కాలం మారినప్పుడు, కొత్త అవసరాలు తరుముతున్నప్పుడు, అనుకోని సమస్యలు తలెత్తినప్పుడు మనుషుల మధ్య బంధాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. దేశాల మధ్య దౌత్య సంబంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్‌రోవ్ సోమ, మంగళవారాల్లో మన దేశంలో జరిపిన పర్యటనను నిశితంగా గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. అంతేకాదు...పాకిస్తాన్‌లో నిన్న, ఈరోజు ఆయన సాగించిన పర్యటన కూడా దీన్నే వెల్లడిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలానికి సోవియెట్ యూనియన్‌గా వున్న రష్యా మనకు అత్యంత ఆత్మీయ దేశం. ఎలాంటి సమస్యలు తలెత్తినా దృఢంగా మద్దతిచ్చిన దేశం. సోవియెట్ యూనియన్ కుప్పకూలి, అది వేర్వేరు దేశాలుగా ఏర్పడి అస్థిరత్వంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. అమెరికాతో చెలిమి అంకురించింది. సహజంగానే ఈ పరిణామాలు రష్యాను కలవరపరిచాయి. ‘ఇండో–పసిఫిక్ వ్యూహం’ ఇరుసుగా ఆవిర్భవించిన చతుర్భుజ కూటమి (క్వాడ్)లో భారత్, అమెరికాలు భాగస్వాములయ్యేలా ఈ స్నేహం విస్తరించింది. ఇదంతా రష్యాకు మింగుడుపడటం లేదని ఆ దేశం మాటలూ, చేతలూ నిరూపిస్తూనే వున్నాయి. అసలు ‘ఇండో–పసిఫిక్’ భావనకే రష్యా వ్యతిరేకం. అందుకు బదులు ‘ఆసియా–పసిఫిక్’గా వ్యవ హరించాలని... తనతోపాటు చైనా సహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలనూ భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం కోరుకుంటోంది. అఫ్ఘానిస్తాన్ శాంతిప్రక్రియలో తాలిబన్‌లు పాలు పంచుకోవటం సరైందేనని రష్యా అంటుండగా... అక్కడున్న అన్ని వర్గాలతోపాటు, ఇరుగుపొరుగు దేశాల భాగస్వామ్యం కూడా తప్పనిసరని మన దేశం భావిస్తోంది. ఈ నేపథ్యంలో లవ్‌రోవ్ పర్యటన మన దేశంలో మొక్కుబడిగానే సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా వుండటంతో లవ్‌రోవ్ ఆయన్ను కలవలేకపోయారు. లవ్‌రోవ్ సోమవారమే వచ్చినా ఆరోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలూ లేవు. ఆ మర్నాడు విదే శాంగమంత్రి జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన నేరుగా పాకిస్తాన్ వెళ్లారు. ఇక్కడికి రాదల్చుకున్నప్పుడు దాంతో పాకిస్తాన్‌ను జత చేయొద్దన్నది మొదటినుంచీ భారత్ కోరిక. 2012 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశానికి వచ్చినప్పుడు ముందుగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్తారన్న వార్తలొచ్చాయి. ఆ దేశం అందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంది కూడా. కానీ చివరి నిమిషంలో ‘మీ దేశం రావటం కుదరదంటూ పాకిస్తాన్‌కు వర్తమానం పంపి, ఆయన భారత్‌కు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత కాలంలోనూ అదే జరిగింది. కానీ ఈసారి మాత్రం లవ్‌రోవ్ అందుకు భిన్నమైన పంధాను అనుసరించారు. ఇది కూడా అలకలో భాగం కావొచ్చు. నిరుడు జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు రద్దయింది. కరోనా ఉగ్రరూపం దాల్చినందువల్ల రద్దయిందని ఇరు దేశాలూ చెప్పినా దాన్ని ప్రపంచం పెద్దగా విశ్వసించలేదు.
దౌత్య సంబంధాల్లో ఏదీ దానికది స్వతంత్రంగా వుండదు. ఒక దేశం తీసుకునే నిర్ణయమైనా, విధానమైనా దానితో వివిధ దేశాలకుండే సంబంధాలను ప్రభావితం చేస్తుంది. 2016నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు, అది క్రిమియాను దురాక్రమించ టంవంటి పరిణామాలతో ఆ రెండు దేశాల సంబంధాలూ బాగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచీ ప్రపంచంలో ఎవరూ రష్యాకు సన్నిహితం కారాదన్న విచిత్ర విధానానికి అమెరికా తెర తీసింది. తన నాయకత్వంలోని నాటోలో భాగస్వామిగా వున్న టర్కీ తన మాట బేఖాతరుచేసి నిరుడు రష్యా నుంచి అత్యంతాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిందన్న దుగ్ధతో ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించింది. మనపై కూడా ఎస్–400 విషయంలో చాన్నాళ్లపాటు ఒత్తిడి తెచ్చింది. పర్యవసానంగా మన దేశం సందిగ్ధంలో పడింది కూడా. చివరకు 2018 అక్టోబర్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆ ఒప్పందంపై సంతకాలయ్యాయి. దానిపై ఇప్పటికీ అమెరికా మనల్ని హెచ్చ రిస్తూనేవుంది. అయితే భారత్ తమ మిగ్ యుద్ధ విమానాలను కాదని, రఫేల్‌ను ఎంచుకోవటం రష్యాకు మింగుడుపడలేదు. అంతమాత్రాన భారత్–రష్యా సంబంధాలు పూర్తిగా అడుగంటాయని భావించనవసరం లేదు. తాజా పర్యటనలో రష్యా రక్షణ సామగ్రిని భారత్‌లోనే ఉత్పత్తి చేసేందుకు గల అవకాశాలపై చర్చించారు. ఈ ఏడాది ఆఖరులో జరగాల్సిన ఇరు దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుకున్నారు. తమనుంచి కొనుగోలు చేయాల్సిన రక్షణ సామగ్రిపైనా ఆ సందర్భంగానే ఇరు దేశాల రక్షణమంత్రులూ చర్చిస్తారని లవ్‌రోవ్ చెప్పారు.
మనతో గిల్లికజ్జాలు పెట్టుకునే చైనాతో రష్యా అంటకాగటం, పాకిస్తాన్‌కు క్రమేపీ సన్నిహితం కావటం మన దేశానికి నచ్చటం లేదు. దానికి తగినట్టే తన తాజా పాక్ పర్యటనలో లవ్‌రోవ్ ఆ దేశానికి రక్షణ సామగ్రి విక్రయించటానికి, దాంతో కలిసి సముద్ర, పర్వత ప్రాంత సైనిక విన్యాసాలు జరపటానికి అవగాహన కుదుర్చుకున్నారు. కాలపరీక్షను తట్టుకుని నిలబడిన బంధాలు సడలకూడదనుకుంటే రెండు దేశాలూ చారిత్రక స్పృహతో మెలగాలి. తాత్కాలిక ఫలితాల కోసం కాక, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి నిలపాలి. భవిష్యత్తరాలకు సుస్థిరమైన, భద్రమైన ప్రపం చాన్ని... ఘర్షణలకు తావులేని ప్రపంచాన్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలి.
చిక్కుల్లో భారత్–రష్యా బంధం
Published Fri, Apr 9 2021 12:43 AM | Last Updated on Fri, Apr 9 2021 1:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment