ఎరుపెక్కిన సముద్ర వర్తకం | Sakshi Editorial On Red Sea Trade Merchant Navy | Sakshi
Sakshi News home page

ఎరుపెక్కిన సముద్ర వర్తకం

Published Thu, Dec 28 2023 12:03 AM | Last Updated on Thu, Dec 28 2023 12:03 AM

Sakshi Editorial On Red Sea Trade Merchant Navy

సమీపకాలంలో భారత్‌కు అత్యంత ఆందోళనకర పరిణామం ఇది. బలవత్తరమైన శక్తిగా ఎదగడానికి సముద్ర వర్తకం ముఖ్యమైన వేళ... వాణిజ్య నౌకలపై వరుస దాడులు నిరంతర అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. వేర్వేరు వాణిజ్య నౌకలపై అరేబియా సముద్రంలో ఇటీవల జరిగిన దాడులతో, భారత నౌకాదళం మూడు క్షిపణి విధ్వంసక నౌకలను మోహరించాల్సి వచ్చింది. వాటిని వివిధ ప్రాంతాల్లో గస్తీకి నిలిపి, ముష్కరుల దొంగదాడులకు మన నేవీ చెక్‌ పెట్టే పనిలో పడింది. వారం రోజుల్లో... భారతీయ సిబ్బందితో కూడిన రెండు వాణిజ్య నౌకలు మన దేశానికి వస్తూ, దాడికి గురవడం మన సముద్ర వర్తకం భద్రతపై ప్రశ్నలు రేపింది. 

పోర్‌బందర్‌కు 217 నాటికల్‌ మైళ్ళ దూరం నుంచి 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన ఎమ్వీ చెమ్‌ ప్లూటోపై డిసెంబర్‌ 23న డ్రోన్‌ దాడి జరిగింది. అప్రమత్తమైన భారత నౌకాదళం, భారత తటరక్షక దళం సదరు వర్తక నౌకకు రక్షణగా నిలిచాయి. తర్వాత కొద్ది గంటలకే... పాతిక మంది భారతీయ సిబ్బందితో కూడిన వాణిజ్య క్రూడాయిల్‌ ట్యాంకర్‌ ఎమ్వీ సాయిబాబాపై ఎర్రసముద్రం దక్షిణ ప్రాంతంలో డ్రోన్‌ దాడి జరిగింది. దీంతో,నౌకాదళం గస్తీ పెంచింది.

దాడులు జరిపిన ముష్కరులు సముద్ర గర్భంలో దాగివున్నా సరే, వెతికి పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. లెక్కలు తీస్తే... నవంబర్‌ 19 నుంచి ఇప్పటికి ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై 30 డ్రోన్‌ దాడులు, సముద్రపు దొంగల దాడులు జరిగాయి. అంటే, దాదాపు రోజుకో దాడి. ఈ 30 దాడుల్లో సగం ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే సముద్ర వర్తక మార్గంలో ఎర్ర సముద్రంలో జరిగినవే. ఇది ఆందోళనకరం. 

తాజాగా ఎమ్వీ చెమ్‌ ప్లూటోపై జరిగిన దాడి తాలూకు శిథిలాలను సేకరించి, దాడి తీరుతెన్ను లను కనిపెట్టే ప్రయత్నం సాగుతోంది. దాడి మరో నౌకపై నుంచి చేశారా, లేక తీర ప్రాంతం నుంచి జరిగిందా లాంటి అంశాలను నిర్ధారణ చేసే పనిలో ఇండియన్‌ నేవీ నిమగ్నమైంది. ఒకపక్క గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధంతో ఉద్రిక్తతలు పెరగగా, అదే సమయంలో వాణిజ్య నౌకలపై ఇలా డ్రోన్‌ దాడులు జరగడం యాదృచ్ఛికమేమీ కాదు.

అక్కడి యుద్ధం తాలూకు ప్రభావం ఇక్కడకు విస్తరించింది. యెమెన్‌లో అధిక ప్రాంతాలను తమ నియంత్రణలో పెట్టుకున్న హౌథీ రెబల్స్‌ నవంబర్‌ మధ్య నుంచి ఎర్ర సముద్రంలో వెళుతున్న నౌకలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్నారు. గాజా లోని హమాస్‌కు సంఘీభావంగా రెబల్స్‌ ఈ దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌తో స్పష్టమైన సంబంధం లేని నౌకలపైనా ఈ దాడులు సాగడం గమనార్హం. వీరికి ఇరాన్‌ అండదండలున్నట్టు కథనం. 

దాడులకు బాధ్యత తమదేనంటూ ఈ యెమనీ రెబల్స్‌ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఎమ్వీ సాయిబాబాపై హౌథీలు దాడి జరిపారనీ, ఎమ్వీ చెమ్‌ప్లూటోపై ఇరాన్‌ నుంచి డ్రోన్‌ను ప్రయో గించారనీ అమెరికా కేంద్ర కమాండ్‌ సమాచారం. దాడులకు ఎర్ర సముద్రాన్ని ఎంచుకోవడంలో ముష్కరులకు పెద్ద వ్యూహం ఉంది. ప్రపంచ నౌకా రవాణాలో 30 శాతం, వ్యాపారంలో 12 శాతం, సముద్రజలాలపై పెట్రోలియమ్‌ వాణిజ్యంలో 10 శాతం మధ్యధరా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్ర సముద్రం మీదుగానే జరుగుతాయి.

దాడుల వల్ల నౌకలు రూటు మార్చి, ఒకప్పటిలా గుడ్‌హోప్‌ అగ్రం చుట్టూ తిరిగిరావాలి. దూరం, దరిమిలా ప్రయాణకాలం పెరిగే ఈ సుదీర్ఘయానం వల్ల చమురు, దిగుమతుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు మరింత ప్రియమవుతుంది. చమురు సరఫరాలకు ప్రధానంగా ఆ ప్రాంతంపై ఆధారపడే భారత్‌కు ఇది దెబ్బ. ఇజ్రాయెల్‌ – హమాస్‌ పోరు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగడమే అందుకు నిదర్శనం.

అమెరికా, ఇజ్రాయెల్‌లను సైద్ధాంతికంగా వ్యతిరేకించే హౌథీల దాడుల దెబ్బకు ఎర్ర సముద్రం ఇప్పుడు యుద్ధ క్షేత్రమైపోయింది. గాజాకు మానవతా సాయం అందేవరకు ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అవరోధాలు కల్పించాలన్న వారి ఆలోచన ఫలిస్తోంది. దీన్ని ప్రతిఘటించి, ముష్కరుల దాడుల నుంచి రక్షణ కోసం అమెరికా గత వారం ‘ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌’ పేర బహుళ దేశీయ నౌకా దళాన్ని ప్రారంభించింది.

అయితే, అగ్రరాజ్య సారథ్యంలోని ఈ బలగంలో పలు దేశాలు చేరలేదు. సూయజ్‌ కాలువ ద్వారా వర్తకం తగ్గినందు వల్ల భారీగా నష్టపోయే ఈజిప్ట్‌ ఇంతవరకు హౌథీల దుశ్చర్యలను ఖండించలేదు. చివరకు యెమెనీ గ్రూపుతో శాంతి ప్రక్రియ చర్చలు సాగిస్తున్న సౌదీ అరేబియా సైతం అమెరికా సారథ్య నౌకాబలగాన్ని సమర్థించలేదు. 

ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన శత్రుత్వం వహించే పాకిస్తాన్‌ ఉన్నందున, మిగిలిన దిక్కుల్లో వాణిజ్యానికి సంబంధించి ఆచరణలో భారత్‌ ద్వీపదేశమే. అందుకే, మనకు సముద్ర వర్తకం కీలకం. మన దేశ వాణిజ్య పరిమాణంలో 98 శాతం, విలువలో 68 శాతం సముద్ర మార్గాల్లోనే సాగుతాయి. దానికి తగ్గట్టే హిందూ మహాసముద్ర ప్రాంతానికి కావలి పాత్రను భారత్‌ పోషిస్తోంది. వాణిజ్యం పెరగాలంటే, మిత్రదేశాలతో కలసి ఈ సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచాలి. ఆ పనే భారత్‌ చేస్తోంది.

అయితే, ఇజ్రాయెల్‌ – గాజా యుద్ధంలో సమదూరం పాటిస్తూ వచ్చిన మనకు తాజా పరిస్థితులు కొత్త బరువ నెత్తిన పెట్టాయి. సోమాలీ సముద్ర దొంగల్ని నిరోధించేందుకు ఈ సరికే గస్తీ సాగిస్తున్న భారత్, ఇకపై వాణిజ్య నౌకల్ని భద్రంగా ఎర్ర సముద్రం దాటించే పని తప్పదు. ఒకవేళ దాడులు సాగితే, అది మరో యుద్ధభేరి అవుతుంది. అందుకే, ఈ సమస్యలన్నిటికీ అసలు పరిష్కారం గాజాలో యుద్ధానికి తెర పడడం, శాంతి నెలకొనడమే!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement