుక్కునే సామర్థ్యం లేక, పరిష్కారానికి కొంత సమయం ఎదురు చూసే ధైర్యం లేక అర్ధాంతరంగానే తనువు చాలిస్తూ.. కన్నవారిని, నమ్ముకున్న వారిని పుట్టెడు దుఃఖంలోకి నెడుతున్నారు. ఈ విధంగా ఈ నెలలో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ పది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరి కొంత మంది ఆత్మహత్యా యత్నానికి పాల్పడి, త్రుటిలో ప్రాణాలతో బయట పడ్డారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో అధిక శాతం మంది 40 ఏళ్ల వయస్సు లోపే వారే ఉంటున్నారు. కానీ, 50 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో కూడా ఈ ధోరణి అధికంగా ఉంటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తీరిక లేని జీవితాలు
గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. ఒకరి బాధను మరొకరు పంచుకునేవారు. పెద్దలు క్షణాల్లో సమస్యను పరిష్కరించి, మేమున్నామని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. నేటి పరుగుల ప్రపంచంలో కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోలేనంతగా ఆలోచనా విధానాలు మారిపోతున్నాయి. ఫలితంగా చిన్నచిన్న సమస్యలకే చాలా మంది ఆత్మస్థైరాన్ని కోల్పోతున్నారు. కుటుంబ సమస్యలు తలెత్తిన సమయంలో బాధలు మరొకరితో పంచుకోలేక వారిలో వారే కుంగిపోతూ ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు.
అవగాహన లేక..
సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశమే చాలా సందర్భాల్లో బలవన్మరణాలకు దారి తీస్తోంది. జీవితం, సమస్యలపై సరైన అవగాహన లేకపోవడం కూడా కారణమే. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారు సమస్యను తప్పించుకోవాలని చూస్తున్నారే తప్ప.. బతికి ఉన్నవారిని సరికొత్త సమస్యల్లోకి నెట్టేస్తున్నామన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి అధ్వానంగా మారుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తారు. అలాగే, పెద్దలు బలవన్మరణాలకు పాల్పడితే.. వారిపై ఆధారపడిన భార్యాపిల్లలను ఓదార్చడం ఎవ్వరి తరమూ కాదు. అందువలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పోరాడి పరిష్కరించుకోవాలే తప్ప తప్పించుకునేందుకు ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఎదుర్కోవచ్చు
ఆత్మహత్యలు గతంలోనూ ఉండేవి. ఆత్మహత్య చేసుకున్నారంటే పరువు పోతుందని బయటకు తెలియనిచ్చేవారు కాదు. పోలీసులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. ప్రస్తుతం మీడియా అవేర్‌నెస్ పెరిగిపోవడంతో విషయం బయటకు తెలుస్తోంది. చాలా మంది జన్యుపరంగా, పరిస్థితుల ప్రభావం వలన ఆత్మహత్యలకు పాల్పడుతూంటారు. ఆత్మహత్య భావన ఉన్నవారిని ఒంటరిగా ఉంచకూడదు. వీలైనంత వరకూ ఇంట్లో వారందరి మధ్య మెలిగేలా చూసి ధైర్యం నింపాలి. జీవితంపై ప్రతికూల భావాలను వ్యక్తీకరించినప్పుడు కుటుంబ సభ్యులు తేలికగా తీసుకోకుండా వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
– డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, రాజమహేంద్రవరం
ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే..
ఫ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు కొన్ని అసాధారణ లక్షణాలు కలిగి ఉంటారు.
ఫ ఒంటరితనాన్ని కోరుకుంటారు.
ఫ సకాలంలో ఆహారం తీసుకోరు.
ఫ అతిగా నిద్ర పోతారు.
ఫ రాత్రి వేళల్లో నిద్ర పోకుండా
ఎక్కువగా ఆలోచిస్తూంటారు.
ఫ కొన్నిసార్లు అసలు దేనికీ స్పందించరు.
ఫ బతికి ఉండటం వ్యర్థమని.. చనిపోవాలనుకుంటున్నానని ముందుగానే
పరోక్షంగా సంకేతాలిస్తూంటారు.
ఫ ఇలాంటి వాటిని ప్రారంభంలోనే
కుటుంబ సభ్యులు గుర్తించాలి. వారితో ప్రేమగా మాట్లాడి సమస్య తెలుసుకుని పరిష్కారానికి తోడ్పాటునివ్వాలి.
దీంతో పాటు మానసిక వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తే ప్రయోజనం ఉంటుంది.
ఫ పెరుగుతున్న ఆత్మహత్యలు
ఫ అర్ధాంతంగా ముగుస్తున్న జీవితాలు
ఫ జిల్లాలో ఈ నెలలో
10 మంది బలవన్మరణాలు
ఫ మానసిక దృఢత్వం
అవసరమంటున్న నిపుణులు
ఫ గోకవరం: భర్త వేధింపులు తాళలేక గండేపల్లి అనూష (24) ఆత్మహత్య.
ఫ రాజమహేంద్రవరం: భార్య చనిపోయిందనే వేదనతో అన్నపూర్ణపేట రైల్వే గేటు సమీపాన రైలు కింద పడి కేకే రాజు అనే వ్యక్తి మృతి.
ఫ హౌసింగ్ బోర్డు కాలనీ: భార్యతో విడిపోయి, విడాకులు కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో మనస్తాపంతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజ్‌కుమార్ (38) ఉరి.
ఫ పెరవలి మండలం ఖండవల్లి: భార్య కాపుకానికి రాలేదనే మనస్తాపంతో పురుగు మంది తాగి పల్లేటి రవి (24) ఆత్మహత్య.
ఫ హౌసింగ్ బోర్డు కాలనీ: పాడిశెట్టి దుర్గాంబిక (30) కోపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య.
ఫ ఉండ్రాజవరం మండలం పాలంగి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక వీఆర్‌వో యార్లగడ్డ
నాగ గంగరాజు (41) ఆత్మహత్య.
ఫ నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆత్కూరి సాయి మణిదీప్ (21) బ్యాక్‌లాగ్స్ ఉన్నాయనే బెంగతో హాస్టల్ గదిలో పురుగు మందు తాగి ఆత్మహత్య. తల్లిదండ్రులకు పుత్రశోకం.
ఫ రాజమహేంద్రవరం: ఆర్థిక ఇబ్బందులు తాళలేక సాలా బాల పరమేశ్వరి (35) ఆత్మహత్య. ఇదివరకే భర్త చనిపోవడంతో దయనీయంగా మారిన ఇద్దరు పిల్లల పరిస్థితి.
ఫ మద్యానికి బానిసై.. మానసిక పరిస్థితి సరిగా లేక మర్రి రాజా రంజిత్ కుమార్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్య.
ఫ హుకుంపేట డి–బ్లాకు: మద్యానికి బానిసై నేదునూరి సంతోష్ కుమార్ (25) ఆత్మహత్య. ఆధారం కోల్పోయిన భార్య, ఇద్దరు పిల్లలు.
Comments
Please login to add a commentAdd a comment