స్వోత్కర్షలు, భావోద్వేగాలు, ప్రచారపటాటోపాలు ఏ పార్టీనీ గద్దెనెక్కించలేవు సరిగదా... ప్రత్యర్థి పక్షం మెజారిటీని తగ్గించడం కూడా సాధ్యపడదని నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం నిరూపించాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగిన పశ్చిమ బెంగాల్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి. ‘దీదీ...ఓ దీదీ’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్యంగా సంబోధించిన తీరు జనం మెచ్చలేదని ఫలితాలు చెబుతున్నాయి. 294 స్థానాలున్న ఆ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ గతంతో పోలిస్తే తృణమూల్ పరిస్థితి మెరుగైంది. అధికారంలోకి రావడం లాంఛనమే అన్నట్టు ప్రవర్తించిన బీజేపీ రెండంకెల సంఖ్యను దాటలేక చతికిలబడింది. తృణమూల్‌నుంచి ఆఖరి నిమిషంలో లంఘించి కాషాయ తీర్థం పుచ్చుకున్నవారిలో అత్యధికులను ఓటర్లు గంపగుత్తగా తిరస్కరించటం విశేషం. అవకాశవాదులను ఎక్కడైనా జనం మెచ్చరని మరోసారి నిరూపణ అయింది.
బెంగాల్ వైఫల్యంతో దిగాలుగా వున్న బీజేపీకి నందిగ్రామ్‌లో మమత ఓడిపోవటం... గతంలో మూడు సీట్లున్న రాష్ట్రంలో ఇప్పుడు 75 సాధించటం కొంతలో కొంత ఊరట. కానీ 2019నాటి లోక్‌సభ ఎన్నికల్లో గెల్చుకున్న 18 స్థానాలను అసెంబ్లీ స్థానాలకు వర్తింపజేసి లెక్కేస్తే ఇప్పుడు సీట్లు తగ్గినట్టే భావించాలి. పాలకపక్షానికే తిరిగి పగ్గాలు అప్పగించినచోట ఆ పక్షానికి సారథిగా వున్నవారు పరాజయంపాలు కావటం ఊహించని పరిణామం. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. నందిగ్రామ్ విజయం బీజేపీకి అంత సులభంగా దక్కలేదు. ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆటను తలదన్నేలా చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ఒక దశలో విజేత ఎవరన్న అయోమయం సాగింది. ఎట్టకేలకు 1,736 ఓట్ల మెజారిటీతో సువేందుకే నందిగ్రామ్ దక్కింది. వామపక్షాలది దయనీయమైన స్థితి. 2016లో గెల్చుకున్న 76 స్థానాల్లో లెఫ్ట్ ఫ్రంట్ కూటమికి ఇప్పుడు దక్కింది ఒక్కటే.
ఇక నాలుగు దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయాన్ని కాదని కేరళ ప్రజలు వరసగా రెండోసారి కూడా వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్(ఎల్‌డీఎఫ్)కు అధికారాన్ని అప్పగించారు. అంతేకాదు...మునుపటితో పోలిస్తే మరో తొమ్మిది స్థానాలు అదనంగా ఇచ్చారు. కరోనాను ఎదుర్కొనడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అందరి ప్రశంసలూ పొందిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌దే ఈ విజయం. సెంటిమెంటు ప్రకారం ఎటూ తమదే అధికారమని భావించిన యూడీఎఫ్‌కు ఇది ఊహించని షాక్. అధికారం రాకున్నా బీజేపీకి మెరుగైన సంఖ్యలో సీట్లు లభించవచ్చని చాలామంది అంచనా వేశారు. తీరా గతంలో గెల్చుకున్న 8 స్థానాలూ కూడా బీజేపీ చేజార్చుకుంది. మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసినా ఏమాత్రం ఫలితం లేకపోగా ఆయనే ఓడిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయారు. శబరిమల వివాదంలో బీజేపీ మాదిరే జనం మనోభావాలను ఓట్ల రూపంలో మలుచుకోవడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిద్ధాంతాలకు నీళ్లొదిలి గెలవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడితే జరిగేది ఇదే.
నిరసనలతో అట్టుడికిన అస్సాంలో తిరిగి అధికారంలోకి రావడం, చిన్నదైనా పుదుచ్చేరిలో తన కూటమికి అధికారం దక్కడం బీజేపీకి పెద్ద ఊరట. అస్సాంలో తిరిగి బీజేపీకే అధికారం వస్తుందని సర్వేలు చెప్పినా, హంగ్ అసెంబ్లీ తప్పకపోవచ్చని పలువురు అనుకున్నారు. కాంగ్రెస్–ఏఐడీయూఎఫ్–బీపీఎఫ్ కూటమి పోలైన ఓట్లలో 42 శాతం తెచ్చుకుని ఎన్‌డీఏ కూటమికి దీటుగా నిలిచినా ఆమేరకు సీట్ల సంఖ్య పెరగలేదు. పెద్ద దిక్కులేని తమిళనాట సర్వేలు చెప్పినట్టు డీఎంకేకు అధికారం వచ్చినా అన్నాడీఎంకే కూటమి సైతం ఊహించని రీతిలో మెరుగైన పనితీరు చూపింది. అక్కడ సినీ గ్లామర్ కనుమరుగుకావడం గమనార్హం. కమల్‌హాసన్, కుష్బూ, శరత్‌కుమార్‌లు ఓటమిపాలయ్యారు. డీఎంకే రాజకీయాల్లో తండ్రిచాటు బిడ్డగా ‘వెయిటింగ్’లో వున్న స్టాలిన్ అయిదు దశాబ్దాల అనంతరం సీఎం కాబోతున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గతంలోకన్నా పోలింగ్ శాతం తగ్గినా వైఎస్సార్ కాంగ్రెస్ అధిక ఓట్లు గెల్చుకుని ప్రత్యర్థి పక్షాలను ఖంగుతినిపించింది.
దేశం నలుమూలలా కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న దశలో ఈ ఎన్నికలు జరిగాయి. వీటికి రిఫరీగా వుండాల్సిన ఎన్నికల కమిషన్(ఈసీ) మొదలుకొని దాదాపు నేతలంతా ఆ సంగతిని గుర్తించనట్టే ప్రవర్తించారు. భారీ ర్యాలీలతో, బహిరంగసభలతో హోరెత్తించారు. వాటిని చానెళ్లలో చూస్తున్న వేరే రాష్ట్రాలవారు కూడా కరోనా గురించి నిపుణులు వ్యక్తం చేస్తున్నవి అనవసర భయాందోళనలేనని భావించడానికి వీరి బాధ్యతారహిత ప్రవర్తన దోహదపడింది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి కరోనా తీవ్రత దేశంలో అంతగా లేకపోయివుండొచ్చు. అయితే చూడదల్చుకున్నవారికి ప్రపంచం నలుమూలలా ఏమవుతున్నదో కనబడుతూనే వుంది. ఆ పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తవచ్చునేమోనన్న అనుమానం ఈసీ పెద్దలకు కలిగివుంటే నెలన్నర ఎన్నికల షెడ్యూల్ రూపొందించేవారు కాదు. షెడ్యూల్ ఇంకా సగం పూర్తికాకుండానే మన దేశంపై కరోనా పంజా విసిరింది. అప్పుడైనా మిగిలిన దశలను సవరిస్తే బాగుండేది. దాని సంగతలావుంచి కరోనా నేపథ్యంలో భిన్నమైన ప్రచార వేదికలను ప్రతిపాదించివుంటే ఈసీ ప్రతిష్ట పెరిగేది. ఏదేమైనా జనం సమస్యలనూ, వారి సంక్షేమాన్ని గాలికొదిలి మతాన్ని, ఇతర భావోద్వేగాలనూ రెచ్చగొడితే ఓట్లు రాలవని ఈ ఎన్నికల్లో ఓటర్లు నిరూపించారు.
Comments
Please login to add a commentAdd a comment