పౌరహక్కులను అణిచేసి, ప్రభువులకు స్తోత్రపాఠాలు చేయాలని నూరిపోసే దేశంలో... పాలకుల విగ్రహాలను ప్రజలు తగలబెట్టడం విస్మయకరమే. కజకస్తాన్‌లో ఈ నూతన సంవత్సరారంభంలో చెలరేగిన నిరసన అతి పెద్ద రాజకీయ సంక్షోభమనేది అందుకే! ఈ చమురు సంపన్న దేశంలో ఎల్పీజీ ఇంధన ధరలు రెట్టింపు కావడంపై జనవరి 2న ప్రజాగ్రహం పెల్లుబికింది. పదేళ్ళ క్రితం ప్రాణాలర్పించిన కామ్రేడ్ల సంస్మరణను అంతకు ముందు డిసెంబర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. వీటన్నిటితో జనంలో మొదలైన అలజడి చినికిచినికి గాలివానై, ఆర్థిక కేంద్రమైన అల్మాటీ సహా ఆ దేశంలోని నగరాలన్నిటికీ విస్తరించింది. పోలీసు కాల్పులకు దారి తీసింది. నిరసనకారులకూ, పోలీసులకూ మధ్య తీవ్ర ఘర్షణల్లో 160 మందికి పైగా మరణిస్తే, ఆరేడు వేల మందిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంక్షోభ వేళ సాయపడాల్సిందిగా రష్యా ప్రాబల్యంలోని ‘సమష్టి భద్రతా ఒప్పంద సంస్థ’ (సీఎస్టీఓ)ను కజక్ అధ్యక్షుడు కసిమ్– జొమార్ట్ తొకయేవ్ కోరడం, అదే అదనుగా జనవరి 6న రష్యా 2500 మంది బలగాన్ని పంపడం చర్చనీయాంశమైంది.
మధ్య ఆసియా దేశం కజక్‌లో ప్రజాందోళనకు తక్షణ కారణం ఇంధన ధరలైతే కావచ్చు గాక, కానీ అదొక్కటే కారణం కాదు. ఆ దేశ సంపదలో 55 శాతం కేవలం 162 మంది సంపన్నులదేనని తాజా లెక్క. ఆర్థికాభివృద్ధి అద్భుతమైనా, సామాన్యుడి సగటు వేతనం నెలకు 100 డాలర్ల లోపే! ఈ సామాజిక – ఆర్థిక అసమానత, పెచ్చుమీరిన అవినీతిపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆక్రోశం ఇలా బహిర్గతమైంది. పాలనలో మార్పు కోరుతున్నారని స్పష్టమైంది. ప్రజాగ్రహ జ్వాల ప్రభువులు అదుపు చేయలేనిదిగా మారింది. తొకయేవ్ ఇంధన ధరలపై వెనక్కితగ్గారు. మంత్రివర్గాన్ని రద్దు చేశారు. గతంలో దేశాధ్యక్షుడిగా 28 ఏళ్ళ పాటు ఏలిన నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్‌ను దేశ భద్రతా మండలి ఛైర్మన్ హోదా నుంచి తప్పించారు. అయినా నిరసనలు ఆగట్లేదు.
సోవియట్ యూనియన్ నుంచి విడివడి, 1991లో స్వతంత్ర రిపబ్లిక్‌గా అవతరించినప్పటి నుంచి మూడు దశాబ్దాల్లో కజకస్తాన్ కనివిని ఎరుగని ఘటనలివి. నిజానికి, మధ్య ఆసియాలోని రిపబ్లిక్స్ అన్నింటిలోకీ కజక్ సంపన్నమైనది, స్థిరమైనది. ప్రపంచ యురేనియమ్ నిల్వల్లో 40 శాతానికి పైగా ఆ దేశంలోనే ఉన్నాయి. సహజవాయు నిల్వల విషయంలో ప్రపంచంలోని 15 అగ్రదేశాల్లో ఇది ఒకటి. స్వతంత్ర దేశమైన నాటి నుంచి కజక్ నిరంకుశ ప్రభువుల గుప్పెట్లో ఉంటూ వచ్చింది. 2019లో నజర్‌బయేవ్ అధ్యక్షుడిగా వైదొలగినా, తాను ఏరికోరి ఎంచుకున్న తొకయేవ్‌ను ఆ పీఠంపై కూర్చోబెట్టారు. ప్రభుత్వంపై పట్టు కొనసాగించారు. రాజధాని నూర్‌సుల్తాన్ ఆయన పేరిట వచ్చిందే! దేశమంతటా ఆయన విగ్రహాలే! తక్కువ వేతనాలు, దీనమైన పని పరిస్థితులతో కొన్నేళ్ళుగా శ్రామికులలో, స్థానిక తెగల్లో అలజడి పెరుగుతూ వచ్చింది. తొకయేవ్‌తో పరిస్థితులు మారతాయనుకుంటే, నజర్‌బయేవ్ తెర వెనుక నుంచి ఆడించారు. కరోనాతో ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం పరిస్థితిని దిగజార్చాయి. చివరకు ఆగ్రహంతో జనం విగ్రహాలు తగలబెట్టారు.
నిరసనకారులను ‘విదేశీ శిక్షణ పొందిన తీవ్రవాదులు’ అని ఆరోపిస్తూ, సీఎస్టీఓ సాయం కోరారు కజక్ అధ్యక్షుడు. నిజానికి, అమెరికా ప్రాబల్యం కనిపించే అంతర్ ప్రభుత్వ సైనిక కూటమి ‘నాటో’ లాగానే రష్యా కనుసన్నల్లోని మరో భద్రతా కూటమి – ‘సీఎస్టీఓ’. సోవియట్ పతనం తర్వాత, ‘స్వతంత్ర దేశాల కామన్వెల్త్’ (సీఐఎస్)లోని కొన్ని సభ్యదేశాలు కలసి చేసుకున్న పరస్పర భద్రతా ఒప్పందం అది. వార్సా ఒప్పందానికి బదులుగా ఉద్దేశించిన ఇది 1994లో అమలులోకి వచ్చింది. 2002లో ‘సీఎస్టీఓ’ అయింది. ‘అందరి కోసం ఒక్కరు. ఒక్కరి కోసం అందరు’ అనే ఈ కూటమిలో ప్రస్తుతం రష్యా, తజికిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, ఆర్మేనియా, బెలారుస్, కజక్‌స్తాన్‌లు ఆరూ సభ్యదేశాలు. కొన్నేళ్ళుగా సీఎస్టీఓ పెద్ద క్రియాశీలంగా లేదు. కానీ, ఈసారి కజక్ సైనిక సాయం కోరీ కోరగానే సీఎస్టీఓ పక్షాన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొరవ తీసుకోవడం గమనార్హం.
రష్యాకు దాని లెక్క దానికి ఉంది. దాదాపు 7500 కి.మీకు పైగా సరిహద్దును పంచుకుంటున్న పొరుగుదేశం కజకస్తాన్‌లో రాజకీయ అస్థిరత్వమంటే రష్యాకు పెద్ద తలనొప్పి. దాని వల్ల అతి జాతీయవాదులు, విప్లవ ఇస్లామిక్ శక్తులు ప్రబలుతారని మాస్కో భయం. దానివల్ల కజక్‌లో దాదాపు 19 శాతం జనాభా ఉన్న రష్యన్ జాతీయులకు భద్రతకు ముప్పు. నిరసనల్ని అణచివేస్తే ఆ తలనొప్పి ఉండదు. పైపెచ్చు, కజక్ పాలకులు తనకు ఋణపడి ఉంటారన్నది రష్యా ఆశ. అలాగే, రష్యా, చైనా, టర్కీల మధ్య దీర్ఘకాలిక సమతూకపు విదేశాంగ విధానాన్ని కజకస్తాన్ మార్చుకొని, తనకు మంచి మిత్రపక్షమవుతుందని ఆలోచన.
కర్తవ్యం ముగిసిన వెంటనే కజక్‌లో బలగాలను ఉపసంహరిస్తామని రష్యా అంటోంది. కానీ, ఒకసారి ఇంట్లోకి రష్యన్లను అనుమతిస్తే వారిని సాగనంపడం చాలా కష్టమని సమీప చరిత్ర చెబుతోందని అమెరికా సందేహాల సన్నాయి వినిపిస్తోంది. మరోపక్క కజకస్తాన్‌కు మరో పెద్ద పొరుగుదేశమైన చైనా పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తోంది. మధ్య ఆసియాలో ప్రాబల్యం కోసం రష్యాతో పోటీపడుతున్న చైనాకు ఎంతైనా ఈ పరిణామాలన్నీ కీలకం మరి! ఈ ఏడాది రిపబ్లిక్ డే అతిథిగా మన దేశానికి రానున్న కజక్ అధినేత ఏం చేస్తారో చూడాలి. బలప్రయోగంతో అంతర్గత సమస్యలు సమసిపోవనీ, ప్రజల్ని భాగస్వాముల్ని చేసే పరిష్కారమే మేలనీ ప్రత్యేకించి చెప్పాలా?
Comments
Please login to add a commentAdd a comment