తర్కంతో కొట్టలేనప్పుడు తాయెత్తుల మహిమను చూపాలి. పేదలు, బాధితులు, దగాపడిన తమ్ముళ్ల కంటిపాపల్లో కాంతి కిరణం మెరిసినప్పుడల్లా పెత్తందారీ హేతువులోంచి ఓ బేతాళుడు నిద్రలేస్తాడు. ఓం హ్రీం అంటూ ఆవులిస్తాడు. నయా పెత్తందారీవర్గపు ఉంపుడు సిద్ధాంతకర్త నారా చంద్రబాబు నాయుడులోంచి తాజా తేనెపూత విజన్‌తోపాటు ఓ బేతాళుడు కూడా బయటికొచ్చాడు.
మహిళా లోకంపై మంత్ర ప్రయోగం మొదలుపెట్టాడు. ఆడబిడ్డలందరికీ ఆయన మంత్రించిన రాఖీలు ఇస్తాడట! వాటిని 45 రోజులు పూజగదిలో పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబును తలుచుకోవాలట! అనంతరంచేతికి కట్టుకోవాలి. అప్పుడు వారికి అష్టసిరులు ఒనగూరు తాయట! మంత్రదండం సాయంతో నారా చంద్రస్వామి ఈ రకంగా మహిళా సాధికారత సాధిస్తారన్న మాట.. నిత్యానంద స్వామి కైలాసాన్ని సృష్టించినట్టు!
ఆగస్టు పదిహేనో తేదీనాడు చంద్రబాబు ‘విజన్– 2047’ పేరుతో విశాఖపట్టణంలో ఒక కాగితాల కట్టను విడుదల చేశారు. దాన్ని తన ఆలోచనగా చెప్పుకున్నారు. మామూలుగా పంద్రాగస్టు కార్యక్రమాలను కవర్ చేసేటప్పుడు తొలి ప్రాధా న్యాన్ని ప్రధానమంత్రికిస్తూ అదే స్థాయిలో రెండో ప్రాధాన్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికివ్వడం ప్రాంతీయ మీడియాలో ఒక సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ యెల్లో మీడియా మాత్రం ముఖ్య మంత్రిని పక్కకునెట్టి చంద్రబాబు విజన్ డాక్యుమెంట్‌కు అగ్ర స్థానాన్ని ఇచ్చింది.
ఇంతకూ ఇందులో ఏమంది? 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు నిండు తాయి. అప్పటికి దేశం ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం ‘విజన్ – 2047’ను రూపొందించింది. ఆ ఏడాది కిందటి ఆలోచనలోంచి ఓ పిడికెడు మాదాకబళాన్ని తీసుకొచ్చి కొంచెం వెచ్చచేసి బాబు వడ్డించారు. పోనీ దాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తూ అనుసృజన చేసినా బాగుండేది. కానీ, ‘దేశ్ కీ నేతా’ హోదాకు ఇంచు కూడా తగ్గేందుకు బాబు సిద్ధ పడలేదు. బహుశా ‘రాజ్య్ (రాష్ట్ర) కీ నేతా’ హోదా మరోసారి దక్కే అవకాశం లేదని గట్టిగా నమ్మారేమో!
ఇంకో పాతికేళ్లలో దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చడం తన లక్ష్యమని చెప్పుకున్నారు. ఏ హోదాతోనో చెప్పలేదు. ‘ఆప్ కౌన్ హై’ అని అడిగే అవసరం ఎవరికీ లేదు. తనకు యాభై అయిదేళ్లు నిండకముందే నాలుగు శతాబ్దాల పైచిలుకు వయసుతో హైదరాబాద్‌ను సృష్టించిన వ్యక్తికి ఏదైనా సాధ్యమేనని సరిపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ పవర్, రోబోటిక్స్ వగైరా తాజా పదజాలాన్ని ఆయన విజన్‌లో విరివిగా ఉపయోగించారు. అబ్బో మా బాబుగారికి చాలా విషయాలు తెలుసునని అనుయాయులు మురిసిపోవడానికి తప్ప సామా జిక చింతన ఏ కోశానా అందులో లేదు. ఇంటర్‌లో బైపీసీ చదివితే ఉత్తమ ఇంజనీర్లుగా ఎదగవచ్చనే ఒక గొప్ప ఉప దేశాన్ని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అనుగ్రహించారు.
ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న విజన్‌కు తాను కూడా ఇలా కోరస్ పాడితే ఆయన మెప్పు పొందవచ్చన్న తహతహ ఒక కారణం కావచ్చు. తనను గొప్ప విజనరీగా భజన చేస్తున్న యెల్లో మీడియాలో ఆత్మవిశ్వాసం నింపడం మరో కారణం కావచ్చు. ఈ రెండు అవసరాల కోసం చంద్రబాబు పంద్రాగస్టు సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. అంతే తప్ప దాని మీద ఆయనకు పెద్దగా విశ్వాసం లేదు. ఎందుకంటే తన మొదటి విజన్ (2020) ఆర్థికంగా తనకు లబ్ధి చేకూర్చినా, రాజకీయంగా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇక తెలుగు సమాజానికైతే ఆ విజన్ సృష్టించిన విధ్వంసం మరిచిపోలేని ఒక మహా విషాదం.
చంద్రబాబు తన ‘విజన్–2020’ సారాంశంతో ఒక సిద్ధాంత గ్రంథాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రచురించారు. తెలుగులో దాని పేరు ‘మనసులో మాట’. దాని పేరును బట్టే ఆ పుస్తకంలోని అభిప్రాయాలు చంద్రబాబుకు స్వాభావికమైన విగా, ఆయన నమ్మకాలుగా భావించాలి. ఉచిత పథకాలను ఈ పుస్తకంలో ఈసడించుకున్నారు. ఉచిత విద్యుత్‌ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు బుద్ధిగా మసలుకోవాలని (అప్పు డాయన అధికారంలో ఉన్నారు), ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరే కించకూడదని సుద్దులు చెప్పారు.
ఉద్యోగాలు పర్మనెంటయితే వారికి బాధ్యత ఉండదని, అందువల్ల కాంట్రాక్టు పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ పద్ధతికి శ్రీకారం కూడా చుట్టారు. విద్య, వైద్యం ఏదీ ఉచితంగా అందుబాటులో ఉంచకూడదని గట్టిగా వాదించారు. ఆస్పత్రుల్లో సర్వీసు ఛార్జీల వసూలు ప్రారంభించారు. పేదవాడికి జ్వరం వచ్చినా డబ్బులు చెల్లించనిదే మందుబిళ్ల కూడా దొరకని దుర్మార్గ పరిస్థితి ఏర్పడింది. సర్కారు బడులను పాడుబెట్టి చదువు‘కొనలేని’ ఒక తరాన్ని మొత్తం విద్యకు దూరం చేశారు.
మధ్యతరగతి ప్రజలు సైతం చదువుల ఖర్చులు భరించలేక అప్పుల ఊబిలోకి దిగబడిపోయారు. వ్యవసాయం దండగ అనే సిద్ధాంతాన్ని వంటబట్టించుకొని రైతాంగంలో అదే అభిప్రాయం వ్యాప్తి చెందేలా చేశారు. రైతు కూలీలు భూబంధం నుంచి బయటపడితేనే సంపన్నుల పనులకు చౌకగా శ్రమశక్తి లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడ్డారు. ఆయన కోరుకున్న ట్టుగానే లక్షలాది రైతు కూలీలు పొలం బంధాన్ని తెంచు కున్నారు. పొట్టకూటి కోసం వలస బాటలు పట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కూలీ తల్లులు చంటిబిడ్డల నోటికి పాలపీకలు పెట్టిన కల్లు సీసాలను అందించారు.
కల్లు మత్తులో ఆ బిడ్డ నిద్రపోయి తల్లి కోసం ఏడ్వదని వారు అలా తల పోసేవారు. మాటలకందని ఆ మహాదైన్యం అప్పుడు ఎక్కడ చూసినా కనిపించేది. వలసబాట పట్టకుండా మొండికేసి వ్యవసాయం చేసిన వారు బాబు విధానాల ఫలితంగా అప్పుల పాలై ఆత్మహత్యలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. బిడ్డలు వలసపోగా మిగిలిన అవ్వాతాతలు అంబలి కేంద్రాల దగ్గర బారులు తీరి నిలబడిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తే!
ఈ దుఃస్థితికే ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అనే పాటలో అద్దంపట్టిన సంగతి తెలిసిందే. ఈ కన్నీటికి కారణం చంద్రబాబు విజన్. ఆ కన్నీటిపై ఐటీ పన్నీరు చల్లి ‘ఇదీ చంద్రబాబు విజన్’ అని ఆయన అనుకూలవర్గం ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. తాను ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడం వల్లనే ఐటీ నిపుణులు పెరిగారని ఆయన ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ అంతకంటే ఐదేళ్లు ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రకటిస్తే వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు.
హైటెక్ సిటీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రణాళిక సిద్ధమైందని చంద్రబాబే స్వయంగా ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. రెడీగా ఉన్న ప్రణాళికను అమలు చేయడంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కోసం ఆయన ఆలస్యం చేశారు. ఇదీ జరిగిన వాస్తవం. ఈ వాస్తవాలను యెల్లో మీడియా మసిపూసి మారేడుకాయలు చేసింది. ఒక సామాజిక విధ్వంస కుడికి విజనరీ ముసుగువేసి చరిత్రలో నిలబెట్టింది. ఇది చరిత్రలో జరిగిన ఒక ద్రోహం.
బాబు విజన్‌తో కన్నీరు పెట్టిన పల్లెసీమలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మళ్లీ చిగురించడం మొదలైంది. రైతు మళ్లీ నాగలి పట్టాడు. వైద్యం పేదలకు చేరువైంది. జన సంక్షేమ విజన్‌కు ప్రాధాన్యం లభించింది. పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ – పవన్ పొత్తులతో వెంట్రుకవాసి విజయాన్ని సాధించగలిగాడు.
ఈ గెలుపు కోసం తన మనసులోని మాటను దాచిపెట్టాడు. సంక్షేమ ఎజెండాను ఎత్తుకోవడమే కాదు అలవిగాని హామీలతో తన ఎన్నికల మేని ఫెస్టోను నింపేశారు. గెలిచిన తర్వాత రాజధాని పేరుతో భూదోపిడీకి, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడేందుకు పరిమిత మయ్యారు. అదిగో అల్లదిగో అంటూ రాజధాని గ్రాఫిక్స్‌ను ప్రచారంలో పెడితే, ‘ఇది కదా విజన్’ అంటూ యెల్లో మీడియా పరవశించిపోయింది. కానీ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎటువంటి తడ బాటూ, శషభిషలూ లేని స్పష్టమైన పేదల అనుకూల ఎజెండాను తలకెత్తుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీల పురోగతి కోసం, అన్ని వర్గాల్లోని మహిళల సాధికారత కోసం, పరిపాలనలో పారదర్శకత కోసం, అధికార వికేంద్రీ కరణ కోసం ఒక ఉద్యమాన్నే ఈ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం అడ్డువస్తున్న పెత్తందారీ వ్యవస్థపై జగన్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. వ్యవస్థలోని అన్ని పార్శా్వల్లో ఈ పెత్తందారీ వ్యవస్థ ఊడలు దించి బలోపేతమై ఉన్నది.
ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆ వ్యవస్థపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటించడానికి సాహసించలేదు. పెత్తందారీ వ్యవస్థతో తలపడటం, ఓడించడం ద్వారానే పేదల విముక్తి సాధ్యమని నమ్మిన జగన్ ప్రభుత్వం అందుకు బరిగీసి నిలబడి ఉన్నది.
పెత్తందారీ వ్యవస్థ తన సహస్ర బాహువులతో జగన్ ప్రభుత్వంపై విషం చల్లుతున్నది. దశకంఠాలతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. తమ ఎన్నికల మేనిఫెస్టోను గడప గడపకూ పంపిణీ చేస్తూ తాము ఎన్ని హామీలను నెరవేర్చామో పరిశీలించి పరిపాలనకు మార్కులు వేయాలని ప్రజలను కోరుతున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్.
ఎన్నికల మేనిఫెస్టోను కనబడకుండా మాయం చేసి, వెబ్‌సైట్‌లోంచి కూడా తొలగించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? మేనిఫెస్టోకు పటంకట్టి ఊరేగిస్తూ ‘మేం చేయని పనేమిటో చెప్పండ’ని పిలుపునిస్తున్న జగన్ ప్రభుత్వం ఎక్కడ? ప్రజాక్షేత్రంలో ద్వంద్వ యుద్ధానికి తలపడటం సాధ్య మయ్యే పనేనా? కాదు కనుకనే మాయోపాయాలు, దుష్ప్రచారాలు, కుతంత్రాలు వేయి పడగలెత్తి బుసకొడుతున్నాయి.
బాబుకు వేసిన విజనరీ ముసుగు జారిపోకుండా మొన్న ప్రకటించిన ఎంగిలి విజన్ ఒక పడగ. తాయెత్తు మహిమలు ప్రచారం చేయడం, మూఢనమ్మకాలను వ్యాపింపజేయడం ఇంకో పడగ. భారత రాజ్యాంగం 51వ అధికరణం ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడం పౌరుల ప్రా«థమిక విధి. అందుకు విరుద్ధంగా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడే మూఢ నమ్మకాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ ద్రోహమవుతుంది. పైగా వాటికి ఆయన రాఖీలని పేరు పెట్టారు.
మంత్రించి ఇచ్చేవి తాయెత్తులవుతాయి గానీ రాఖీలెట్లా అవు తాయి? అయినా తమ సాధికారతకు కట్టుబడిన వాళ్లకు, తమకు రక్షణగా నిలబడిన వాళ్లకు మహిళలే స్వయంగా రక్షాబంధనాలు కడతారు తప్ప మంత్రగాళ్లకు కాదు గదా!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
చంద్రస్వామి తాయెత్తు విజన్!
Published Sun, Aug 20 2023 12:27 AM | Last Updated on Sun, Aug 20 2023 11:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment