కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే చర్యలు బొత్తిగా లేకపోవడం దేశ ప్రజల్ని నిశ్చేష్టుల్ని చేసింది. కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకొన్నది వ్యవసాయ రంగమే. ఈ వాస్తవాన్ని కేంద్రం ఎందుకు విస్మరించిందో అర్థం కాదు. కరోనా దెబ్బకు మిగతా రంగాలు చతికిల పడ్డాయి. రెండేళ్లు దాటినా నేటికీ పలు రంగాలు కోలుకోలేదు. కానీ, వ్యవసాయరంగం మాత్రం యావత్ దేశాన్ని ఆదుకొంది. ప్రజలకు కష్టకాలంలో పట్టెడన్నం పెట్టింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించింది. తల్లిలా అందర్నీ ఆదుకొన్న వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌లో మరింత ఊతం ఇచ్చే చర్యలు ఉంటాయని వేసుకున్న అంచనాలు పూర్తిగా తారు మారయ్యాయి.
బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 2021–22లో కేటాయించిన 3.92% నిధులను ఈసారి (2022–23) 3.84%కు కుదించడం శోచనీయం. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చడం, స్టార్టప్‌లపై దృష్టి పెంచడం ఆహ్వానించదగిన చర్యలే. కానీ, కీలకమైన మార్పులు చేయకుండా అరకొర చర్యలతో సరిపెడితే ఉపయోగం ఏముంటుంది? ఆశించిన ఫలితాలెలా వస్తాయి? వరి, గోధుమల సేకరణకు కనీస మద్దతు ధరలు అందించ డంతో పాటు అన్ని పంటలకు కూడా రైతు సంఘాలు కోరినట్లుగా చట్టబద్దమైన మద్దతు ధరలు అందించడానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెంచి ఉండాల్సింది.
ఇప్పటివరకు మొత్తం ఆహార ధాన్యాలలో కేంద్రం సేక రించింది 35 శాతమే. ఒక అంచనా ప్రకారం 2022 మార్చి నాటికి దేశంలోని రైతాంగం వద్ద 65 శాతం ఆహారధాన్యాలను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, కేంద్రం వైఖరి చూస్తోంటే... వరి, గోధుమ మినహా మిగతా పంటలను ప్రైవేటు వ్యాపారులకే అప్పజెప్పేటట్లు కనిపిస్తోంది. ఇక, దేశంలో తృణ ధాన్యాల వాడకం పెరిగిన నేపథ్యంలో 2023వ సంవత్సరాన్ని ‘తృణ ధాన్యాల సంవత్సరం’గా ప్రకటించడాన్ని ఆహ్వానించాల్సిందే. రైతాంగానికి లాభసాటి ధరలు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటా యించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నప్పటికీ... ఈ బడ్జె ట్‌లో కూడా వాటికి నిధులు కేటాయించలేదు. 2022–23ను కేవలం తృణధాన్యాల సంవత్సరంగా నామకరణం చేయడం వల్ల రైతులకు ఒరిగే లాభమేమిటి?
ఇక, రసాయనాల వాడకాన్ని నిరుత్సాహపర్చడానికి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగును ప్రోత్సహిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ అందుకు నిర్దిష్టమైన ప్రతిపాదనలు బడ్జెట్‌లో కనపడటంలేదు. స్వయంగా ప్రధానమంత్రి ప్రతి పాదించిన పథకాలకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో అనాలోచిత చర్య. ఉదాహరణకు ‘పరం పరాగత్ కృషి యోజన’ను ‘రాష్ట్రీయ కృషి యోజన’లో విలీనం చేశారు. మొత్తం 27 పథకాలను 7 పథకాలుగా మార్చారు. సహకార రంగానికి ప్రోత్సాహం ఇస్తామని చెప్పి... దేశంలో విశిష్ట చరిత్ర, ప్రాముఖ్యం ఉన్న పాల ఉత్పత్తి సహకార సంఘాలకు ఇస్తున్న కొన్ని రాయితీలను ఎత్తేయడానికి ఏకంగా పథకాలనే రద్దు చేయడం శోచనీయం.
మూడునాలుగేళ్ల క్రితం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పథకంగా అభివర్ణించిన ఫసల్ బీమా పథకం అసలు ఉన్నదో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకంలో మార్పులు తెచ్చి రైతులకు ప్రయోజనం కలిగేలా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ బడ్జెట్‌లో నిరాశ కలిగించిన మరో ప్రధానమైన అంశం రైతులకు స్వల్పకాలిక రుణాలపై ఇచ్చే రాయితీ గురించిన ప్రస్తావన లేకపోవడం! ‘మార్పు చేసిన వడ్డీ రాయితీ పథకం’ అంటూ ఓ కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ పథకం విధివిధానాలేమిటో భవిష్యత్తులో చూడాల్సి ఉంది.
రైతులు, రైతాంగ సంస్థలు జాతీయ స్థాయిలో ఏడాదిపాటు ఉద్యమించి కేంద్రం మెడలు వంచి మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేలా చేసినందుకు గాను వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకొన్నట్లుగా ఉందిగానీ, సానుకూల ప్రోత్సాహకాలు కనిపించటంలేదు. రైతులు ఏం పాపం చేశారు?
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తిండి గింజలు పండించి దేశ ప్రజల ఆకలి తీర్చడమేనా? వ్యవసాయ సంక్షోభాన్ని నివారించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ కేంద్ర బడ్జెట్ లేదు. అయితే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి కొన్ని రాష్ట్రాలు రైతులను ఆదుకోవడానికి చేపట్టిన ప్రోత్సాహ కాలే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాయి అనే విషయం కాదన లేని వాస్తవం. కేంద్ర సహకారం తోడై ఉంటే పరిస్థితి మరింత మెరుగై ఉండేది.
వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఏపీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి అన్యాయం చేసింది. కరోనాకు ఎదురునిలిచి రైతన్న దేశానికి తిండిపెట్టాడు. అటువంటి మెతుకు దాతకు బడ్జెట్ నిరాశను మిగిల్చింది. వ్యవసాయం, అను బంధ రంగాలకు నిధులను కుదించడం శోచనీయం. స్వయంగా ప్రధాని ప్రతిపాదించిన పథకాలకు బడ్జెట్‌లో ప్రోత్సహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో విమర్శనార్హమైన అంశం.
డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment