పాటనే జీవితంగా మలుచుకొని చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. 1972 ఏప్రిల్ 29న భువనగిరిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చదువులేని ఆమె పొట్టకూటి కోసం స్థానిక కాటన్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఈ క్రమంలోనే సీఐటీయూలో సభ్యత్వం తీసుకొని కార్మిక హక్కుల సాధన కోసం పోరాడింది. అనంతరం ‘భువనగిరి సాహిత్య మిత్ర మండలి’లో చేరి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటను తన అస్త్రంగా మార్చుకుంది. ‘తాగబోతే నీళ్లు లేవూ తుమ్మెదాలో... తడి గొంతూలారిపాయే తుమ్మెదాలో!’ అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యలపై గళమెత్తింది.
1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ ‘తెలంగాణ ఐక్య వేదిక’ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న భువనగిరిలో జరిగిన ‘దగాపడ్డ తెలంగాణ’ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 1997 ఆగస్టు 11న బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మహాసభ’తో పాటు 1997 డిసెంబర్ 28న వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో లలిత తన గానంతో గర్జన చేసింది. పీపుల్స్‌వార్ సానుభూతిపరుల ‘తెలంగాణ జనసభ’ అనుబంధ విభాగమైన ‘తెలంగాణ కళా సమితి’ కన్వీనర్‌గా ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత వివరించింది.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్ధృతం అవుతుండటం ఆనాటి సమైక్య పాలకులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిపి, బహుజన నేత మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నారు. ఈ తరుణంలో1999 మే 26న ఇంటి నుండి వెళ్ళిన లలిత తిరిగిరాలేదు. 1999 మే 29న దర్గాబావిలో శరీర భాగాలు ఉన్నాయన్న వార్తతో భువనగిరి ఉలిక్కి పడింది. పదమూడు రోజులు గాలించగా పలు బావులు, చెరువుల్లో 17 ముక్కలైన లలిత శరీర భాగాలు లభ్యమయ్యాయి.
1999 జూన్ 11న జరిగిన అంత్యక్రియలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. నాటి పాలకులే... మాజీ నక్సలైట్‌ను ఆయుధంగా మార్చుకొని లలితను పాశవికంగా హత్య చేయించారని ప్రజా సంఘాలు నిరసించాయి. ఆరు దశాబ్దాల ఆకాంక్షకై 17 ముక్కలైన లలిత అమరత్వానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ కనీస గౌరవం దక్కలేదు.
– పి. నరేష్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి
(నేడు బెల్లి లలిత 25వ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment