మనసున్న మనిషి పాలకుడైతే నిర్ణయాలెలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. సంక్రాంతికి అయిదారు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపారు. వారు కోరుకున్న విధంగా మాత్రమే కాదు... అంతకన్నా అధికంగా లబ్ధి చేకూర్చి అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. శుక్రవారం ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటిస్తూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులనుద్దేశించి చేసిన ప్రసంగం ఆయన వ్యక్తిత్వానికీ, ఆయనలోని సానుకూల దృక్పథానికీ అద్దం పట్టింది.
అధికారుల కమిటీ చేసిన సిఫార్సుకు భిన్నంగా 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడంతోపాటు ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంలోనే ఆయన వైఖరేమిటో అందరికీ తేటతెల్లమైంది. గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు జగన్‌మోహన్ రెడ్డి అన్నదేమిటో అందరికీ తెలుసు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంతా చేస్తానన్నది ఆ ప్రసంగం సారాంశం. ‘ఉదారంగా, మానవతా దృక్పథంతో ఉండే విషయంలో నాకన్నా బాగా స్పందించేవాళ్లూ, నాకన్నా ఎక్కువగా స్పందించేవాళ్లూ తక్కువగా ఉంటారు’ అని ఆయన అన్న మాటలు స్వోత్కర్షతో కూడినవి కాదని, వాటి వెనక మూర్తీభవించిన నిజాయితీ గూడుకట్టుకుని ఉన్నదని తాజా నిర్ణయాలు ఎలుగెత్తి చాటుతున్నాయి.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి పాలకుడిగా వచ్చిన చంద్రబాబు నాయుడు అయిదేళ్లపాటు తన తప్పుడు ప్రాధమ్యాలతో, అసంబద్ధ విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. వేలాదికోట్ల రూపాయలమేర బకాయిలు మిగిల్చి నిష్క్రమించారు. ఇది చాలదన్నట్టు గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఫలితంగా ఏటా 15 శాతం మేర పెరగాల్సిన ఖజానా రాబడి కాస్తా క్షీణిస్తున్నది. 2018–19, 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో వరసగా పడి పోయిన ఆదాయమే ఇందుకు సాక్ష్యం. జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేకత ఏమంటే... ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేద ప్రజల, రైతుల, అట్టడుగు కులాల, వర్గాల సంక్షేమాన్ని మరువకపోవడం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొదలు సమస్త రంగాలూ జవసత్వాలతో కొనసాగడానికి అనువైన విధానాలు రూపొందించడం.
ఈ నిర్ణయాల ఫలితంగానే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల కొనుగోలు శక్తి మెరుగ్గా ఉండగలిగింది. మరోపక్క విద్య, వైద్య రంగాలను రెండు కళ్లుగా భావిస్తూ వాటిని బలోపేతం చేస్తున్నారు. పడిపోతున్న ఆదాయం పర్యవసానంగా ఏర్పడిన కష్టాలను పంటి బిగువన భరిస్తూ దేనికీ లోటు జరగకుండా చర్యలు తీసుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్యోగుల ఆందోళన సాకుతో ఇబ్బందులపాలు చేయాలని తెలుగుదేశం, దాని అనుకూల మీడియా శక్తులూ కాచుక్కూర్చున్నాయి. ఉద్యోగశ్రేణులకూ, ప్రభుత్వానికీ మధ్య అగాథాన్ని సృష్టించాలని కలలుగన్నాయి. కానీ ప్రజల పట్ల నిబద్ధత, వారిపట్ల సహానుభూతి, నిండైన విశ్వసనీయత కలిగిన జగన్‌మోహన్ రెడ్డి ముందు అవన్నీ వీగిపోయాయి.
అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్‌పీల సదస్సులో తన పాలన ఎలా ఉండబోతున్నదో, అధికారగణంనుంచి తాను ఆశిస్తున్నదేమిటో జగన్ తేటతెల్లం చేశారు. ప్రజలతో వ్యవహరించాల్సివచ్చినప్పుడూ, వారు లేవనెత్తే సమస్యల పరిష్కా రానికి పూనుకున్నప్పుడూ ఉదార దృక్పథాన్ని ప్రదర్శించాలనీ, అందులో మానవీయ స్పర్శ మిళితం కావాలనీ కోరారు. ఆ క్షణం మొదలుకొని నిత్యం ఆయన దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. అధికా రులు ఆచరించేలా చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడ లోటుపాట్లు కనిపించినా స్వయంగా జోక్యం చేసుకుని సవరిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల సందర్భంలోనూ, నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ ఆయన వీటినే పాటించి చూపారు. పీఆర్సీ ప్రకారం సవరించే వేతనాలను వచ్చే అక్టోబర్ నుంచి ఇవ్వాలని అధికారుల కమిటీ సిఫార్సు చేయగా, అంతకన్నా పది నెలల ముందే– ఈ నెలనుంచే అమలు చేయాలని నిర్ణయించడంగానీ, ఎన్నడూ లేనివిధంగా కొత్త స్కేళ్లను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ఆదేశించడంగానీ ఆ కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాలంనుంచీ పీఆర్సీ వేతనాల అమలులో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తింపజేసిన ఏడాది, ఏడాదిన్నర తర్వాతగానీ వారికి కొత్త వేతనాలు లభించేవి కాదు.
అందుకోసం ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కూడా మామూలే. కానీ ఈ రివాజుకు భిన్నంగా వ్యవహరించడం ద్వారా తనేమిటో మరోసారి జగన్ నిరూపించారు. ఇప్పటికే ఆ వర్గాలవారికి అందే జీతాల్లో దళారీల పాత్ర లేకుండా చేశారు. ఉద్యోగ సంఘాలు కోరకుండానే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు కేటాయించారు. పైగా ఆ ప్లాట్లకయ్యే వ్యయంలో 20 శాతం రిబేట్ ఇవ్వాలని నిర్ణయించారు. నిన్నా, ఈరోజూ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన సందర్భాల్లో వారిలో తననూ భాగం చేసుకుని మాట్లాడారు. ఆయన చూపిన చొరవా, ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలూ ఉద్యోగ శ్రేణుల్లో స్ఫూర్తిని నింపుతాయని, వారు మరింత అంకితభావంతో పనిచేయడానికి తోడ్పడతాయని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment