సమయం దగ్గర పడుతున్నకొద్దీ సమరం తీవ్రమవుతోంది. మే 10న జరగనున్న పోలింగ్‌కు మరో వారం రోజులే ఉన్న వేళ ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య కర్ణాటకలో మాటల తూటాలు పేలుతున్నాయి. మేనిఫెస్టోలతో మహా యుద్ధమే జరుగుతోంది. బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కార్’ జపం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ గద్దెనెక్కితే అది ‘డబుల్ డిజాస్టర్’ అని ఎద్దేవా చేస్తోంది. మళ్ళీ కింగ్‌మేకర్ తానేనని జేడీ–ఎస్ భావిస్తోంది. గత 30 ఏళ్ళలో ఇంత పోటాపోటీగా కర్ణాటక ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. బీజేపీ, కాంగ్రెస్‌లు పైచేయి సాధించడమే లక్ష్యంగా ప్రకటించిన మేనిఫెస్టోలే అందుకు సాక్ష్యం.
ప్రతిపక్షాల కుల సమీకరణాలను అభివృద్ధి, సంక్షేమ అజెండాలతో ఢీ కొట్టి, దక్షిణాదిలో తాము అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ శ్రమిస్తోంది. అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం నిరసన ఎదుర్కొన్న ఆ పార్టీ తన ప్రాథమిక బలాలే ఆసరాగా పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. అందుకే, ఇటు సంక్షేమం, అటు హిందూత్వ డిమాండ్ల మేళవింపుగా మేనిఫెస్టోను అందించింది.
ప్రజలకు ఉచితంగా ఇచ్చే సంక్షేమ పథకాలను ‘తాయిలాలు’ అంటూ రాష్ట్రాలను నిత్యం విమ ర్శించే జాతీయ పార్టీ కర్ణాటకలో మాత్రం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి (బీపీఎల్) అంటూనే సంక్షేమ హామీలు గుప్పించింది. 3 హిందూ పండుగలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అందుబాటు ధరల్లో ఆహార క్యాంటీన్లు, రోజూ అరలీటరు పాలు, వృద్ధులకు ఉచిత ఆరోగ్య చెకప్‌లు వాగ్దానం చేసింది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) లాంటి తన సైద్ధాంతిక అంశాలనూ జోడించింది.
కాంగ్రెస్ నిరుద్యోగం, మహిళా సాధికారతపై దృష్టి పెడుతూనే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇంటి గృహలక్ష్మికి నెలనెలా రూ. 2 వేలు, బీపీఎల్ కుటుంబాలకు నెలకు 10 కిలోల ధాన్యాలు, నిరు ద్యోగులకు నెలవారీ డబ్బులు, స్త్రీలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటివి వాగ్దానం చేసింది. రెండు పార్టీలూ మేనిఫెస్టోల సమరంలోకి దిగాయి. కూడు, గూడు, గుడ్డ లాంటి ప్రాథమిక సంక్షేమం అందించకుండా కేవలం రోడ్ల విస్తరణ లాంటి అభివృద్ధిపైనే దృష్టి పెట్టడం వల్ల ప్రజల స్థితిగతుల్లో పెనుమార్పులు ఉండవు.
కాబట్టి సంక్షేమ వాగ్దానాలు తప్పేమీ కాదు. కాకుంటే, పోలింగ్‌కు 9 రోజుల ముందు ప్రకటించిన ఇవి కంటితుడుపు కాకూడదు. ఎన్నికల వాగ్దానపత్రాలను అమలుచేసే చిత్తశుద్ధి ఎన్ని పార్టీలకు ఉన్నాయన్నది ప్రశ్న. నిజానికి, మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక పార్టీలు అమలు చేశాయా అన్నదానిపై ఎన్నికల సంఘపు ఆడిటింగ్ అభిలషణీయం.
కర్ణాటక, కేరళల్లో బలంగా వేళ్ళూనుకున్న తీవ్రవాద సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్‌ఐ)పై ‘ఉపా’ చట్టం కింద గత సెప్టెంబర్‌లో కేంద్రం విధించిన నిషేధాన్ని కొనసాగిస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. అందుకు ప్రతిగా కాంగ్రెస్ విద్వేషాన్ని ప్రోత్సహించే పీఎఫ్‌ఐ సహా బజరంగ్ దళ్ లాంటి అన్నిటినీ నిషేధిస్తామని ప్రకటించింది.
ఈ వివాదాస్పద ప్రకటన కథలో కొత్త మలుపు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు సాక్ష్యమంటూ కమలనాథులంతా ధ్వజమెత్తే అవకాశం దొరికింది. ఇది సాక్షాత్తూ బజరంగ్‌ను (హనుమంతుణ్ణి) అవమానించడమే అనే కథనంతో హిందూత్వ అంశాన్ని బీజేపీ పైకి తెచ్చింది. కరడుగట్టిన కాషాయ దళమే అయినా, కర్ణాటకలో కొన్నిసార్లు మైనారిటీలపై దాడులకు దిగినా – బజరంగ్ దళ్‌ను, దేశ వ్యతిరేక పీఎఫ్‌ఐతో ఒకే గాటన కట్టవచ్చా? కానీ, తప్పొప్పులు మరిచిన మాటల పోటీలో ఎవరిని మాత్రం తప్పు పట్టగలం!
చిత్రమేమిటంటే కర్ణాటకలో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న మోదీ మాత్రం మేనిఫెస్టోలో తమ పార్టీ సైతం సంక్షేమ పథకాలు ప్రకటించిన సంగతి విస్మరించి, కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఉక్రోషం వెళ్ళగక్కడం! కాంగ్రెస్‌వన్నీ అవాస్తవిక హామీలనీ, వాటిని నెరవేరిస్తే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందనీ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. కాంగ్రెస్ తన హామీలను నెరవేరిస్తే, ఇప్పటి దాకా బీజేపీ సర్కార్ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్ట్‌లు ఆగిపోతాయంటూ వింతవాదన తెరపైకి తెచ్చారు.
ఇది సామాన్యులు హర్షిస్తారా అన్నది ప్రశ్న. ఇప్పటికే కొంత ప్రజాభిప్రాయం, ప్రధాన సర్వేలు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ, కర్ణాటకలో ముందుండి ప్రచారాన్ని నడిపిస్తున్న అమిత్ షా మాత్రం తమకు మెజారిటీ దాటి 15 సీట్లయినా వస్తాయంటున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం గత రెండు దశాబ్దాల్లో కర్ణాటకలో జరగని కథ.
మొత్తానికి, ప్రధానపార్టీలు రెండూ తమ లక్ష్యం ఎవరనే స్పష్టతతో మేనిఫెస్టోలు తెచ్చాయి. వాటితోపాటు తమ వాదనలు తాము చేస్తున్నాయి. అయితే, ముస్లిమ్ రిజర్వేషన్ల రద్దు సహా విభజన రాజకీయాలతో కొత్త ఓటర్లను బీజేపీ ఆకట్టుకోవడం సాధ్యమేనా? అలాగే, బీజేపీది 40 శాతం కమిషన్ల అవినీతి సర్కార్ అనే వాదన ఒక్కటే పట్టుకుంటే కాంగ్రెస్ గద్దెనెక్కగలదా? 224 అసెంబ్లీ స్థానాల కర్ణాటక 2004 నుంచి ఇప్పటికి 11 మంది సీఎంలను చూసింది.
కొన్నేళ్ళుగా మతోద్రిక్తతలు పెంచడం ద్వారా ఓటు బ్యాంక్ స్థిరీకరణ యత్నాలూ సాగాయి. 2018 తర్వాత ఆ అంశంపై ఓట్లు సంతృప్తస్థాయికి చేరాయనీ, కొత్తగా వచ్చేవేమీ లేవనీ బీజేపీకి అర్థమైంది. మరి ఆఖరులో అంది వచ్చిన బజరంగ్‌దళ్ వివాదం కలిసొస్తుందా? ఓట్లశాతంలో కొద్ది తేడాతో తలరాత మారే వేళ నిశ్శబ్ద ఓటర్ల మన్‌కీ బాత్ కీలకం. కాకపోతే, తరచూ ఎమ్మెల్యేల బేరసారాలు చూస్తున్న కన్నడసీమ ఈసారి హంగ్ తీర్పునివ్వదనీ, ఏదో ఒక పార్టీకే మెజారిటీ ఇస్తుందన్న సర్వే నిపుణుల హామీయే సాంత్వన.
మేనిఫెస్టోల మహా యుద్ధం
Published Wed, May 3 2023 2:43 AM | Last Updated on Thu, May 4 2023 3:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment