సారూప్యం, సాన్నిహిత్యం రెండూ ఉన్న దేశాల మధ్య స్నేహగీతాలాపన సహజమే. చిరకాలం తర్వాత ఇరు ప్రభుత్వాల పెద్దలు మరోసారి పల్లవి అందుకున్నారంటే సంబంధాల పునరుద్ధరణతో పాటు బంధం మళ్ళీ బలపడుతోందని అర్థం. గత వారాంతంలో ఈజిప్టులో భారత ప్రధాని మోదీ జరిపిన పర్యటన అందుకు సాక్ష్యం. ఉభయ దేశాలూ తమ ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవడం విశేషమే. ఆ మేరకు ‘చరిత్రాత్మక’ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈజిప్టులో ప్రాథమిక వసతుల కల్పనలో, ముఖ్యంగా సూయజ్ కాలువ అథారిటీలో భారత పెట్టుబడులు సహా ఆర్థిక సహకారం పెంపుపై ఇరుపక్షాలూ చర్చించాయి. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఒప్పందాలపై చేవ్రాలు చేశాయి. వెరసి, ఆఫ్రికా, పశ్చిమాసియాలలో భాగమైన జన సంఖ్యాక అరబ్బు దేశం ఈ ప్రాంతంలో భారత్‌కు కీలక భాగస్వామి కానుంది. ప్రతిగా దాని అవసరాలు తీర్చేందుకు భారత్ ముందుకు రావడంతో ఈ పర్యటన ఫలాలు ఉభయ తారకమే!
భారత ప్రధాని తాజా ఈజిప్ట్ పర్యటన అదాటునో, ఆలోచనా రహితంగానో జరిగింది కాదు. దాదాపు ఏడాది పైచిలుకుగా ఎన్నో లెక్కలతో చేపట్టిన వరుస చర్యల్లో ఇది ఒక భాగమనాలి. ద్వైపాక్షిక బంధాలున్నా అవి ఆశించినంతగా సత్తా చాటని వేళ గడచిన ఏడాది కాలంలో మన రక్షణ, విదేశాంగ మంత్రులు కైరో చుట్టివచ్చారు. ఈ ఏటి గణతంత్ర దినోత్సవ కవాతుకు ఈజిప్ట్ అధ్యక్షుడు భారత ప్రభుత్వ ముఖ్యఅతిథిగా ఢిల్లీకి విచ్చేశారు. దానికి కొనసాగింపు ఇప్పుడు మన ప్రధాని పర్యటన.
గమనిస్తే– ఈజిప్టులో భారత ప్రధాని ఆఖరుసారిగా పర్యటించింది 1997లో. ఆ తర్వాత ఈ పాతికేళ్ళలో ప్రపంచం చాలా మారింది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు కీలకంగా మారిన రోజులకు వచ్చాం. ఈ సమయంలో ఢిల్లీ, కైరోల భాగస్వామ్యం ఉభయులకూ లాభదాయకం. ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, భారీస్థాయిలో అప్పుల్లో ఉన్న ఈజిప్టుకు ఎంతో అవసరమైన భాగస్వామి. మరోపక్క వాణిజ్యానికీ, భౌగోళికంగానూ కీలకమైన సూయజ్ కాలువను శాసించే ఈజిప్టుతో బంధం భారత్‌కూ లాభదాయకం.
క్రీస్తుపూర్వం నుంచే అతి ప్రాచీన నాగరకతల మధ్య ముడిపడిన బంధమిది. అప్పట్లోనే భారత ద్వీపకల్పానికి ఈజిప్టు ఓడలు వస్తే, ఈజిప్టు మమ్మీలను చుట్టడానికి వాడిన వస్త్రం, ఆ వస్త్రానికి అద్దిన నీలిమందు భారతదేశానివి అన్నది చరిత్ర. గడచిన శతాబ్దకాలంలోనూ మన మైత్రి బలమైనది. వలస పాలన అనంతరం స్వాతంత్య్రం వచ్చిన మూడు రోజులకే ఈజిప్టుతో దౌత్య సంబంధాలు పెట్టుకున్న చరిత మనది. ఇక్కడ ప్రధాని నెహ్రూ, అక్కడ అధ్యక్షుడు నాజర్‌లతో మన స్నేహలత మరింత అల్లుకుంది.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అటు అమెరికా, ఇటు రష్యా కూటములు దేనిలోనూ చేరకుండా మనగలగవచ్చంటూ 1961లో అలీనోద్యమాన్ని నిర్మించి, మూడోప్రపంచ దేశాల్లో ఉత్సాహం ప్రోది చేసిన భారత, ఈజిప్టుల సామీప్యమూ గమనార్హం. ఈ చిరకాల స్నేహం ఇప్పుడు ద్వైపాక్షిక బంధం నుంచి బలమైన భాగస్వామ్యంగా కాంతులీనడం సంతోషదాయకం.
ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడి మధ్య ఆంతరంగిక ముఖాముఖి సంభాషణ, మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ బహూకరణ, అంతర్జాతీయంగానూ మీద పడుతున్న మైనారిటీల ప్రతికూల ముద్రను చెరుపుకొనేలా 11వ శతాబ్దం నాటి చారిత్రక అల్ హకీం మసీదుకు మోదీ వెళ్ళడం, ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన గాజా పిరమిడ్ల సందర్శన, ఈజిప్టు – పాలస్తీనాల్లో ఉంటూ మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి కన్నుమూసిన భారతీయ సైనికుల స్మారకం వద్ద నివాళులు అర్పించడం... అలా ఈ పర్యటనలో ఆకర్షణీయ అంశాలు అనేకం. కొన్ని కైరోతో స్నేహం పంచేవి.
గుజరాతీ దావూదీ బోహ్రాలు పునరుద్ధరించిన మసీదు సందర్శన లాంటి మరికొన్ని సొంతగడ్డపై మోదీకి ఓట్లు పెంచేవి. మొత్తానికి అధినేతలిరువురూ ప్రతిదీ ఉపయోగించుకున్నారు.
నిజానికి, ఈ ఏటి జీ–20 సదస్సుకు మనం 9 దేశాలను అతిథులుగా ఆహ్వానించగా, అందులో ఈజిప్ట్ ఒకటి. కానీ, మేలో శ్రీనగర్‌లో జరిగిన పర్యాటక అధికారుల సమావేశానికి కైరో దూరంగా ఉంది. ఫలితంగా పొరపొచ్చాలుంటే, అవన్నీ తాజా బంధాల పునరుద్ధరణతో సమసిపోతాయి. రక్షణ, ఆర్థిక సహకారం, విద్యా – వైజ్ఞానిక ఆదాన ప్రదానాలు, సాంస్కృతిక సంబంధాలనే నాలుగు స్తంభాలపై నిర్మించాల్సిన భాగస్వామ్యమిది.
ఈజిప్టులోని భారతీయుల సంఖ్య 5 వేల లోపే కావచ్చు. అయితేనేం, మన హిందీ సినిమాలంటే కళ్ళింత చేసుకొని చూసే ఈజిప్ట్ వాసులు, వారి ఈజిప్షియన్ సంగీతాన్ని స్వరాల్లో జొప్పించే భారతీయ సంగీత దర్శకుల బంధం అవిస్మరణీయం.
ఈజిప్టుకు ఆరో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. కరోనా, ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ తలకిందులై, వసతుల పెంపులో కైరో నిదానించింది. ఇప్పుడిది మనకు సదవకాశం. సూయజ్ కాలువ ఆర్థిక మండలిని ఆసరాగా చేసుకుంటే ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపా విపణు లకు చేరాలన్న భారత ప్రయత్నాలూ నెరవేరతాయి.
చమురు, సహజవాయువు, రసాయన ఎరువుల్ని కైరో నుంచి దిగుమతి చేసుకుంటున్న మనం, గత జూన్‌లో తీవ్రకొరతలో పడ్డ ఆ దేశానికి గోధుమలు పంపినట్టే ఇకపైనా అవసరంలో అండగా నిలవాలి. భౌగోళిక రాజకీయాల్లో ‘దక్షిణ ప్రపంచ’ దేశాలవాణిగా మారాలన్న మన ఆకాంక్ష నెరవేరాలంటే, ప్రస్తుతం చైనా ఆర్థిక ప్రభావంలో ఉన్న ఈజిప్టును కలుపుకొని నడవడమే తెలివైన పని. తాజా పర్యటన అందుకు ఉత్ప్రేరకం.
కలసి సాగుదాం... ప్రగతి బాట!
Published Wed, Jun 28 2023 12:20 AM | Last Updated on Wed, Jun 28 2023 9:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment