
వక్ఫ్ భూములపై కుట్ర రాజకీయాలు
ఏలూరు టౌన్: కేంద్రంలోని ఎన్‌డీఏ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం సోదరుల మనోభావాలను దెబ్బతీస్తూ కుటిల రాజకీయాలకు తెరతీశాయని, దేశంలో రాజ్యంగాన్ని అమలు చేయకుండా సొంత అజెండాతో పనిచేస్తున్నాయని వక్ప్ బోర్డు ఏలూరు జిల్లా మాజీ చైర్మన్ డాక్టర్ కామిలుజమ అన్నారు. ఏలూరులో ఆయన ఆదివారం మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా వక్ప్ ఆస్తులు, భూములు, అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులపై ఏదైనా వివాదం ఏర్పడితే పరిష్కరించేందుకు హైకోర్టు న్యాయమూర్తి నియమించిన ట్రిబ్యునల్ ఉందని, నూతనంగా ప్రవేశపెట్టిన బిల్లులో కలెక్టర్లకు అధికారం ఇవ్వడంపై సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిపాలన, నియంత్రణకు 1995లో ప్రత్యేకించి వక్ఫ్ చట్టం రూపొందించారని గుర్తు చేశారు. ఈ చట్టం మేరకు వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరుతో ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారని చెప్పారు. ముస్లిం సమాజాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై యావత్ ముస్లిం సమాజం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందని, దేశంలో ముస్లిం సోదరులకు జీవించే హక్కును హరించేలా ప్రభుత్వాలు తీవ్రమైన నిర్ణయాలు, చర్యలకు పాల్పడడం విచారకరమన్నారు.
వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ కామిలుజమ