నిఖార్సయిన వర్గ విభజన చోటు చేసుకుంటున్నది. కులమూ, వర్గమూ కలగాపులగమైన సమాజం మనది. పెత్తందారీ తోడేళ్లు కులాల మేకతోళ్లు కప్పుకొని మందల్లో దూరిన ప్రమాదకర వ్యవస్థ మనది. ఇప్పుడు ఒక రేడియం స్టిక్కర్ అడ్డుగీత రెండు వర్గాల మధ్య విభజన రేఖలా చీకట్లో కూడా మెరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక శక్తుల పునరేకీకరణ రాజకీయ శిబిరాల్లో వేగంగా జరుగుతున్నది.
‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ పేరుతో వైసీపీ పతాకాల నీడలో పీడిత వర్గాల ప్రజలు రాష్ట్రమంతటా కదం తొక్కుతున్నారు. అగ్రకుల పేదల సౌహార్దం ఈ యాత్రలకు వన్నె తెస్తున్నది. గడిచిన ఏడు రోజుల్లో 19 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరిగాయి. 19 బహిరంగ సభలు జరిగాయి. ఈ సభల్లో ఐదు లక్షలమందికి పైగా జనం పాల్గొన్నట్టు అంచనా. ఇంకా బస్సు యాత్ర పొడుగునా మద్దతు ప్రకటించినవారూ, బస్సులో ఉన్న నాయకుల సందేశాన్ని గ్రామగ్రామాన విన్న వారినీ కలుపుకుంటే ఈ సంఖ్య బహుశా రెట్టింపు ఉంటుంది.
ఇంకో యాభై రోజులపాటు ఈ యాత్రలు కొనసాగనున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను గమనంలోకి తీసుకుంటే దాదాపు కోటిమంది సాధికార యాత్రల్లో ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. పేద వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ నేతలు బలహీన వర్గాల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఆలంబనతో సాధికారత పథంలోకి దూసుకొనిపోవలసిన ఆవశ్యకతను వారికి బోధిస్తు న్నారు. పాల్గొంటున్న జనం కూడా నాటి ప్రభుత్వ విధానాలు, నేటి ప్రభుత్వ విధానాల మధ్య గల తేడాలను బేరీజు వేసుకుంటున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే బహిరంగ సభల్లో ప్రస్తావించిన ఒక పోలిక ఇప్పుడు జనం చర్చల్లో నిత్యం నానుతున్నది. పేదల సంక్షేమం కోసం తాము ‘డీబీటీ’ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానాన్ని అనుసరిస్తుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘డీపీటీ’ (దోచుకో... పంచుకో... తినుకో) అమలు చేశారని ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు జనం సాక్షిగా రుజువులు కనిపిస్తున్నాయి. అమ్మవొడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, పెన్షన్ కానుక వగైరా 29 స్కీముల పేరుతో అక్టోబరు చివరి నాటికి 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలను జనం ఖాతాల్లో జగన్ ప్రభుత్వం వేసింది. జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యాకానుక తదితర తొమ్మిది నాన్ డీబీటీ స్కీముల కింద మరో లక్షా 67 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది.
చంద్రబాబు కాలం నాటి రాష్ట్ర బడ్జెట్‌తో జగన్ ప్రభుత్వం బడ్జెట్ దాదాపుగా సమానం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన ప్రకారం బాబు సర్కార్ చేసిన అప్పుల కంటే జగన్ సర్కార్ చేసిన అప్పులు తక్కువ. మరి ఈ ప్రభుత్వం జనం ఖాతాల్లోకి పంపించిన డబ్బును బాబు హయాంలో దేనికి ఉపయోగించారు? జగన్ ప్రభుత్వ డీబీటీ, నాన్ డీబీటీ స్కీముల ద్వారా 1 కోటి 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రతి కుటుంబానికీ ఒకటి కంటే ఎక్కువ పథకాలు లభించాయి. ఈ కుటుంబాల వారికి సగటున 3 లక్షల రూపాయల లబ్ధి జరిగింది. మరి బాబు హయాంలో ఈ డబ్బులు పొందిన లబ్ధిదారులెవరు?
చంద్రబాబు హయాంలో అమలైన సంక్షేమ పథకాలు అరకొర మాత్రమే! సంక్షేమ పెన్షన్ల మీద 53 మాసాల్లో జగన్ ప్రభుత్వం 81 వేల కోట్లు ఖర్చుపెడితే 60 మాసాల్లో బాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చు 20 వేల కోట్లు మాత్రమే! ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నీరుకార్చారు. ఇంతకు మినహా ఆయన అమలుచేసిన డీబీటీ స్కీములు ఏమీ లేవు. అప్పుడు పేద లబ్ధిదారులు ప్రయోజనం పొందిన స్కీములు తక్కువే అయినా పెత్తందారీ లబ్ధిదారులు మాత్రం కళ్లు చెదిరే మొత్తాలను స్కాముల ద్వారా కొల్లగొట్టారు. ఇందులో ఆరు స్కాములపై ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసింది.
371 కోట్ల స్కిల్ స్కామ్‌లో లబ్ధిదారుగా చంద్రబాబు వైపే వేళ్లన్నీ చూపెడుతున్నాయి. 144 కోట్ల ఫైబర్‌నెట్ స్కామ్‌లో కూడా ఆయనే తుది లబ్ధిదారుగా సీఐడీ నిర్ధారణకొచ్చింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్‌లో అధమ పక్షం రెండు వేల కోట్ల భూ దోపిడీ జరిగింది. ఇందులో చంద్రబాబు కుటుంబంతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని, పవన్ కల్యాణ్, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమలను లబ్ధిదారులుగా గుర్తించారు. 4,500 కోట్ల విలువైన అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణ, లింగమనేని కుటుంబాలు ముఖ్య లబ్ధిదార్లు. మద్యం కుంభ కోణం విలువ 5,200 కోట్లు. చంద్ర బాబుతోపాటు అయ్యన్నపాత్రుడు, సుధా కర్ యాదవ్ (యనమల వియ్యంకుడు), ఎస్పీవై రెడ్డి లబ్ధిదారులు. ఇసుక కుంభ కోణం విలువ 10 వేల కోట్లు. చంద్ర బాబుతోపాటు పీతల సుజాత, దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్‌లపై సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ ఆరు స్కామ్‌ల మీద సీఐడీ తగిన ఆధారాలతో కేసులను నమోదు చేసింది. ఇవే కాకుండా బలమైన ఆరోపణలతో డజన్ల కొద్దీ స్కాములున్నాయి. ఒక్క విశాఖపట్నం నగరంలోనే రూ. లక్ష కోట్ల విలువైన 20 వేల ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ‘హుద్ హుద్’ తుపాను సమయంలో వాటికి సంబంధించిన భూరికార్డులు గల్లంతయి నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఆ సమయంలోనే చంద్రబాబు విశాఖలో మకాం వేసి తుపానుపై తాను యుద్ధం చేసినట్టు ప్రకటించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 వేల కోట్ల విలువైన గ్రానైట్, ఇనాం, ప్రైవేట్ భూములను చెరపట్టినట్టు ఆధారాలు లభిస్తు న్నాయి. పవన విద్యుత్ ఒప్పందాల్లో 11,625 కోట్లు కొల్లగొట్టారు. అమరావతి బాండ్ల జారీ ముసుగులో చినబాబు, పెద బాబులు రెండు వేల కోట్ల పెట్టుబడులు బినామీ కంపెనీల ద్వారా పెట్టినట్టు ఆరోపణ లొచ్చాయి.
నీరూ–చెట్టూ పథకంలో 24 వేల కోట్లను కైంకర్యం చేశారు. ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కాంట్రాక్టుల్లో 4 వేల కోట్లు స్వాహా చేశారు. తాత్కాలిక సచివాలయ భవనం కాంట్రాక్టులో 800 కోట్ల కమిషన్ బాబుకు చేరినట్టు గుర్తించిన ఐటీ శాఖ ఆయనకు నోటీసుల మీద నోటీసులు జారీ చేసింది. అమరావతి హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడిలో 380 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌కో కాంట్రాక్టుల్లో 675 కోట్ల మూలవిరాట్టుకు ముడుపు కట్టినట్టు సమాచారం.
జెన్‌కో థర్మల్ ప్రాజెక్టు టెండర్లలో 670 కోట్లు, మెడికల్ కిట్ల కొనుగోళ్లలో 1800 కోట్లు అవినీతి ఖాతాలో పడి నట్టు రుజువులున్నాయి. ఇవి కొన్ని మాత్రమే! ఇక రాజధాని పేరు మీద తెరలేపిన అవినీతి ఒక అంతులేని అగాధం. దిగితే తప్ప దాని లోతు తెలియదు. బాబు జమానాలో దాదాపు ఆరు లక్షల కోట్ల మేరకు స్వాహాకార్యం జరిగినట్టు బలమైన ఆరోపణలున్నాయి. ఈ మొత్తంలో వాటాలు పొందిన వారిలో పెత్తందార్లు, ఉప పెత్తందార్లు చాలామందే ఉన్నారు.
జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదార్లు సాధికారత పేరుతో జైత్రయాత్రలు చేస్తుంటే మన పెత్తందారీ, పిల్ల పెత్తందారీ లబ్ధిదారులు చూస్తూ ఊరుకుంటారా? ఎంతమాత్రం ఊరుకోరు. స్కిల్ స్కామ్‌లో చంద్ర బాబు అరెస్ట్ సందర్భాన్ని ఉపయోగించుకొని సాధికారత యాత్రలను మరుగుపరచడానికి శతవిధాలా ప్రయత్నించారు. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పార్టీ పేరుతోనూ, ఇతర సంఘాల పేరుతోనూ ఈ పిలుపులు ఇచ్చినప్పటికీ ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికులు ఒకే ఒక్క సామాజిక వర్గం వారు.
ఈ కార్యక్రమాల కోసం సోషల్ మీడియా వేదికగా జరిగిన సన్నాహాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారి వివరాలను పరిశీలించినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది. బాబు మెడికల్ బెయిల్‌పై విడుదలై విజయవాడ చేరుకున్న సందర్భంగా పబ్లిక్ షోను ఆర్గనైజ్ చేసిన వారిని పరిశీలించినప్పుడు కూడా ఇదే సంగతి తేటతెల్లమైంది. నలభయ్యేళ్ల చరిత్ర, అందులో ఇరవయ్యేళ్లు అధికారంలో ఉన్న పార్టీ చివరికి ఒక సామాజికవర్గంపైనా, పిడికెడు మంది ఇతరులపైనా ఆధారపడాల్సి రావడం ఒక విషాదం.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ బలాబలాల పొందిక ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకున్నది. ఇప్పుడు మేకతోళ్లు కప్పుకున్న తోడేళ్లను మంద గుర్తించ గలుగుతున్నది. ఐదేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్ల ప్రజాధనాన్ని భోంచేసిన పెత్తందారీ శక్తులు ఒక పక్కన, నాలుగున్నర లక్షల కోట్లను పైసా వృథా కాకుండా ప్రజా సంక్షేమానికి తరలించిన ప్రజాశక్తులు పక్కన మోహరించాయి. అధికారానికి దూరమైనప్ప టికీ ధనబలం కలిగిన పెత్తందారీ శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.
ఇతర చిన్నాచితక రాజకీయ పార్టీలను అదుపులోకి తీసుకొని తనకు అను కూలంగా తోలుబొమ్మలాటలాడించగల సామర్థ్యం పెత్తందారీ పార్టీకి ఉన్నది. మీడియా మీద ఉన్న గుత్తాధి పత్యంతో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసుకోగల ప్రావీణ్యం దానికున్నది. వ్యవస్థ లను నియంత్రించి చట్టానికీ, ధర్మానికీ తాను కోరు కున్న భాష్యం చెప్పగల నేర్పరితనం దాని సొంతం. రాబోయే యుద్ధంలో పేదవర్గాలు గెలుపొందాలంటే నిరంతర జాగరూకత ఒక్కటే మార్గం. రచ్చబండలపై రాజకీయ పార్టీల జమాఖర్చులను దండోరా వేయడమే శరణ్యం.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
భావజాలం గీసిన భూమధ్య రేఖ!
Published Sun, Nov 5 2023 3:48 AM | Last Updated on Sun, Nov 5 2023 10:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment