ఏలూరు టౌన్ : ఏలూరు గ్జేవియర్ నగర్‌లోని ఒక డెంటల్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యడ్ల ఫ్రాన్సికా (35)పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దారికాచి యాసిడ్‌తో దాడి చేశారు. ఆమెకు వివాహమై ఏడేళ్లు కాగా, ఆమె భర్త దెందులూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్లుగా భర్త నుంచి విడిగా ఉంటోంది. ఏలూరు నగరంలో ఉంటున్న ఆమె.. స్థానిక స్మార్ట్ డెంటిస్ట్రీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రిలో విధులు ముగించుకొని ఒంటరిగా స్కూటీపై ఇంటికి వెళుతుండగా, ఆమె నివాసానికి సమీపంలో దారికాచిన ఇద్దరు ఆగంతకులు తమ బైక్‌తో అటకాయించారు.
వెంటనే ఆమైపె యాసిడ్‌తో దాడి చేశారు. యాసిడ్ ప్రభావంతో మంటలు తాళలేక ఆమె కేకలు వేయడంతో నిందితులు అకక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గుర్తించి వెంటనే ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సమాచారం అందుకున్న ఏలూరు రేంజి డీఐజీ జేవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలు వారి నుంచి ఆరా తీశారు. అనంతరం సంఘటనాస్థలానికి చేరుకొని దాడి జరిగిన ప్రదేశాన్ని బాధితురాలి స్కూటీని, ఆమె నివాసాన్ని పరిశీలించారు.
వారి తల్లిదండ్రులతో ఇంటివద్ద ఈ ఘటనపై ఆరా తీశారు. ప్రాథమిక వైద్యం అనంతరం ఆమెను మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఐజీ మాట్లాడుతూ పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆమె భర్త వైపు నుంచి.. అలాగే పరిచయమున్న ఇతర వ్యక్తులెవరైనా ఈ దాడికి పాల్పడ్డారా అనే వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలికి 40 శాతం ముఖం కాలిపోయినట్టు వైద్యుల ద్వారా అందిన సమాచారం. బాధితురాలు ఆమె చెల్లి కుటుంబంతో పాటు ఏలూరులో ఉంటోంది. బాధితురాలి స్వస్థలం కూడా దెందులూరు అని, తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment