ఒక పెద్ద ఘోరం చోటుచేసుకున్నప్పుడు... అకారణంగా కాల్పులు జరిపి అమాయక పౌరుల ఉసురు తీసినప్పుడు దోషులను కఠినంగా దండించాలని డిమాండ్ చేయటం, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగటం గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. కానీ ఈశాన్య రాష్ట్ర ప్రజానీకం ప్రారబ్ధమేమిటో గానీ ఆ కనీస ప్రజాస్వామిక డిమాండ్ నెరవేరటం కూడా వారికి కనాకష్టంగా మారింది. దశాబ్దా లుగా అమలవుతున్న ఈ ఆటవిక న్యాయంపై విసుగెత్తి అక్కడి ప్రజలు కమలనాథులను నెత్తినెత్తు కుని ఏడెనిమిదేళ్లు దాటుతోంది. కొన్నిచోట్ల సొంతంగా, మరికొన్నిచోట్ల మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకోవటం మొదలైంది. తాము అధికారంలోకొస్తే అవసరం లేని ప్రాంతాల్లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల(ఏఎఫ్‌ఎస్‌పీఏ) చట్టాన్ని క్రమేపీ తొలగిస్తామని బీజేపీ మేనిఫెస్టో 2014లో హామీ ఇచ్చింది.
అక్కడక్కడైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న వైనం కనబడింది. అస్సాం, నాగా లాండ్, మణిపూర్ వగైరాల్లో తిరుగుబాటుదార్ల బెడదలేని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని వెనక్కి తీసు కున్నారు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతమాత్రాన ఆ చట్టం ఇంకా అమలవుతున్న ప్రాంతాల్లో ఎప్పటి మాదిరే ఏం చేసినా చెల్లుబాటవుతుందని పాలకులు చెప్పదల్చుకుంటే మాత్రం ప్రజలు సహించలేరు. తెల్లారిలేస్తే అదే పనిగా హోరెత్తే చానెళ్లు, అనేకానేక సామాజిక మాధ్యమాలు ప్రజల జ్ఞాపకశక్తికి పెద్ద పరీక్షే పెడుతున్నాయి. నిన్న మొన్న జరిగిన ఘటనలు సైతం జనం మస్తిష్కాల నుంచి సత్వరమే చిత్తగిస్తున్నాయి. కానీ నిష్కారణంగా అమాయక కూలీల నిండు ప్రాణాలు బలి గొన్న నెత్తుటి ఉదంతం కూడా జనం జ్ఞాపకాల్లో మసకబారివుంటుందని భావిస్తే ఎలా?
నాగాలాండ్‌లోని మాన్ జిల్లా ఒటింగ్‌లో 2021 డిసెంబర్ 4న చీకట్లు ముసురుకుంటున్నవేళ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అస్సాం సరిహద్దుల్లోని తిరు లోయ బొగ్గు గనిలో రోజంతా కాయకష్టం చేసి గూటికి చేరటానికి ట్రక్కులో వెళ్తున్న రోజు కూలీలపై హఠాత్తుగా గుళ్ల వర్షం కురిసింది. వాహనం ఎవరిదో, అందులో ఎవరున్నారో కూడా గమనించకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపినవారు ఆర్మీ జవాన్లు. బహుశా కాల్పులు జరిగిన ప్రాంతం జనావాసా లకు దూరంగా ఉంటే ఎన్‌కౌంటర్ కథనం మీడియాలో వెలువడేది కావొచ్చు. కానీ అక్కడికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామస్థులు కాల్పుల కలకలం, హాహాకారాలు వినబడి ఆత్రంగా పరుగెత్తు కుంటూ చేరుకున్నారు.
అప్పటికే శవాలను తమ ట్రక్కులోకి తరలిస్తున్న జవాన్లను వారు నిలదీశారు. ఘర్షణ జరిగింది. మళ్లీ కాల్పులు జరిగి మరో ఏడుగురు గ్రామస్థులు బలయ్యారు. ఇదెంత సంచ లనమైందో ఎవరూ మరిచిపోరు. దీనిపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు హామీ ఇచ్చాయి. ఆ ప్రకారమే సైన్యం అంతర్గతంగా ప్రత్యేక విచారణ ప్రారంభించింది. నివేదిక కూడా రూపొందింది. అందులోని అంశాలేమిటో, ఎలాంటి నిర్ధారణ కొచ్చారో బయటపడలేదు. దీనికి సమాంతరంగా నాగాలాండ్ పోలీసులు ఘటన జరిగిన మర్నాడే సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మాన్ జిల్లా సెషన్స్ కోర్టులో నిరుడు మే నెల 30న చార్జిషీటు దాఖలు చేశారు. ఒక మేజర్, ఇద్దరు సుబేదార్లు, ఎనిమిదిమంది హవల్దార్‌లు, నలుగురు నాయక్‌లు, ఆరుగురు లాన్స్ నాయక్‌లు, తొమ్మిదిమంది పారాట్రూపర్‌లు– మొత్తం 30 మందిని నిందితులుగా తేల్చారు. సెషన్స్ కోర్టులో విచారణ మొదలైవుంటే ఏమయ్యేదోగానీ నిరుడు జూలైలో జవాన్ల భార్యలు ఈ విచారణపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయ స్థానం వారి వినతిని మన్నించింది. ఈలోగా జవాన్ల ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలన్న సిట్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి నాగాలాండ్ పోలీసు ఉన్నతా ధికారులకు వర్తమానం అందింది. ప్రజాస్వామిక రిపబ్లిక్ ఉనికిలో ఉంటున్నచోట భద్రతా బలగాలు 13 మంది సాధారణ పౌరుల ప్రాణాలు బలిగొంటే వారి కుటుంబాలకు కనీస న్యాయం అందించ టంలో వ్యవస్థలన్నీ విఫలం కావటం ఊహించలేనిది.
తొందరపాటుతోనో, తప్పుడు అంచనాలతోనో విచక్షణారహితంగా వ్యవహరించేవారు సైన్యంలో అక్కడక్కడ ఉంటున్నారు. ఇలాంటి ఉదంతాలపై స్థానిక ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తినాకే ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం ఎత్తివేత అంశం తెరపైకొచ్చింది. మణిపూర్ యువతి ఇరోం షర్మిల సుదీర్ఘకాలం ఈ అంశంపైనే నిరవధిక నిరాహారదీక్ష చేసింది. ఆ చట్టాన్ని ఎత్తి వేస్తామని గతంలో కాంగ్రెస్ హయాంలోని యూపీఏ సర్కారు హామీ ఇచ్చినా సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కు తగ్గింది. ఆ విషయంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంతో మేలు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రశాంతత నెలకొన్న ప్రాంతాల్లో ఆ చట్టాన్ని వెనక్కు తీసుకోవటం మొదలైంది. కానీ కూలీలను కాల్చిచంపిన ఉదంతం, అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవటంలో చూపిస్తున్న అల సత్వం ఈ ప్రతిçష్ఠను మసకబారుస్తోంది. దేశ రక్షణ యజ్ఞంలో జవాన్ల త్యాగనిరతి వెలకట్ట లేనిది. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ తప్పులు చేస్తున్న గుప్పెడుమంది వ్యవహార శైలిని చూసీచూడనట్టు వదిలేయటం సరికాదు. పొరపాటు చోటుచేసుకుంటే, అందునా ఆ పొరపాటు మూల్యం నిండు ప్రాణాలైతే ఎంతటివారిపైన అయినా కఠిన చర్యలుంటాయన్న అభిప్రాయం కలి గించినప్పుడే సాధారణ పౌరులకు భరోసా ఏర్పడుతుంది. చట్టబద్ధ పాలనపై విశ్వాసం కలుగుతుంది. అటు జవాన్లలో సైతం జవాబుదారీతనం పెరుగుతుంది. కేంద్రం పునరాలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment