
స్వర పేటిక తెగినా వైద్యులు ఊపిరి పోశారు
పటమట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో స్వరపేటిక తెగిన ఓ వ్యక్తికి విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్య బృందం, సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాలలంక గ్రామానికి చెందిన ఎస్.పవన్‌కల్యాణ్ (35) చేపలు అమ్మే నిమిత్తం సంతకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇనుప కంచైపె పడి తీవ్రంగా గాయపడ్డారు. అతని మెడ ముందు భాగంలో స్వర పేటిక పూర్తిగా తెగిపోయింది. ఊపిరి ఆడటం కష్టంగా ఉండటంతో ఏలూరు జీజీహెచ్ నుంచి విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. రోగి ఆర్థిక స్థితిని గమనించి ఈఎన్‌టీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ కొణిదే రవి, సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీ రావు రూ.50 వేల ఖరీదు చేసే టి. ట్యూట్‌ను ముంబై నుంచి కొనుగోలు చేసి షియాన్–యాన్‌లీ పద్ధతి ద్వారా అమర్చారు. శస్త్ర చికిత్స విజయవంతం కావటంతో రోగి పూర్తిగా కోలుకుని మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన బృందాన్ని శుక్రవారం సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్ కుమార్ అభినందించారు.