
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముసునూరు: పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన పింగుల ఏసుబాబు(48) ఏడాదికాలంగా మండలంలోని గుళ్ళపూడి శివారు గుడిపాడుకు చెందిన నెక్కరగంటి సత్యనారాయణ వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నాడు. గురువారం తోటలో గడ్డి కోసుకు రావడానికి వెళ్ళాడు. సాయంత్రమైనా ఇంటికి రాలేదు. శుక్రవారం పామాయిల్ తోటలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్సై సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని పంచనామా అనంతరం నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. మృతుడి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.