
నెలరోజులపాటు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడిన రాజస్తాన్ ప్రభుత్వం మళ్లీ నిటారుగా నిలబడింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసి ఉపముఖ్యమంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవడంతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలను తోడు తీసుకుని హరియాణాలో శిబిరం నడిపిన సచిన్ పైలట్ బుద్ధిమంతుడిలా స్వగృహానికి తిరిగొచ్చారు. ‘నేను కాంగ్రెస్‌ను విడిచి పోలేదు. తిరుగుబాటూ చేయలేదు. పార్టీ అధినాయకత్వానికి సమస్యల గురించి చెప్పినా పరిష్కారం కాలేదు సరికదా, రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. కనుకనే ఇలా చేయాల్సివచ్చింది’ అంటున్నారు పైలట్. మొత్తానికి అంతా అయిన తర్వాత ‘గజం మిధ్య... పలాయనం మిధ్య’ అంటూ ఆయన తేల్చేశారు. పైలట్ లేవనెత్తిన సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ వేస్తామని కాంగ్రెస్ అనడం కంటితుడుపు చర్య. రాజస్తాన్ ప్రహసనం అందరికీ అన్నీ నేర్పింది. కానీ పైలట్ పరువు తీసింది. ఆయన ఇన్నేళ్లుగా నిర్మించుకుంటూ వచ్చిన రాజకీయ జీవితంపై మరక మిగిల్చింది. కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెఖావత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారని చెబుతూ అందుకు సంబంధించి గత నెలలో కాంగ్రెస్ రెండు ఆడియో టేపులు విడుదల చేసింది. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం, పైలట్ శిబిరంలో వున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మను ప్రశ్నించడానికి రాజస్తాన్ పోలీసులు హరియాణాలోని గుర్‌గావ్‌కు తరలిరావడం, అక్కడ రెండు రాష్ట్రాల పోలీసుల మధ్యా కాసేపు వివాదం సాగడం అందరూ చూశారు. ఇప్పుడు ఆ భన్వర్‌లాల్ శర్మ హఠాత్తుగా పైలట్ శిబిరం నుంచి పలాయనం చిత్తగించడం వల్లే పైలట్‌కు లొంగి పోవడం మినహా మరో మార్గం లేకపోయిందంటున్నారు.
గెలుపు, ఓటములకు నిర్దిష్టమైన ఫార్ములాలంటూ ఏమీ లేనట్టే ప్రభుత్వాలను కూల్చే ఫార్ము లాలు కూడా రెడీగా వుండవు. రాజస్తాన్‌లో బీజేపీకి అది ఆలస్యంగా అర్ధమైంది. కరోనా విరుచుకు పడటం మొదలైన తొలినాళ్లలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సులభంగానే పతనమైంది. ఆ ఉత్సాహంతోనే రాజస్తాన్ డ్రామా కూడా మొదలుపెట్టినా అది ప్రతిష్టంభనలో పడింది. సంక్షోభం పుట్టుకొచ్చిన కొద్దిరోజుల్లోనే దాన్ని ఎటువైపు నడిపించాలో, ఎలాంటి ఎత్తుగడలేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు తెరవెనక నేతలు. మధ్యప్రదేశ్‌లో విజయం సాధించిన వ్యూహం రాజస్తాన్‌లో కుప్పకూలడానికి చాలా కారణాలే వున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య సంఖ్యాపరంగా పెద్ద వ్యత్యాసం లేదు. పైగా అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో దీటురాగల నేతలు బీజేపీలో లేరు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన జ్యోతిరాదిత్య సింధియా నుంచి చౌహాన్‌కు తక్షణం వచ్చే ముప్పేమీ లేదు. జ్యోతిరాదిత్యకు వెనువెంటనే సీఎం కావాలన్న కోరికా లేదు. కాంగ్రెస్‌లో కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్యల వర్గాలున్నాయి. అక్కడ మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి కారణమైన రాజకీయ సంక్షోభం కన్నా ముందు చిన్న సైజు తిరుగు బాటు రేగింది. 8 మంది ఎమ్మెల్యేలు పైలట్ తరహాలోనే హరియాణాలోని గుర్‌గావ్‌కు వలస పోయారు. కానీ దిగ్విజయ్ వారితో చర్చించి ఒప్పించి వెనక్కి రప్పించారు. రెండోసారి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక వెళ్లిపోవడం, అక్కడినుంచే పార్టీకి చెల్లుచీటి ఇవ్వడంతో కమల్‌నా«ద్‌కు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది.
రాజస్తాన్ తీరు వేరు. అక్కడ టికెట్ల పంపిణీ సమయంలోనే అశోక్ గహ్లోత్ ముందు చూపుతో తన వర్గానికి అధికంగా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. వారిలో ఎక్కువమందిని గెలిపించుకున్నారు. ఆయన వ్యూహం ముందు పైలట్ నిలబడలేకపోయారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని నమ్ము కోవడం వల్ల ఉప ముఖ్యమంత్రి పదవి, పీసీసీ అధినేత పదవి దక్కాయి. అంతకు మించి ఆశించడం వల్ల పైలట్ భంగపడ్డారు. 200 మంది సభ్యులుండే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు స్వతంత్రులు, నిరుడు వచ్చిచేరిన ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలసహా 102 మంది మద్దతుంది. అటు బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నా వారిలో అత్యధికులు మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే వర్గంలో ఉన్నారు. పైలట్ రాక వల్ల కాంగ్రెస్ నుంచి మరో రాష్ట్రాన్ని ఊడబెరికామన్న తృప్తి బీజేపీ అధినేతలకు వుంటే వుండొచ్చు. కానీ వసుంధరకు అదంతా అనవసరం. ఎందుకంటే ఈ సంక్షోభంతో ప్రధానంగా బల హీనపడేది ఆమె వర్గమే. కనుకనే వసుంధర సహకరించలేదు. ఈ విషయంలో ఆమెను ఒప్పిం చడానికి చేసిన ప్రయత్నాలు ఎంతకూ ఫలించకపోవడంతో పైలట్ తిరుగుబాటులో కీలకపాత్ర పోషించిన వృద్ధ నేత భన్వారీలాల్ శర్మ అక్కడినుంచి జారుకుని ఉండొచ్చు. ఇదంతా బహిరంగంగా జరగలేదు గనుక బీజేపీ సులభంగా చేతులు దులుపుకుంది. సంక్షోభంలో తమ పాత్రలేదని, అది కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల ఫలితమని మొదటే చెప్పామని ఆ పార్టీ తప్పుకుంది.
ఎటొచ్చీ పైలట్ అన్నివిధాలా నష్టపోయారు. కొన్ని విలువల కోసం పోరాడానని ఆయన ఇప్పుడు గంభీరంగా చెబుతున్నారు. విలువల కోసం పోరాడదల్చుకుంటే శిబిరాలు నడపరు. మరో పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రక్షణ తీసుకోరు. వెనక ఎందరున్నారన్న లెక్కలతో నిమిత్తం లేకుండా నమ్మిన విశ్వాసాల కోసం పనిచేస్తారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులెదురైనా మనో నిబ్బరంతో ముందుకెళ్తారు. యువ నాయకుడైనా, రాష్ట్రం నలుమూలలా చెప్పుకోదగ్గ పలుకుబడి వున్నా సచిన్ పైలట్ అందుకు సిద్ధపడలేకపోయారు. తన నిర్ణయం రాజకీయంగా ఆత్మహత్యా సదృశం కావొచ్చునన్న సంశయం ఆయనకు కలగలేదు. ఆయన మాటెలావున్నా ఇక్కడితో అంతా అయిపోలేదని కాంగ్రెస్ గ్రహించాలి. ఇది విరామం మాత్రమే. ఈ వ్యవధిలో పనితీరు మార్చుకుని స్వీయప్రక్షాళనకు సిద్ధపడాలి. సంస్థాగతంగా బలపడాలి. అడ్‌హాకిజం అన్నివేళలా ఫలితాలనీయదని గుర్తించాలి.