ఎనిమిది రోజులు ఆసుపత్రిలో మా అక్క నరకం చూసింది. మంగళవారం రాత్రి 10 గంటలకు కూడా మాట్లాడింది. మీరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మాట్లాడటంతో మేం చాలా ఆనందపడ్డాం త్వరలో కోలుకుం టుందని ఆశపడ్డాం. రాత్రి 12.30 గంటలకు చనిపోయినట్లు డాక్టర్ చెప్పడంతో కన్నీరు ఆగలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. యాసిడ్ దాడితో ఊపిరితిత్తులు మొత్తం కాలిపోయాయి. ఓ కన్ను కూడా పోయింది.
ఏలూరు టౌన్: ఏలూరు గ్జేవియర్ నగర్ మోనాస్ట్రీ ప్రాంతంలో ఉంటున్న యడ్ల ఫ్రాన్సికపై ఈనెల 13న ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడగా.. బాధితురాలు గుంటూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె స్వగ్రామం దెందులూరుకు తరలించారు.
ఈ నేపథ్యంలో ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో కేసును హత్య కేసుగా మారుస్తూ పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసును సెక్షన్ 302, 120(బీ), 341, 326–ఏ, రెడ్‌విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్3(2)(4) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) యాక్ట్ 1989 అండ్ సెక్షన్ 6(1) ఆఫ్ పాయిజన్ యాక్ట్ –1919 కింద కేసు నమోదు చేశారు. కేవలం 15 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని మెరుగైన వైద్యానికి విజయవాడ జీజీహెచ్, ఆధునిక వైద్యచికిత్సకు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి ఎంత ఖర్చయినా భరించి మంచి వైద్యచికిత్స అందించాలని తీవ్రంగా శ్రమించారు. యాసిడ్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంతో మృత్యువుతో పోరాడిన ఫ్రాన్సిక చివరికు ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment