
రైతు కంట్లో కారం
మిర్చి ధరలు పతనం
తాడేపల్లిగూడెం రూరల్: దేశవాళీ లావు రకం మిర్చి పంట ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో గతేడాది ధరను చూసి ఈ ఏడాది సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి విశాఖ వరకు ప్రధానంగా దేశవాళీ లావు రకాలను పచ్చళ్లకు, కారాలకు వినియోగిస్తుంటారు. ప్రధానంగా గుంటూరు, వేలేరుపాడు, జంగారెడ్డిగూడెం, ఆరిపాటిదిబ్బలు, పంగిడి, భద్రాచలం, సత్తుపల్లి, వేమసూరి, వెంకటాపురం, చర్ల ప్రాంతాల్లో దేశవాళీ లావు రకాలను సాగు చేస్తుంటారు. ఇలా పండించిన పంటను గుంటూరు, తాడేపల్లిగూడెంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఏటా రైతులు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు.
గూడెంలో 25 వేల టన్నుల వరకు..
తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏటా 20 వేల నుంచి 25 వేల టన్నుల మిర్చి అమ్మకాలు జరుగుతాయి. ధర బాగుండటమే ఇందుకు కారణం. ఇక్కడ 100 నుంచి 150 మంది కమీషన్ వ్యాపారులు రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి బయట మార్కెట్‌కు విక్రయిస్తారు. ఈ క్రమంలో విశాఖ వరకు ఇక్కడ నుంచే మిర్చి ఎగుమతి జరుగుతుంటుంది.
పెట్టుబడులు పెరిగి..
గతేడాది ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ సీజన్ లో రైతులు మిర్చిని ఎక్కువగా పండించారు. ఈ క్రమంలో విస్తీర్ణం పెరిగినా చీడపీడల కారణంగా దిగుబడులు లేవని రైతులు అంటున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లకు దిగుబడులు పడిపోయాయని చెబుతున్నారు. గతేడాది కిలో రూ.500 నుంచి రూ.700 పలకగా ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ.200 నుంచి రూ.300కు వ్యా పారులు కొంటున్నారని అంటున్నారు. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట పండించిన రైతులకు నష్టాలు మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మిర్చిలో తేజ వైరెటీ సన్నాలు కిలో రూ.80 నుంచి రూ.100 కూడా పలకడం లేదని వాపోతున్నారు.
రూ.90 వేలు నష్టం
మిర్చి పంటకు ఎకరాకు ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు కలిపి రూ.1.50 లక్షల వరకు ఖర్చయ్యింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి దిగుబడులు, ధర పతనం కావడంతో ఆశించిన ధర లభించడం లేదు. పంట మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తే క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే వస్తోంది. దీంతో ఎకరానికి దాదాపు రూ.90 వేల వరకు నష్టం చవిచూడాల్సి వస్తోంది. ఈ సీజన్‌లో మిర్చి రైతుకు కన్నీళ్లే మిగిలాయి.
– వెలిశల రాధాకృష్ణ, కల్లూరుగూడెం, వేమసూరి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ

రైతు కంట్లో కారం